శుక్రవారం 05 జూన్ 2020
Karimnagar - Jan 29, 2020 , 04:37:32

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
  • పుట్ట మన్ను తీసుకువచ్చిన మంత్రి గంగుల దంపతులు
  • గోవిందనామ స్మరణతో మార్మోగిన ఆలయ పరిసరాలు
  • అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
  • తిలకించేందుకు తరలివచ్చిన భక్తులు

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ : నగరంలోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో మూడు రోజుల పాటు కొనసాగిన అధ్యయనోత్సవాలు సోమవారం ముగియగా మంగళవారం బ్రహ్మోత్సవాలకు అంకుర్పారణ చేశారు. మంత్రి గంగుల కమలాకర్‌ దంపతులు పుట్టమన్ను తీసుకురావడంతో ఉత్సవంలో కొత్త సందడి నెలకొన్నది. మూడు రోజుల కిత్రం బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టగా సోమవారం వరకు అధ్యయనోత్సవాలు జరిగాయి. ఇరమానుశ సూత్తన్దాది, ఉపదేశరత్తినామలై పారాయణంతో సోమవారం ముగిశాయి. దీంతో మంగళవారం ఉదయం మంత్రి గంగుల కమలాకర్‌ దంపతులు, భక్తులు శోభాయాత్రగా కమాన్‌ సమీపంలోని రామేశ్వర ఆలయానికి వెళ్లి పృథ్వీ పూజ చేసి, శాస్త్రోక్తంగా పునీత ప్రదేశంలోని భూదేవికి పూజలు చేసి పుట్ట మట్టిని పళ్లెంలలో సేకరించి, భక్తుల గోవిందనామ స్మరణల మధ్య ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. మరోవైపు ప్రధానార్చకుడు చక్రవర్తుల లక్ష్మీనారాయణ నేతృత్వంలో ఉదకశాంతి, శ్రీ విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవచనం, రక్షాబంధనం, మృత్యంగ్రహణం, అంకురార్పణ వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం స్వామి వారికి శేష వాహన సేవ చేశారు. యాగశాలలో నిత్యహవనం, మూర్తి మంత్ర హవనం, పంచసూక్తి హవనం, పూర్ణాహుతి, భేరిపూజ, దేవతాహ్వానం, బలిహరణం కార్యక్రమాలు నిర్వహించారు. 


అలరించిన సంకీర్తనలు

బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరిస్తున్నాయి. మంగళవారం ఉదయం షిర్డీసాయి భక్త భజన మండలి చేసిన భజన, సుల్తానాబాద్‌కు చెందిన వేణుగోపాలస్వామి భజన మండలి చేసిన భజన, శ్రీమాతృ మండలి చేసిన హనుమాన్‌ చాలీసా, గాయత్రీ భజన మండలి చేసిన భజన కార్యక్రమాలు అలరించాయి. సాయంత్రం 4.30 గంటల నుంచి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రాధిక, రాసమల్ల రవి, ఆనందచారి, పోతులూరి చారి బృందంతో భక్తి సంగీతం, కట్ట సిస్టర్‌, పెందోట బాలశ్రీనివాస్‌ బృందం, ఇందారపు శివప్రియ, మాధవితో అన్నమాచార్య కీర్తనలు, అంతర్జాతీయ నృత్య దర్శకులు సంగెం రాధాక్రిష్ణ బృందంతో నృత్య ప్రదర్శనలు, సురేశ్‌ శిష్య బృందంతో భక్తి సంగీతం, సుబ్రహ్మణ్యశర్మ హరికథ భక్తులను అలరించాయి.


logo