గురువారం 04 జూన్ 2020
Karimnagar - Jan 27, 2020 ,

‘నగర’ ఫలితం నేడే

‘నగర’ ఫలితం నేడే

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: కరీంనగర్‌ నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. సోమవారం ఉదయం 7 గంటల నుంచి చేపట్టనున్న ఓట్ల లెక్కింపు కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. మరోవైపు ఫలితాల నేపథ్యంలో ఎన్నికలు జరిగిన 58 డివిజన్ల నుంచి బరిలో ఉన్న 369 మంది అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకుంది. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నా.. బ్యాలెట్లు తెరిస్తే ఫలితం ఎలా ఉంటుందోనన్న టెన్షన్‌ పట్టుకుంది. కాగా, నగరపాలక సంస్థలో 60 డివిజన్లు ఉండగా, ఇప్పటికే రెండు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 58 డివిజన్లకు పోలింగ్‌ జరిగింది. ఇందులో 1,65,147 ఓట్లు పోల్‌ అయ్యాయి. 500 లకు పైగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఉన్నాయి. వీటిని సోమవారం లెక్కించనుండగా, అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలలోని ఇండోర్‌ స్టేడియంలో ఉదయం 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. మొదట ఎన్నికల పరిశీలకుల సమక్షంలో పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు ప్రారంభిస్తారు. అనంతరం బ్యాలెట్లను తెరుస్తారు. మూడు నుంచి నాలుగు రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు ఫలితాలను ప్రకటించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్లు ఎవ్వరు కూడా సెల్‌పోన్‌ తీసుకురావద్దనీ, కౌంటింగ్‌ కేంద్రాల్లో అనుమతించమని అధికారులు చెబుతున్నారు. 58 డివిజన్ల కౌంటింగ్‌ ఏకకాలంలో 58 టేబుళ్లలో ప్రారంభం కానుంది. లెక్కింపు కోసం 58 మంది సూపర్‌వైజర్లు, ఇద్దరు అసిస్టెంట్లు, 20 మంది మైక్రో అబ్జర్వర్లు, ఇతర సిబ్బందిని నియమించారు. డివిజన్ల వారీగా ఓట్ల లెక్కింపును 25 ఓట్లకు ఒక కట్ట చేసి లెక్కింపు చేస్తారు. ప్రతి రౌండ్‌లో వెయ్యి ఓట్లను లెక్కిస్తారు. కౌంటింగ్‌ హాల్‌లోకి అభ్యర్థులకు సంబంధించి ఒక్కరిని మాత్రమే అనుమతిస్తారు. 


మాక్‌ కౌంటింగ్‌

సోమవారం ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం అధికారులు ఎస్సారార్‌ కళాశాలలో మాక్‌ కౌంటింగ్‌ చేపట్టారు. దీని కోసం ఆయా టేబుళ్ల వారీగా డమ్మీ బ్యాలెట్‌ను రూపొందించారు. కౌంటింగ్‌ సందర్భంగా ఎక్కడా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చర్యలు చేపడుతున్నామని అధికారవర్గాలు తెలిపాయి.logo