శుక్రవారం 05 జూన్ 2020
Karimnagar - Jan 30, 2020 , 04:22:12

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

రామడుగు: వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని  రూరల్‌ ఏసీపీ విజయసారథి సూచించారు. మండలంలోని గుండి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత అవగాహన సదస్సుకు సీఐ రమేశ్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలన్నారు. టీనేజీ యువకులు వాహనాలు నడిపే సమయంలో సంతోషంతో పాటు విషాదం కూడా ఉంటుందని గ్రహించాలన్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. మైనర్లు వాహనాలు నడపవద్దనీ, పద్దెనిమిదేళ్లు నిండినవారే వాహనాలు నడిపేందుకు అర్హులన్నారు. రోడ్డు భద్రత అనేది విద్యార్థులు ఒక సబ్జెక్టుగా భావించాలనీ, తద్వారా ప్రమాదాలను నివారించవచ్చన్నారు. కాగా పాఠశాలకు చెందిన వర్ష అనే విద్యార్థి ఫోక్సో చట్టం అంటే ఏమిటని, అభద్రతాభావం ఎప్పుడు కలుగుతుందని ఏసీపీని ప్రశ్నించారు. దీనిపై ఏసీపీ విజయసారథి మాట్లాడుతూ ఫోక్సో చట్టం ద్వారా కేసులను త్వరితగతిన విచారణ జరిపి నిందితులకు శిక్ష విధిస్తున్నట్లు తెలిపారు. 


యువతులు, మహిళలు ఆపద సమయంలో పోలీసుల రక్షణ తీసుకోవాలన్నారు. అంతకుముందు సీఐ రమేశ్‌ మాట్లాడుతూ మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులు బాధ్యులు అవుతారన్నారు. చట్ట ప్రకారం వారిపై కేసు నమోదు చేస్తామన్నారు. కాగా రోడ్డు భద్రతలో భాగంగా కరీంనగర్‌ నుంచి జగిత్యాల వెళ్లే మార్గంలో కొత్తపల్లి శివారులోని కాకతీయ కాలువ దాటిన తర్వాత ప్రధాన రహదారికి ఇరువైపులా ఏపుగా పెరిగిన ముళ్లపొదలు, పిచ్చిమొక్కలను దేశరాజ్‌పల్లి ప్రజాప్రతినిధులతో కలిసి తొలగించారు. ఈ కార్యక్రమాల్లో ఎస్‌ఐ అనూష, దేశరాజ్‌పల్లి సర్పంచ్‌ కోల రమేశ్‌, ఉప సర్పంచ్‌ కరుణాకర్‌రెడ్డి, వార్డు సభ్యులు, గుండిలో ఉప సర్పంచ్‌ మేడి శ్రీనివాస్‌, ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ, ఎస్‌ఎంసీ చైర్మన్‌ పొన్నం శ్రీనివాస్‌ గౌడ్‌, వార్డు సభ్యులు, ఉన్నత పాఠశాల, అక్షర హైస్కూల్‌ విద్యార్థులు పాల్గొన్నారు. logo