శనివారం 30 మే 2020
Karimnagar - Jan 30, 2020 , 04:25:01

వైభవంగా బ్రహ్మోత్సవాలు

వైభవంగా బ్రహ్మోత్సవాలు
  • ఐదో రోజు యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ట
  • అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
  • సూర్య, చంద్రప్రభ వాహనాలపై శ్రీవారి విహారం

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: కరీంనగర్‌ మార్కెట్‌ రోడ్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవ కమిటీ నిర్వాహకులు, మంత్రి గంగుల కమలాకర్‌ నేతృత్వంలో బుధవారం ఉత్సవాలు జరుగుతున్నాయి. ఐదో రోజు బుధవారం ఉదయం ఆరాధన, సేవాకాలం, యాగశాల ప్రవేశం, ద్వార తోరణపూజ, చతుస్థానార్చన, అగ్ని మదనం, అగ్ని ప్రతిష్ట, మూల మంత్ర హవనం, ధ్వజారోహణం, తీర్థగోష్టి శాస్ర్తోక్తంగా నిర్వహించారు. వైదికులు, రుత్విక్కుల మంత్రోచ్ఛరణల మధ్య ధ్వజారోహణం జరిగింది. ఉదయం శ్రీవారు సర్వాలంకరణ భూషితుడై సూర్యప్రభా వాహనంపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. సాయంత్రం విష్ణు సహస్ర నామ పారాయణం, మూల మంత్ర హవనం, భేరిపూజ, దేవతాహ్వానం, బలిహరణ కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం శ్రీవారు ఆలయ మాడవీధుల్లో చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ, భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి అన్నదానం, ప్రసాద వితరణ చేశారు. నగరంలోని పద్మశాలీలు పద్మావతి అమ్మవారికి సారె సమర్పించారు.


అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..

బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. గీతా సంచార్‌ సత్సంగ్‌, వినాయక మార్కెట్‌, సుందర సత్సంగ్‌, శివరామకృష్ణ భజన మండలి, బోయినిపల్లి భజన బృందం భజన కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం శారద సంగీత పాఠశాల పిల్లల భక్తి సంగీతం, కళాతపస్వి రతన్‌కుమార్‌ శిష్యబృందం పేరిణి లాస్యం ఆకట్టుకున్నాయి. బొజ్జ రేవతి, ఆది శ్రీదేవి భక్తి కీర్తనలు, శ్రీలేఖ భక్తి సంగీతం, సినీ గాయని సునీత, శ్రీకాంత్‌ సంగీత విభావరి, గాజుల ప్రీతి, గజ్జెల రాజు అన్నమాచార్య కీర్తనలు భక్తిపారవశ్యంలో ముంచెత్తాయి.


logo