శుక్రవారం 05 జూన్ 2020
Karimnagar - Jan 30, 2020 , 04:23:25

పదవులకు వన్నె తేవాలి

పదవులకు వన్నె తేవాలి
  • మేయర్‌, కార్పొరేటర్లు కలిసికట్టుగా పని చేయాలి
  • పాలకవర్గం సమష్టిగా ముందుకు సాగాలి : మంత్రి గంగుల కమలాకర్‌
  • మంత్రి గంగులతో కలిసి టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లకు దిశానిర్దేశం
  • రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ సూచన
  • నగర సమగ్రాభివృద్ధి కోసం పాటుపడాలి

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: మేయర్‌, డిప్యూటీ మేయర్‌, కార్పొరేటర్లందరూ సమష్టిగా ముందుకు సాగాలనీ, పదవులకు వన్నె తెచ్చేలా పనిచేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ సూచించారు. నగరపాలక సంస్థ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు బుధవారం నగరంలోని శ్వేత హోటల్‌లో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.  ముఖ్య అతిథిగా వినోద్‌కుమార్‌ హాజరై, దిశానిర్దేశం చేశారు. అనంతరం కార్పొరేషన్‌లో నూతన మేయర్‌, డిప్యూటీ మేయర్‌ వై సునీల్‌రావు, చల్ల స్వరూపారాణిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మాట్లాడారు. నగరాభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తాననీ, తన వంతు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. 


మేయర్‌, కార్పొరేటర్లందరు సమష్టిగా నగరాభివృద్ధి కోసం కలిసి పని చేయాలనీ, ప్రజలకు అందుబాటులో ఉండి వారికి అండగా నిలువాలని కోరారు. స్మార్ట్‌సిటీ పనులను వేగవంతం చేయాలనీ, సుడా ద్వారా అభివృద్ధికి కృషి చేయాలనీ, సంబంధిత మాస్టర్‌ ప్లాన్‌, మానేరు రివర్‌ ఫ్రంట్‌లాంటి అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమనీ, గెలిచిన అభ్యర్థులకు, పదవులు వచ్చిన వారికి అహం ఉండకూడదనీ, ఓడిపోయిన వారు నిరుత్సాహ పడద్దని సూచించారు. రాజకీయాల్లో ఓర్పు ఎంతో అవసరమనీ, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉటుందని చెప్పారు. ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ముందుకు సాగాలనీ, రాష్ట్రంలోనే రెండో నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అందరం కలిసి పని చేస్తేనే కార్పొరేటర్లు, మంత్రికి, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. 


సమష్టిగా ముందుకు సాగాలి: మంత్రి

కరీంనగర్‌ను సుందరంగా తీర్చిదిద్దేందుకు కార్పొరేటర్లంతా సమష్టిగా ముందుకు సాగాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పిలుపునిచ్చారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులు వచ్చినంత మాత్రనా వారు పెద్ద, మేము చిన్న అనే భావన లేకుండా అందరూ కలిసి పని చేయాలని సూచించారు. మేయర్‌, డిప్యూటీ మేయర్లు కూడా కార్పొరేటర్లను కలుపుకొని పోయి ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయాలన్నారు. సమస్యలు ఉన్నాయంటూ తమ వద్దకు కార్పొరేటర్లు రాకుండా చూసుకోవాలని మేయర్‌, డిప్యూటీ మేయర్లు పనిచేయాలన్నారు. నగరాభివృద్ధి కోసం కార్పొరేటర్లు కూడా పూర్తిస్థాయిలో సహకరించాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, ఎంఎఫ్‌సీ చైర్మన్‌ అక్బర్‌హుస్సేన్‌, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్‌, సత్యనారాయణగౌడ్‌, నాయకులు సంతోష్‌కుమార్‌, ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి, మెతుకు సత్యం, రాజశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.logo