శనివారం 30 మే 2020
Karimnagar - Jan 26, 2020 , 04:31:45

శ్రీభాష్యానికి పద్మశ్రీ

శ్రీభాష్యానికి పద్మశ్రీ
  • - పురస్కారానికి ఎంపిక చేసిన కేంద్రం
  • - సినారె తర్వాత ఉమ్మడి జిల్లాలో రెండో వ్యక్తిగా ఖ్యాతి
  • - ‘అమర భాషలో ఆధునికుడి’కి దక్కిన సమున్నత గౌరవం
  • - రాష్ర్టానికే గర్వకారణమంటున్న సాహితీవేత్తలు

(కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ): సంస్కృత భాషా పండితులు, ప్రతిభ, పరిశోధన విశ్లేషణ, వ్యాఖ్యాన రీతుల్లో దేశ వ్యాప్తంగా ఖ్యాతి పొందిన కరీంనగర్‌ ఆణిముత్యం శ్రీభాష్యం విజయ సారథిని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. దేశానికి విశిష్టమైన సేవలు అందించిన వారికి ఈ పురస్కారం అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఈ పురస్కారాన్ని అందుకున్న మొదటి సాహితీవేత్త డాక్టర్‌ సీ నారాయణరెడ్డి కాగా, శ్రీభాష్యం రెండో సాహితీవేత్త కావడం జిల్లాకు గర్వకారణం. కరీంనగర్‌ మండలం చేగుర్తిలో జన్మించిన ఇతను కరీంనగర్‌ శివారులో యజ్ఞ వరాహస్వామి ఆలయాన్ని నిర్మించి అక్కడే సర్వవైదిక సంస్థానాన్ని స్థాపించి విశేషమైన సేవలు అందిస్తున్నారు.

అమర భాషలో ఆధునికుడు..

ఉర్దూ అధికార భాషగా ఉండి విద్యాలయాల్లో ఉర్దూ మాధ్యమానికే పెద్దపీట వేసిన నిజాం కాలంలో సంస్కృతం చదువుకుని తన సృజనను ఇదే భాషలో చేయాలని నిర్ణయించుకున్న మహనీయుడు శ్రీభాష్యం విజయసారథి. సంస్కృతం అంటే దేవతల పూజలు, పురాణ కథలు అనుకుంటున్న స్థితిలో సామాజిక అంశాలను తీసుకుని సృజన చేసిన కవి ఆయన. సంప్రదాయ రూపంలో ఆధునిక భావాలను ప్రయోగశీలతను ఆవిష్కరిస్తూ సంస్కృత భాషలో ఆయన రచనలు సాగించారు. అందుకే ఆయనకు ‘అమర భాషలో ఆధునికుడు’ అనే ఖ్యాతి వచ్చింది. ఆయన రాసిన ‘భారత భారతి’ అనే కవితా సంపుటిలో 60 శ్లోకాలు ఉన్నాయి. ఈ కావ్యం మొత్తం ఆధునిక సామాజిక సమస్యలను ప్రస్తావించడంతోపాటు వాటికి పరిష్కారాలను కూడా సూచించింది. దేశ స్వాతంత్య్రాన్ని, సమగ్రతను చాటి చెప్పిన గొప్ప కావ్యం ఇది. ఇలాంటి వందకు పైగా గొప్ప కావ్యాలను ఆయన సంస్కృత భాషలో రచించారు. ఆయన కావ్యాల్లో సుప్రభాతాలు, స్తోత్రాలు, దేశభక్తి రచనలు, ఆదిక్షేప కవితలు, ఆప్త లేఖలు, ఖండ కావ్య సరంపర, ప్రహేళికలు, విమర్శ, అనువాద రచనలు, వర్ణనా కావ్యాలు, మంత్రమాయ రచనలు ఉన్నాయి. సంస్కృతంలో ఖండకావ్య ఒరవడిని ప్రారంభించిన కవి శ్రీభాష్యం. లేఖా సాహిత్యంలో కూడా ఆయన మంచి కవిత్వాన్ని ఆవిష్కరించారు. శ్రీభాష్యం కవిత్వంలో స్పష్టత, సూటితనం, పాఠకులను ఇట్టే ఆకట్టుకుంటాయి.

శ్రీభాష్యం జీవిత విశేషాలు..

కరీంనగర్‌ జిల్లా ఇదే మండలం చేగుర్తిలో సామాన్య బ్రాహ్మణ కుటుంబంలో శ్రీభాష్యం నరసింహాచార్య, గోపమాంభ దంపతులకు 1937 మార్చి 10న జన్మించిన శ్రీభాష్యం విజయసారథి తల్లి వద్ద సంస్కృత భాష, సంగీతం నేర్చుకున్నారు. ఆయన ప్రతి విషయాన్ని అప్పుడే ప్రశ్నించే వారు. బాల్యం నుంచే ఆయన రచనలు చేస్తూ వచ్చారు. పదకొండో ఏటనే శారదా పంథాకిని, 16వ ఏట శవారి పరివేదన, 17వ ఏట మనోహరం అనే రచనలు చేశారు. చిన్నతనంలో రజాకార్ల ఆగడాలు చూసిన శ్రీభాష్యం కమ్యూనిస్టు భావ జాలంతో, విప్లవవాదంపైపు, హేతువాదం వైపు మొగ్గు చూపేవారు. వీటిని గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను వరంగల్‌లోని శ్రీ విశ్వేశ్వరయ్య సంస్కృత కళాశాలలో చేర్పించారు. అక్కడ మొదలైన ఆయన సంస్కృత భాషా పరిచయం స్వత సిద్ధంగా ఉన్న కవితా శక్తికి జతకూడి కవిగా మార్చింది. వరంగల్‌ సంస్కృత కళాశాల నుంచి ఆయన విద్యాభ్యాసం కాశీకి మారింది. ఆ తర్వాత అక్కడి కళాశాలలో అధ్యాపక వృత్తిని చేపట్టి అక్కడే పదవీ విరమణ పొందారు. పలు విశ్వవిద్యాలయాలతో పాటు ముంబై, కోల్‌కత్తా, నాగపూర్‌, ఢిల్లీ వంటి అనేక నగరాల్లో కవి సమ్మేళనాల్లో పాల్గొన్నారు. 30 ఏండ్ల కిందట కరీంనగర్‌ శివారులోని బొమ్మకల్‌ రోడ్‌లో యజ్ఞ వరాహ స్వామి క్షేత్రాన్ని నిర్మించి, సర్వవైదిక సంస్థానాన్ని ఏర్పాటు చేసి వేదాల్లోని మౌలిక జ్ఞానాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు.

గొప్ప మానవతా వాది..

శ్రీభాష్యం గొప్ప మానవతావాది. మనుషులు ఆనందం పొందడానికి అనేక దారులు ఉన్నాయనీ, అందులో భారతీయ సాహిత్యం, సంస్కృతి ప్రధానమైన దారులని ఎంతో గొప్పగా వివరించిన అరుదైన వ్యక్తిత్వంగల వ్యక్తి. హింస లేని సౌభ్రాతృత్వం కలిగిన సమాజం ఏర్పడాలని వాదిస్తారాయన. తెలంగాణ ప్రాంత గొప్ప చారిత్రక, సాంస్కృతిక చరిత్ర కలిగిన ప్రాంతమనీ, ఇక్కడ ప్రతిభావంతులైన వాళ్లు ఎందరో ఉన్నారని అంటారాయన. ప్రాచుర్యం, ప్రోత్సాహం లేక తెలంగాణ సృజనాత్మక ప్రతిభ ఎల్లలు దాటడం లేదంటారు. 2008లో శాతవాహన కళోత్సవాల్లో కరీంనగర్‌ జిల్లా ప్రాశస్త్యం గురించి పుస్తకాన్ని ఆవిష్కరించిన శ్రీభాష్యం.. ఇప్పటికీ తన రచనలు సాగిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు వాచస్పతి, మహాకవి, యుగకవి, రాష్ట్ర కవి వశ్యనాక్‌తోపాటు అరుదైన మహామహోపాధ్యాయ బిరుదులతోపాటు స్వర్ణ కంకణం, క్రియేటివ్‌ సంస్కిట్‌ పోయెట్‌, ఉత్తమ సంస్కృత స్కాలర్‌, తెలంగాణ రాష్ట్ర విశిష్ట పురస్కారాలను అందుకున్నారు. ఈయన విశిష్ట సేవలకు ఇప్పుడు అత్యుత్తమ పద్మశ్రీ అవార్డు కూడా దక్కింది..

రాష్ర్టానికే గర్వకారణం..

దేశంలోని వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి రాష్ట్రపతి చేతుల మీదుగా అందించే పద్మశ్రీ అవార్డుకు శ్రీభాష్యం విజయసారథి ఎంపిక కావడం కరీంనగర్‌ జిల్లాకే కాకుండా తెలంగాణ రాష్ర్టానికి గర్వకారణమని జిల్లా సాహితీ వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమర భాష సంస్కృతాన్ని ఆధునీకరించి, అనేక గొప్ప రచనలు చేసి, సమాజాన్ని మేలు కొలిపిన గొప్ప హేతువాదిగా ఆయనను అభివర్ణిస్తున్నారు. తొలినాళ్లలో ఊరు, ఊరి ప్రజలపై సాహిత్యాన్ని ఆవిష్కరించిన శ్రీభాష్యం.. వైదిక ధర్మంవైపు మళ్లి గొప్ప గొప్ప రచనలు చేశారని చెబుతున్నారు. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినా అభ్యుదయ భావాలతో రచనలు సాగించి సమాజానికి సేవలు అందించిన అరుదైన ఆణిముత్యాల్లో శ్రీభాష్యం ఒకరని జిల్లా సాహితీ వేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి అరుదైన గౌరవం ఆయనకు దక్కడం సముచితమేనని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు.logo