గురువారం 28 మే 2020
Karimnagar - Jan 31, 2020 , 03:54:34

సమ్మక్క జాతరపై బల్దియా దృష్టి

సమ్మక్క జాతరపై బల్దియా దృష్టి

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: నగర పరిధిలోని రేకుర్తిలో  సమ్మక్క, సారలమ్మ జాతర ఏర్పాట్లపై నగరపాలక సంస్థ దృష్టి సారించింది. నగరంలో  పంచాయితీ విలీనం తరువాత తొలిసారిగా సాగుతున్న జాతర నిర్వహణకు చర్యలు చేపట్టింది.   ఫిబ్రవరి 5 నుంచి మొదలు కానున్న జాతరకు సంబంధించి ఇప్పటి నుంచే అధికారులు పనులను ప్రారంభించారు.   ముఖ్యంగా ఈసారి జాతరకు వివిధ ప్రాంతాల నుంచి లక్షల్లో జనం తరలివచ్చే అవకాశం ఉండడంతో వచ్చే భక్తులకు ఎక్కడ ఇబ్బందులు కలుగకుండా ఉండే విధంగా తగు చర్యలు చేపడుతున్నారు. భక్తులకు నీటి సదుపాయంతో పాటుగా, మరుగుదోడ్లు, మహిళలు వస్ర్తాలు మార్చుకునే గదులు, వాహనాల పార్కింగ్‌ ఏర్పాట్లు, వైద్య సదుపాయాలు, భక్తుల క్యూ లైన్ల ఏర్పాటు దిశగా ముందుకు సాగుతున్నారు. మరో ఆరు రోజుల్లో జాతర ప్రారంభం కానునండడంతో అధికారులు తమ పనుల్లో వేగం పెం చారు.   


గురువారం బల్దియా ఇంజనీరింగ్‌ అధికారులు జాతర  స్థలాన్ని చదును చేయటంతో పా టుగా ఇతర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సమ్మక్క, సారలమ్మ గద్దెలకు రంగులు వేయడం, పారిశుధ్య పనులు మొదలు పెట్టారు.   40కి పైగా మూత్రశాలల నిర్మాణాలను ప్రారంభించారు. వీటితో పాటుగా తాత్కలిక మూత్రశాలలను కూడ అందుబాటులో ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసేందుకు తగిన ప్రణాళికబద్దంగా ముందుకు సాగుతున్నామన్నారు. ముఖ్యంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మొదటిసారి చేపడుతున్న ఏర్పాట్లల్లో ఎక్కడ లోటుపాటులు లేకుండా చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇక్కడ జరుగుతున్న పనులను బల్దియా ఈఈ రామన్‌ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బల్దియా సిబ్బంది ఎఈ గంగాధర్‌, పారిశుద్ధ్య సిబ్బంది శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. logo