సోమవారం 01 జూన్ 2020
Karimnagar - Jan 27, 2020 ,

ప్రగతి పథంలో జిల్లా

ప్రగతి పథంలో జిల్లా

అన్ని రంగాల్లో అగ్రగామి

సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సఫలం

కలెక్టర్‌ శశాంక

ఘనంగా గణతంత్ర వేడుకలు

(కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ):కరీంనగర్‌ జిల్లా ప్రగతి పథంలో పయనిస్తున్నదనీ, అన్ని రంగాల్లో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుస్తున్నదని కలెక్టర్‌ శశాంక పేర్కొన్నారు. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక పరేడ్‌ గ్రౌండ్‌లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. పలు శాఖల ద్వారా లబ్ధిదారులకు ఆస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోనే జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని స్పష్టం చేశారు. వివిధ శాఖల ద్వారా జిల్లాకు అందుతున్న ప్రయోజనాలను వివరించారు. ప్రజలే కేంద్ర బిందువుగా, ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా రాష్ట్ర ప్రభుత్వ పాలన సాగుతున్నదని చెప్పారు. వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్‌ కూడా పాల్గొన్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున వేదికను అలంకరించలేదు. కలెక్టర్‌ ప్రసంగం పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. 

   అన్నదాతకు అండగా.. 

రైతు బంధు, రైతు బీమాలాంటి పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలిచింది. జిల్లాలో చివరి విడుత రైతుబంధు కింద 1,21,808 మంది రైతులకు పెట్టుబడి సహాయం కింద రూ.130 కోట్లు జమ చేశాం. వివిధ కారణాలతో మృతిచెందిన 148 మంది రైతు కుటుంబాల్లో ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున రూ.65 కోట్లు అందించాం. పంటలకు కనీస మద్దతు ధర చెల్లించి, కొనుగోళ్లు జరుపుతున్నాం. 2019-20 ఖరీఫ్‌ సీజన్‌లో 250 కొనుగోలు కేంద్రాల ద్వారా రూ.530 కోట్ల విలువైన 2,89,309 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. సాగునీటిని అందించేందుకు వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 4.5 కోట్లతో 321 హెక్టార్లలో బిందు, తుంపర్ల సేద్యం సాగులోకి తెచ్చాం. రాష్ట్రీయ ఉద్యాన మిషన్‌ పథకం కింద 40 శాతం రాయితీతో 54 హెక్టార్లలో పూలు, పండ్ల తోటల సాగును ప్రోత్సహించాం. 

  పరిఢవిల్లిన ‘పల్లె ప్రగతి’

రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాల మేరకు గ్రామాలను పరిశుభ్రంగా మార్చేందుకు జిల్లాలో చేపట్టిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. రెండు విడుతల్లో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనం పెంచేందుకు చర్యలు తీసుకున్నాం. డంపింగ్‌యార్డులు, వైకుంఠ ధామాల నిర్మాణంతోపాటు కంపోస్ట్‌ ఎరువుల షెడ్ల నిర్మాణం లక్ష్యంగా ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని నిర్వహించాం. హరితహారం, పరిశుభ్రత పనులను నిర్వహించేందుకు ప్రతి పంచాయతీకి ట్రాక్టర్లను కొనుగోలు చేయిస్తున్నాం. ‘పల్లె ప్రగతి’లో భాగంగా గత నాలుగు నెలల్లో జిల్లాలోని గ్రామ పంచాయతీలకు రూ.47 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. 

  మెరుగైన విద్యుత్‌ సరఫరా.. 

విద్యుత్‌ రంగంలో జిల్లా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నది. జిల్లాలో 92,391 పంప్‌సెట్లకు 24 గంటల ఉచిత కరెంటును సరఫరా చేస్తున్నాం. ఇందుకు ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం రూ. 99.61 కోట్ల రాయితీని అందిస్తున్నది. 24 గంటల సరఫరా కోసం జిల్లాలో 110 విద్యుత్‌ ఉపకేంద్రాలు, లో ఓల్టేజీ సమస్య పరిష్కారానికి 389 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశాం. లైన్లను బలోపేతం చేసేందుకు కొత్తగా 589 కిలో మీటర్ల 33 కేవీ లైన్లు, 1,234 కిలో మీటర్ల ఎల్‌టీ లైన్లు ఏర్పాటు చేశాం. కరీంనగర్‌లో సిటీరెనోవేషన్‌, రోడ్ల వెడల్పులో భాగంగా 499 విద్యుత్‌ టవర్లు నిర్మించాం. పల్లె ప్రగతి కార్యక్రమంలో విద్యుత్‌ సంస్థ కృషి ప్రశంసనీయమైనది. 6,180 లూజ్‌ వైర్లు సరిచేసి, 2,769 కొత్త స్తంభాలను వేశాం. వీధి దీపాలకు 557 కిలోమీటర్ల థర్డ్‌ వైర్‌ కొత్తగా ఏర్పాటు చేశాం. 

చెరువుల పునరుద్ధరణ.. 

చెరువుల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయ ద్వారా రూ. 318 కోట్లతో 961 చెరువుల పనులు చేపట్టాం. ఇప్పటి వరకు ఇందులో 694 చెరువుల పనులు పూర్తి చేశాం. మిగతా చెరువులు ప్రగతిలో ఉన్నాయి. అంతేకాకుండా హుజూరాబాద్‌లో 11, కరీంనగర్‌లో ఒక చెక్‌ డ్యాం నిర్మించాం. ఇందుకు రూ. 45 కోట్లు ఖర్చు చేశాం. హుజూరాబాద్‌, కొత్తపల్లి, మానకొండూర్‌, రాగంపేటకు నాలుగు మినీ ట్యాంక్‌ బండ్‌ నిర్మాణాలను రూ. 24 కోట్లతో చేపట్టగా కొత్తపల్లి మినహా అన్ని పనులు పూర్తయ్యాయి.

రబీకి సాగునీటి విడుదల.. 

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మధ్యమానేరు, అక్కడి నుంచి జిల్లాలోని ఎల్‌ఎండీకి భారీగా నీటిని విడుదల చేశాం. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా 32.5 టీఎంసీలు, ఎస్సారెస్పీ కాకతీయ ఎగువ కాలువ ద్వారా 8 టీఎంసీల చొప్పున 45.9 టీఎంసీల నీటిని ఎల్‌ఎండీ జలాశయానికి మళ్లించాం. ఈ నీటిని ఎప్పటికప్పుడు దిగువ ఆయకట్టు పరిధిలోని కరీంనగర్‌, వరంగల్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సరఫరా చేస్తున్నాం. ఈ ప్రాంతాలకు ఇప్పటి వరకు 33.8 టీఎంసీల నీటిని విడుదల చేయగా, ఎల్‌ఎండీలో 14.27 టీఎంసీల నీరు నిలువ ఉంది. ప్రతిరోజూ 5 వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి అందిస్తున్నాం. 

మిషన్‌ భగీరథతో తాగునీరు 

తాగు నీటి కోసం మహిళలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘మిషన్‌ భగీరథ’ పథకాన్ని తెచ్చింది. ఈ పథకం పరిధిలో జిల్లాలో 3 ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేశాం. జిల్లాలోని 494 ఆవాసాలకు తాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 229 కోట్లు మంజూరు చేసింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 374 కొత్త వాటర్‌ ట్యాంకులు, 1,748 కిలో మీటర్ల కొత్త పైపు లైన్‌ పనులు పూర్తి చేశాం. 95,655 నల్లా కనెక్షన్లు ఇచ్చి 490 ఆవాసాలకు తాగు నీటిని అందిస్తున్నాం. 

హరితహారానికి ప్రాధాన్యం.. 

జిల్లాలో పచ్చదనాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ ఏడాది జిల్లాలో ఇప్పటి వరకు 51 లక్షల మొక్కలు నాటాం. నాటిన మొక్కలన్నింటినీ సంరక్షిస్తున్నాం. కొత్త పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం ప్రతి పంచాయతీ పరిధిలో ఒక నర్సరీని ఏర్పాటు చేశాం. అడవుల శాతం తక్కువగా ఉన్నందున ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

మెరుగైన విద్యా ఫలితాలు 

జిల్లాలో మెరుగైన, నాణ్యమైన ప్రభుత్వ విద్యను అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. గతేడాది పదో తరగతి పరీక్షల్లో 98.38 శాతం ఉత్తీర్ణతను సాధించాం. జిల్లాకు రాష్ట్రంలో మూడో స్థానం వచ్చింది. ఈ సారి కూడా మంచి ఫలితాలు సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నాం. జిల్లా అధికారులను ఆయా పాఠశాలలకు ప్రత్యేక అధికారులుగా నియమించాం. పదో తరగతి విద్యార్థులు చదువుపై శ్రద్ధపెట్టేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాం. జిల్లాలోని 660 ప్రభుత్వ పాఠశాలల్లో 45,210 మంది విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. 

కార్పొరేట్‌స్థాయి  వైద్యం.. 

జిల్లాలోని ప్రభుత్వ దవాఖానాను కార్పొరేట్‌ స్థాయిలో అభివృద్ధి చేసి, పేద రోగులకు సేవలు అందిస్తున్నాం. పేద రోగులు ఎవరూ ప్రైవేట్‌ దవాఖానలకు వెళ్లకుండా ప్రభుత్వ దవాఖానాల్లో వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటున్నారు. జిల్లా కేంద్రంలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్‌)లో 24 గంటల వైద్య సహాయం అందుతున్నది. ఇపుడు ఇక్కడ సగటున నెలకు 900 ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రసవాల గణాంకాల్లో రాష్ట్రంలోనే జిల్లా రెండో స్థానంలో ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు 22,669 మందికి కేసీఆర్‌ కిట్స్‌ అందించాం. ఆడపిల్లకు రూ. 13, మగపిల్లకు రూ. 12 వేల చొప్పన అందిస్తున్నాం. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేసి, క్షేత్రస్థాయిలోనే పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నాం. సంక్రమిత వ్యాధులు, అధిక రక్తపోటు, మధుమేహం, క్యానర్లతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, మందులు పంపిణీ చేస్తున్నాం. అంధత్వ నివారణ కోసం నిర్వహించిన కంటి వెలుగు కింద 5,88,339 మందికి కంటి పరీక్షలు నిర్వహించాం. ఇందులో 75,948 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశాం. 22,493 మందికి శస్త్ర చికిత్సల కోసం వివిధ దవాఖానలకు రెఫర్‌ చేశాం. 

ఆహార భద్రతకు ప్రాముఖ్యం..

ఆహార భద్రత కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నది. జిల్లాలో 2,58,901 పేద కుటుంబాలకు ఆహార భద్రత కార్డులు, 15,864 కుటుంబాలకు అంత్యోదయ కార్డులు మంజూరు చేశాం. ఆహార భద్రత పథకంలో ప్రతి వ్యక్తికి ఆరు కిలోల బియ్యం అందిస్తున్నాం. సంక్షేమ వసతి గృహాల్లో పాఠశాల విద్యను అభ్యసిస్తున్న 68,488 మంది విద్యార్థులకు ప్రతినెలా 394 మెట్రిక్‌ టన్నుల సన్నబియ్యం సరఫరా చేస్తున్నాం. 

డబుల్‌ బెడ్రూం ఇండ్లు.. 

పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభు త్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా డబుల్‌ బెడ్రూం ఇండ్ల పథకాన్ని తెచ్చింది. జిల్లాకు 6,494 ఇండ్లు మంజూరయ్యాయి. ఇందులో 2,166 ఇళ్ల పనులను ప్రారంభమయ్యాయి. 729 ఇండ్లు పూర్తయ్యాయి. 4,907 ఇండ్లు అగ్రిమెంట్‌, 1,587 ఇండ్లు టెండర్‌, మిగిలిన ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి.

మహిళా సంక్షేమానికి పెద్దపీట 

రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది. ఆడపిల్లల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకాల ద్వారా రూ. 1,00,116 అందిస్తున్నది. ఆరోగ్యలక్ష్మీ పథకం కింద గర్భిణులు, బాలింతలకు ప్రతిరోజూ కోడిగుడ్లు, పాలు, పౌష్ఠికాహారంతో కూడిన ఒక పూట భోజనాన్ని అందిస్తున్నాం. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల హక్కుల పరిరక్షణకు ఆపరేషన్‌ ముస్కాన్‌ కింద 138 మంది వీధి బాలలు, అనాథ పిల్లలను గుర్తించి వారికి వసతి కల్పించాం. వివిధ సమస్యలతో బాధపడుతున్న బాలికలను గుర్తించి, వారికి అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నాం. ‘బేటీ బచావో- బేటీ పడావో’ పథకంపై అవగాహన కల్పిస్తున్నాం. ఈ కార్యక్రమం కింద మంచి ఫలితాలు సాధించడంతో జిల్లాకు జాతీయస్థాయి అవార్డు వచ్చింది. గృహహింస, వేధింపులకు గురవుతున్న స్త్రీలకు న్యాయ సహాయం అందిస్తున్నాం.  

పశుగణాభివృద్ధికి ప్రోత్సాహం.. 

జిల్లాలోని గొర్రెల పెంపకందారులకు 75 శాతంపై గొర్రెలను అందిస్తున్నాం. రూ. 163 కోట్ల విలువైన 13 వేల గొర్రెల యూనిట్లను పంపిణీ చేశాం. ఇందులో రూ. 122 కోట్లు సబ్సిడీగా అందించాం. ఈ పథకం ద్వారా గొర్రెల పెంపకందారులు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.102 కోట్ల విలువైన అదనపు గొర్రె పిల్లల సంపదను సృష్టించుకున్నారు. పాలు, మాంసం ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించేందుకు రూ. 35 కోట్లతో 4,174 పాడి పశువులను అందించాం. ఇందులో భాగంగా రూ. 27 కోట్ల రాయితీని అందించాం. పాడి పశువుల పంపిణీ తర్వాత జిల్లాలో అదనంగా 25 శాతం ఉత్పత్తి అందుబాటులోకి వచ్చింది. 

మత్స్యకారుల సంక్షేమం కోసం.. 

మత్స్య కారుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. చేపల ఉత్పత్తిలో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 670 చెరువుల్లో వంద శాతం రాయితీపై 199 లక్షల చేప పిల్లలను విడుదల చే శాం. ఎల్‌ఎండీ జలాశయంలో 2 కోట్ల చేప పిల్లలు, 12 లక్షల రొయ్య పిల్లలను వదిలాం. ఈ ఏడాది 133 టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యంకాగా ఇప్పటి వరకు 5,767 టన్నుల ఉత్పత్తిని సాధించాం. దీనివల్ల మత్స్య కారులకు ఉపాధి అవకాశాలు పెరిగాయి. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద 75 శాతం రాయితీతో 3,216 టీవీఎస్‌ వాహనాలు, 158 లగేజీ ఆటో లు, 38 సంచార చేపల అమ్మకం వాహనాలు, 487 వలలు, 125 ప్లాస్టిక్‌ క్రెట్స్‌, 46 చేపల అమ్మకం కియోక్స్‌లు, 11 పరిశుభ్ర రవాణా వాహనాలను మత్స్యకారులకు పంపిణీ చేశాం. 

చేనేత కార్మికులకు ప్రోత్సాహం.. 

చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. నేత కార్మికులకు అవసరమైన నూలు, రసాయనాల కొ నుగోలుపై 40 శాతం రాయితీ అందిస్తున్నాం. మరమగ్గాలకు 50 శాతం విద్యుత్‌ సబ్సిడీని అందిస్తున్నాం. నేత కార్మికులు ఉత్పత్తి చేసిన వస్ర్తాలకు మార్కెంటింగ్‌ సదుపాయం కల్పిస్తు న్నాం. వాటిని ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. నేతన్నకు చే యూత పథకం కింద 1,638 మందికి వారి పొదుపుపై ప్రతినెలా 16 శాతం ట్రిప్ట్‌ ఫండ్‌ చెల్లిస్తున్నాం. 20 ప్రాథమిక చేనేత సంఘాలకు రూ. 3.25 కోట్లు మంజూరు చేశాం. చేనేత సహకార సంఘాలకు రూ.2 కోట్ల రుణాలిచ్చాం. వ్యక్తిగత రుణమాఫీ కింద 1,104 మందికి రూ.2.86 కోట్లు మాఫీ చేశాం. 

స్వశక్తి సంఘాలకు రుణాలు.. 

జిల్లాలోని మహిళా స్వశక్తి సంఘాలకు బ్యాంక్‌ లింకేజీ ద్వారా ఈ ఏడాది రూ. 243 కోట్లు రుణంగా అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా, రూ.222 కోట్లు అందించాం. ఏ ఆధారం లేని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలను ఆదుకునేందుకు ప్రబుత్వం ఆసరా పింఛన్లు ప్రవేశ పెట్టింది. జిల్లాలో 1,23,525 మందికి ఆసరా పింఛన్ల కింద ప్రతినెలా రూ. 27 కోట్లు అందిస్తున్నాం. గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా ఎంప్లాయీస్‌ జనరేషన్‌, మార్కెటింగ్‌ మిషన్‌ ద్వారా 346 మంది నిరుద్యోగ యువతకు వివిధ కోర్సుల్లో వృత్తినైపుణ్య శిక్షణ ఇచ్చాం. డైరెక్ట్‌ ప్లేస్‌మెంట్‌ కింద జిల్లాలో ఇప్పటి వరకు 1,361 మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పించాం. 

రహదారుల అభివృద్ధిలో అగ్రభాగం.. 

అభివృద్ధి విషయంలో జిల్లా అగ్రగామిగా నిలుస్తున్నది. రోడ్లు, భవనాల శాఖ ద్వారా జిల్లాలో సింగిల్‌ లైన్‌ రోడ్లను డబుల్‌, డబుల్‌ లైన్‌ రోడ్లను నాలుగు లైన్ల రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.127.60 కోట్లు మంజూరు చేసింది. పనులన్నీ ప్రగతిలో ఉన్నాయి. కరీంనగర్‌ నగర పాలక సంస్థ పరిధిలో రూ. 54 కోట్లతో 4.5 కిలోమీటర్ల మేర చేపట్టిన రోడ్ల పనులు తుది దశకు చేరాయి. పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా 211 కొత్త తారు, సీసీ రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 63 కోట్లు మంజూరు చేసింది. ఇందులో 158 పనులు పూర్తయ్యాయి. రూ.32 కోట్లతో చేపట్టిన 17 వంతెనల్లో ఒకటి మినహా అన్నీ పూర్తయ్యాయి. ఉపాధి హామీ పథకం కింద రూ.4 కోట్లతో చేపట్టిన వ్యవసాయ గోదాముల్లో నాలుగు పూర్తయ్యాయి. రూ. 13.36 కోట్లతో మంజూరైన 85 గ్రామ పంచాయతీ భవనాల్లో 20 పూర్తయ్యాయి. రూ. 22 కోట్లతో చేపట్టిన వైకుంఠధామాలు వివిధ దశల్లో ఉన్నాయి. 

కరీంనగర్‌లో స్మార్ట్‌ పనులు.. 

కరీంనగర్‌లో స్మార్ట్‌ సిటీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు కింద నగర అభివృద్ధికి రూ.1,878 కోట్లు మంజూరయ్యాయి. మొదటి విడుతలో రూ. 267 కోట్లతో చేపట్టిన 12 ప్రాజెక్టుల పనులు ప్రగతిలో ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ పథకం కింద మంజూరైన రూ. 347 కోట్ల నిధులతో నగరంలోని రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు చేస్తున్నాం. ఇప్పటి వరకు రూ. 145 కోట్ల నిధుల పనులు పూర్తి చేశాం. ఉజ్వల పార్కు వద్ద రూ. 25 కోట్లతో ఐటీ పార్క్‌ నిర్మించాం. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉజ్వల పార్కు వద్ద హరిత హోటల్‌ నిర్మిస్తున్నాం. నగరంలోని కూడళ్లను అభివృద్ధి చేసి ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం.. 

అదుపులో శాంతి భద్రతలు 

జిల్లాలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. నేరం జరిగిన 24 గంటల్లోనే నిందితులను గుర్తిస్తున్నాం. నేను సైతం కమ్యూనిటీ సీసీ కెమెరాల ప్రాజెక్టులో భాగంగా కమిషనరేట్‌లో ఇప్పటి వరకు 6,500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. అత్యాధునిక హంగులతో పోలీసు స్టేషన్లను ఆధునికీకరిస్తున్నాం. చొప్పదండి పోలీస్‌ స్టేషన్‌కు జాతీయస్థాయిలో 8వ స్థానం దక్కడం జిల్లాకు గర్వకారణం. నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో జిల్లా పోలీసులు అహోరాత్రులు కృషి చేస్తున్నారు. ప్రజలు పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయకుండానే హాక్‌ఐ, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లాంటి ఆధునిక సాంకేతిక సదుపాయాలను అందుబాటులోకి తెచ్చాం. ఎల్‌ఎండీ వద్ద లేక్‌ వ్యూ ఏర్పాటుతో అసాంఘిక కార్యకలాపాలు పూర్తిగా నియంత్రణలోకి తీసుకొచ్చాం. పీడీ యాక్ట్‌ అమల్లో రాష్ట్రంలోనే జిల్లా రెండో స్థానంలో ఉంది. ఈ గణతంత్ర వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్‌, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు కోడూరి సత్యనారాయణ గౌడ్‌, ఆరెపల్లి మోహన్‌, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, జేసీ శ్యాంప్రసాద్‌ లాల్‌, సీపీ కమలాసన్‌ రెడ్డి, ప్రత్యేకాధికారి రాజర్షిషా, డీఆర్వో ప్రావీణ్య, నగరపాలక సంస్థ కమిషనర్‌ వేణుగోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


logo