శనివారం 30 మే 2020
Karimnagar - Feb 01, 2020 , 04:06:57

కల్యాణ వేడుక వైభవం

కల్యాణ వేడుక వైభవం
  • నగరంలో కనుల పండువలా వేంకటేశ్వరుడి వివాహ వేడుక
  • తిలకించి పులకించిన వేలాది భక్తజనం

సుభాష్‌నగర్‌: ఈ నెల 25 నుంచి ప్రారంభమైన శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం కల్యాణ వేడుక వైభవంగా జరిగింది. ముందుగా ఉదయం 5 గంటలకు స్వామి వారికి సుప్రభాతసేవ, 7.30 గంటలకు తిరుప్పావడ సేవ, 8 గంటల నుండి ఆరాధన, చతస్థానార్చన, యాగశాలలో విశేష హోమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర పద్మావతి, అలివేలు మంగ విగ్రహాలను అందంగా అలంకరించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో ప్రతిష్టించి వేద పండితులు స్వామి వారి కల్యాణాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌-రజిత దంపతుల ఆధ్వర్యంలో కనుల పండువగా జరిపించారు. శ్రీ పద్మావతి అమ్మవారికి సాంప్రదాయం ప్రకారం పద్మశాలి సంఘం తరుఫున స్వామి వారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు, సారె సమర్పించారు. అలాగే స్థానిక 40వ డివిజన్‌లోని గుండి హనుమాన్‌ ఆలయ కమిటీ సభ్యులు స్వామి వారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారి కల్యాణాన్ని తిలకించారు.


అనంతరం తదీయారాధన, అన్నదానం, సాయంత్రం 6 గంటలకు శ్రీ విష్ణుసహస్రనామ పారాయణం, పరిహర గరుడ వాహన సేవ, హోమం, పూర్ణాహుతి, బలిహరణ, తీర్థగోష్ఠి, సాంస్కృతిక కార్యక్రమాలు, రాత్రి 9 గంటలకు స్వామి వారికి ఏకాంత సేవ నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం వైద్యం, తాగు నీరు, తదితర సౌకర్యాలను ఆలయ కమిటీ కల్పించింది. స్వామివారిని దర్శించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరాగా, అసౌకర్యం కలుగకుండా బారీ కేడ్లను ఏర్పాటు చేశారు. కల్యాణం అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన పది వేల లడ్డూలను భక్తులకు అందజేయడంతో పాటు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమాల్లో సీఎంఓ కార్యదర్శి వేణుగోపాల్‌రావు, ఆలయ ఈఓ కిషన్‌రావు దంపతులు, నగర మేయర్‌ వై సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్లా స్వరూపరాణి-హరిశంకర్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యానాయణ, కార్పొరేటర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


logo