శనివారం 06 జూన్ 2020
Karimnagar - Jan 27, 2020 ,

గణంగా.. తిరంగా..

గణంగా.. తిరంగా..
  • గణంగా.. తిరంగా..

సుభాష్‌నగర్‌ : 71వ గణతంత్ర వేడుకలను ఆదివారం జిల్లాకేంద్రంలోని పరేడ్‌ గ్రౌండ్‌లో కన్నుల పండువలా నిర్వహించారు. సీపీ కమలాసన్‌రెడ్డితో కలిసి సంబురాలకు హాజరైన కలెక్టర్‌ శశాంక, ఉదయం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకు ముందు పోలీసులతో గౌరవ వందనం స్వీకరించి, జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తర్వాత శకటాల ప్రదర్శనను తిలకించి, స్వాతంత్య్ర సమరయోధులను ఘనంగా సన్మానించారు. ఆ తర్వాత విద్యార్థులు తమ గుండెల నిండా దేశభక్తిని నింపుకొని ప్రదర్శనలు ఇవ్వగా, ఆసక్తిగా తిలకించారు. ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు, వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. వివిధ శాఖల ద్వారా లబ్ధిదారులకు సంక్షేమ పథకాల యూనిట్లను పంపిణీ చేశారు. 

నృత్యాలు అదరహో..

పాఠశాలల విద్యార్థులు దేశభక్తి, సామాజిక చైతన్యం చాటే గీతాలకు చేసిన నృత్యాలు అహూతులను అలరించాయి. సఖీ కేంద్రం (వన్‌స్టాప్‌ సెంటర్‌) ఆధ్వర్యంలో విద్యార్థులు ‘స్టాప్‌ ద వాయిలెన్స్‌-అగెనెస్ట్‌ ఉమెన్‌ ’ నాటిక ప్రదర్శన ఆందరినీ ఆలోచింపజేసింది. టీఎస్‌ ఆర్‌డబ్ల్యూఎస్‌ చింతకుంట పాఠశాల విద్యార్థులు ‘పాడవోయి భారతీయుడా’ పాటపై, తిమ్మాపూర్‌ ఎంజేపీ పాఠశాల విద్యార్థులు ‘మెయిన్‌ లాడాజానా’ అనే పాటపై, చిగురుమామిడి టీఎస్‌ఎంఎస్‌ (ముల్కనూర్‌)స్కూల్‌ విద్యార్థులు ‘ఒకే ఒక దేశం’ అంటూ సందేశాత్మక పాటలపై నృత్యాలు చేశారు. ఇల్లందకుంట కేజీవీబీ విద్యార్థులు ‘అమ్మా తెలంగాణ’ పాటపై, కరీంనగర్‌ సెయింట్‌ జాన్స్‌ విద్యార్థులు ‘పంకిండ’ పాటపై, చొప్పదండి (రాగంపేట జడ్పీహెచ్‌ఎస్‌) పాఠశాల విద్యార్థులు ‘ఈ జెండా పసిబోసి చిరునవ్వురా’ అనే పాటపై నృత్యాలతో అలరించారు.  సాంస్కృతిక కార్యక్రమాలను మంత్రి గంగుల కమలాకర్‌, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, కలెక్టర్‌ శశాంక, జేసీ జీవీ శ్యామ్‌ ప్రసాద్‌లాల్‌, సీపీ కమలాసన్‌రెడ్డి, డీఆర్‌ఓ ప్రావీణ్య, అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాజర్షిషా, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, నగర పాలక సంస్థ కమిషనర్‌ వేణుగోపాల్‌రెడ్డి, జడ్పీ సీఈఓ వెంకటమాధరావు, డీఆర్డీఓ వెంకటేశ్వర్‌రావు, ఆర్డీఓ ఆనంద్‌కుమార్‌, మాజీ కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు, స్వాతంత్య్ర సమరయోధులు తిలకించారు.

బహుమతులు ప్రదానం

నృత్య ప్రదర్శనలో చింతకుంట-టీఎస్‌ ఆర్‌డబ్ల్యూఎస్‌ ప్రథమ, ముల్కనూర్‌-టీఎస్‌ఎంఎస్‌ ద్వితీయ, కేజీవీబీ(ఇల్లంతకుంట) తృతీయ స్థానాల్లో నిలిచాయి. కరీంనగర్‌- సఖీకేంద్రం, రాగంపేట జడ్పీ స్కూల్‌ కన్సొలేషన్‌ బహుమతులు సాధించాయి. కాగా, కలెక్టర్‌ శశాంక, సీపీ వీబీ కమలాసన్‌రెడ్డి, జేసీ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాజర్షిషా, డీఆర్‌ఓ ప్రావీణ్య, బహుమతులు ప్రదానం చేశారు.

స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం 

స్వాతంత్య్రం ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధులను కలెక్టర్‌, శశాంక ఘనంగా సన్మానించారు. దేశానికి వారు చేసిన సేవలను కొనియాడుతూ వారికి పూలమాల వేసి శాలువాలతో సత్కరించారు.

ఆకట్టుకున్న శకటాలు

రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా చేపడుతున్న పథకాల గురించి చాటి చెప్పే శకటాలు పరేడ్‌ గ్రౌండ్‌లో ఆకట్టుకున్నాయి. వేడుకల సందర్భంగా జిల్లాలోని 16కు పైగా వివిధ సంక్షేమ శాఖలు వివిధ పథకాలను ప్రతిబింబించేలా శకటాలను ప్రదర్శించాయి. ప్రదర్శనలో జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంపై ప్రత్యక్షంగా ప్రదర్శించిన శకటం ప్రథమ బహుమతి గెలుచుకుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ శకటానికి ద్వితీయ బహుమతి, చిన్ననీటి వనరుల శాఖ శకటానికి మూడో బహుమతి, వ్యవసాయ శాఖ శకటానికి నాలుగో బహుమతి వచ్చింది. బహుమతులను జిల్లా కలెక్టర్‌ శశాంక ప్రదానం చేశారు. 


logo