బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Jan 29, 2020 , 04:31:38

సమ్మక్క జాతర్లకు విస్తృత ఏర్పాట్లు

సమ్మక్క జాతర్లకు విస్తృత ఏర్పాట్లు

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ కే శశాంక అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జాతర్ల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని రేకుర్తి, హుజూరాబాద్‌, వీణవంక, శంకరపట్నం వంటి నాలుగు ప్రాంతాల్లో జరిగే సమ్మక్క, సారలమ్మ జాతర్లకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నందునా ఈ నాలుగు చోట్ల జాతర నిర్వహణకు నోడల్‌ అధికారులను నియమిస్తున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు. రేకుర్తికి నగర పాలక సంస్థ కమిషనర్‌ వేణుగోపాల్‌ రెడ్డి, హుజూరాబాద్‌కు స్థానిక ఆర్డీఓ పీ బెన్‌షాలోం, వీణవంకకు మెప్మా పీడీ పవన్‌కుమార్‌, శంకరపట్నానికి జడ్పీ సీఈఓ వెంకట మాధవరావుకు నోడల్‌ అధికారులుగా బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపారు. జాతర జరిగే ప్రదేశాల లే అవుట్‌ ప్లాన్‌, శానిటేషన్‌ ప్లాన్‌, కమ్యూనికేషన్‌ ప్లాన్‌ తయారు చేయాలన్నారు. ఇతర ప్రదేశాల్లో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేసి 24 గంటలు విధులు నిర్వహించాలని ఆదేశించారు. రేకుర్తి జాతరకు ఎస్‌ఆర్‌ఎస్‌పీ కెనాల్‌ నుంచి నీరు వస్తున్నందున ప్రమాదాలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. జాతర ప్రదేశాల్లో ఒక్కొక్క జోన్‌లో 20 టాయిలెట్లు, షవర్లు, బట్టలు మార్చుకునేందుకు తాత్కాలిక గదులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. టాయిలెట్‌లో నిరంతరం నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. 


 ప్రజలకు అవగాహన కలిగేలా జాతర ముఖద్వారాల వద్దనే అక్కడ ఏర్పాటు చేసిన వసతులు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. జాతర్లలో వాలంటీర్ల సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలనీ,  భక్తులు గుర్తించేలా వారికి ప్రత్యేక టీ షర్టులు అందించాలని సూచించారు. జాతర జరిగే అన్ని ప్రదేశాల్లో ప్రాపర్‌ లైటింగ్‌, ఫ్లడ్‌ లైట్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. నిరంతర విద్యుత్తు సరఫరా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. క్యూ లైన్లు, చలువ పందిళ్లు, షామియానాలు ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖను ఆదేశించారు. జాతర జరిగే ప్రతి చోటా మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. 108 వాహనాలను, అవసరమైన అన్ని మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌ లాల్‌, డీఆర్‌ఓ ప్రావీణ్య, జడ్పీ సీఈఓ డీ వెంకటమాధరావు, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ విజయరమణారావు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సుజాత, మెప్మా పీడీ పవన్‌ కుమార్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌, ఆర్టీసీ ఆర్‌ఎం పీ జీవన్‌ ప్రసాద్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ వెంకటరమణ, ఆర్డీఓలు ఆనంద్‌కుమార్‌, పీ బేన్‌ షాలోం తదితరులు పాల్గొన్నారు.


logo