సోమవారం 01 జూన్ 2020
Karimnagar - Feb 01, 2020 , 03:57:33

మొక్కలన్నింటికీ జియో ట్యాగింగ్‌ చేయాలి

మొక్కలన్నింటికీ జియో ట్యాగింగ్‌ చేయాలి
  • హరితహారం, ట్రాక్టర్ల కొనుగోలుపై అధికారులతో సమీక్ష
  • కలెక్టర్‌ శశాంక ఆదేశం

(కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ)హరితహారంలో నాటిన మొక్కలన్నింటికీ వెంటనే జియో ట్యాగింగ్‌ పూర్తి చేయాలని కలెక్టర్‌ శశాంక ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో హరితహారం, ట్రాక్టర్ల కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ హరితహారంలో నాటిన మొక్కల రక్షణకు వాచ్‌ అండ్‌ వార్డును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వాచ్‌ అండ్‌ వార్డుకు వెంట వెంటనే పేమెంట్‌ చేయాలని, నాటిన మొక్కల్లో బతికిన వాటి వివరాలను అందజేయాలని చెప్పారు. అన్ని గ్రామాల్లో గ్రీన్‌ ప్లాన్‌ ప్రణాళికలు తయారు చేసుకోవాలని, కొత్తగా మొక్కలు నాటాలని పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి 2-3 కిలోమీటర్ల ఎవెన్యూ ప్లాంటేషన్‌ చేయాలని, రోడ్డుకు రెండువైపులా ఒక మీటర్‌ ఎత్తు ఉన్న మర్రి, వేప, రావి, చింత మొక్కలను నాటి ట్రీగార్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. 


జాతీయ రహదారులు రాష్ట్ర హైవే రోడ్లకు రెండు వైపులా అటవీశాఖ, ఆర్‌అండ్‌బీ పంచాయతీ రోడ్లకు రెండు వైపులా డీఆర్డీఓ ద్వారా మొక్కలు నాటాలన్నారు. ప్రతి మండలంలోని 4-5 గ్రామాల్లో బ్లాక్‌ ప్లాంటేషన్‌ ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాలకు మంజూరైన వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డుల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అన్ని గ్రామాల్లో 4-5 చోట్ల కుండీలు ఏర్పాటు చేయించాలన్నారు. ట్రై సైకిళ్ల ద్వారా ప్రతిరోజు ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను కుండీల్లో వేయాలనీ, కుండీల ద్వారా చెత్తను ట్రాక్టర్లతో డంపింగ్‌ యార్డుకు తరలించేలా చూడాలని చెప్పారు. జిల్లాలో ఇంతవరకు 292 గ్రామపంచాయతీలు ట్రాక్టర్లు కొనుగోలు చేశాయనీ, మిగిలిన గ్రామ పంచాయతీలకు కూడా త్వరగా ట్రాక్టర్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వెంకటేశ్వర్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్‌, పంచాయతీరాజ్‌ డీఈ రామారావు, సహాయ కార్యనిర్వహక ఇంజినీర్‌ ఏఈఈ సౌమ్య, డివిజనల్‌ పంచాయతీ అధికారి హరికిషన్‌, గ్రామీణ ఉపాధిహామీ పథకం ఏపీడీలు, తదితరులు పాల్గొన్నారు. 


జిల్లాలో ‘ఎల్డర్‌ స్ప్రింగ్‌' 

సుభాష్‌నగర్‌: వృద్ధుల సంక్షేమం కోసం టాటా ట్రస్ట్‌ ఏర్పాటు చేసిన ఎల్డర్‌ స్ప్రింగ్‌ కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేయనున్నట్లు కలెక్టర్‌  శశాంక తెలిపారు. వృద్ధులకు వేధింపుల నుంచి రక్షణ, నిరాదరణకు గురైన వృద్ధులను వారి కుటుంబాలతో కలపడం ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో జిల్లా సంక్షేమాధికారి, టాటా ట్రస్ట్‌ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమంలో భాగంగా వృద్ధ కుటుంబాల గృహాలను సందర్శించి వారి సమస్యల సాధనకు ట్రస్ట్‌ అధికారులు ప్రభుత్వ సహాయ సహకారాలతో పని చేస్తారన్నారు. వృద్ధుల సమస్యలు తెలిపేందుకు టోల్‌ఫ్రీ నెంబర్‌ 14567 ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో హుజూరాబాద్‌ సీడీపీఓ శారద, టాటా ట్రస్ట్‌ టీం లీడర్‌ కిషోర్‌, ఫీల్డ్‌ రెస్పాన్స్‌ ఆఫీసర్‌ శ్రీలత, మైగ్రేషన్‌ కన్సల్టెంట్‌ స్వదేశ్‌, హెల్ప్‌ ఎగ్జిక్యూటర్‌ వంశీ, తదితరులు పాల్గొన్నారు.


logo