సోమవారం 01 జూన్ 2020
Karimnagar - Jan 26, 2020 , 04:26:51

విజయం వెనుక వ్యూహం

విజయం వెనుక వ్యూహం
  • - మున్సిపల్‌ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించిన టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు
  • - యువనేత కేటీఆర్‌ సారథ్యంలో కార్యాచరణ
  • - ప్రతిపక్షాలకు అంతుచిక్కని ఆలోచన
  • - అభ్యర్థుల ఎంపిక నుంచే పక్కా ప్రణాళిక
  • - ఇతర పార్టీలకు అందని స్థాయిలో ప్రచారం
  • -నాలుగు మున్సిపాలిటీల్లో జయకేతనం

మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరడం వెనక అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ పకడ్బందీ వ్యూహరచన కనిపిస్తున్నది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సారథ్యంలో పక్కా ప్రణాళికతో మున్సిపల్‌ ఎన్నికలకు వెళ్లింది. నిరంతరం ప్రజల మధ్య ఉండి, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్న కార్యకర్తలను అభ్యర్థులుగా ఎంపిక చేసి, పోటీకి దింపింది. ప్రతిపక్షాలకు అందని స్థాయిలో ప్రచారం చేసి, కోలుకోలేని దెబ్బ తీసింది. ఊహించని ఫలితాలు రావడంతో ప్రతిపక్షాలకు దిమ్మతిరిగి పోయింది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఫలితాలు ఒకే రీతిలో ఉండడమే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నది.
- కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ

మున్సిపల్‌ ఎన్నికల వేళ అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు పక్కా వ్యూహంతో ముందుకెళ్లారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సారథ్యంలో పకడ్బందీ కార్యాచరణ రూపొందించుకున్నారు. అభ్యర్థులను ఎంపిక చేయడంలో పార్టీ బాధ్యులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. ఇతర పార్టీల మాదిరిగా పైరవీలకు తావులేకుండా ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న కార్యకర్తలను ఎంచుకుని బీ-ఫారాలు ఇచ్చారు. ముఖ్యంగా పార్టీ అధిష్టానం ప్రజల మధ్యకు వెళ్లి పలు సర్వేలు నిర్వహించి, ప్రజలు సూచించిన కార్యకర్తలకే టికెట్లు ఇచ్చినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రధానంగా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు మున్సిపాలిటీలకు మంత్రిగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ ఎన్నికలు తన పనితీరుకు రెఫరెండమని ఆయన చేసిన ప్రకటనకు ప్రజలు సానుకూలంగా స్పందించారు. కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు ఎన్నికలు వచ్చినపుడు మాత్రమే ప్రజల మధ్యకు వెళ్తుండగా, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు మాత్రం నిత్యం ప్రజల మధ్యే ఉంటూ, వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ వచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు అందించడంలో ఆది నుంచీ కృతార్థులవుతున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను లోతుగా ప్రచారం చేయగలిగారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు చేసిన ప్రచారాన్ని పట్టణ ప్రజలు పూర్తిగా విశ్వసించారు. ఫలితాలు ఇందుకు నిదర్శనమని నాయకులు పేర్కొంటున్నారు.

ఫలించిన కృషి..

టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఒక్కో మున్సిపాలిటీకి ఇద్దరు లేదా ముగ్గురు సీనియర్‌ నాయకులను ఇన్‌చార్జీలుగా నియమించింది. అంతే కాకుండా స్థానిక నాయకులను వార్డులకు ఇన్‌చార్జీలుగా నియమించి ప్రచారం చేయించింది. హుజూరాబాద్‌ నియోజకవర్గం పరిధిలోని హుజూరాబాద్‌, జమ్మికుంట మున్సిపాలిటీల్లో మంత్రి ఈటల రాజేందర్‌ ప్రచారం చేశారు. హుజూరాబాద్‌లో ఓ వార్డు నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి చివరి క్షణంలో పోటీ నుంచి విరమించి మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్‌, బీజేపీల ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదు. కేవలం టీఆర్‌ఎస్‌తోనే పట్టణాలు అభివృద్ధి చెందుతాయని మంత్రి ఈటల, ఆ పార్టీ నాయకులు చేసిన ప్రచార వ్యూహం ఫలించింది. ఇక కరీంనగర్‌ నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి మున్సిపాలిటీలో మంత్రి గంగుల కమలాకర్‌ ఆది నుంచీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రత్యేక దృష్టి సారించి కొత్తపల్లిని పట్టణాన్ని మండల కేంద్రంగా మలిచి స్థానికుల అభిమానాన్ని చూరగొన్నారు. మరెన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అక్కడ మంత్రికి ఇంటింటికీ అభిమానులు ఉన్నారు. గత పరిషత్‌ ఎన్నికల్లో ఈ మండలంలో 8 ఎంపీటీసీ స్థానాలు ఉంటే క్లీన్‌ స్వీప్‌ చేశారు. జడ్పీటీసీ స్థానాన్ని కూడా దక్కించుకున్నారు. ఇదే స్ఫూర్తితో ఇప్పుడు కొత్తపల్లి మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో 11 గెలుచుకుని, చైర్మన్‌ స్థానాన్ని దక్కించుకోబోతున్నారు. ఓడిన ఒక్క స్థానంలోనూ 16 ఓట్ల స్వల్ప వ్యత్యాసం ఉండడం గమనార్హం. ఇక్కడ మంత్రి గంగుల చేసిన ఇంటింటి ప్రచార వ్యూహం మంచి ఫలితాన్నిచ్చింది. ఇక చొప్పదండి నియోజకవర్గ కేంద్ర మున్సిపాలిటీని దక్కించుకోవడంలో స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ కూడా అహర్నిశలు కృషి చేశారు. పట్టణాభివృద్ధి బాధ్యత తనదేనంటూ ఆయన భరోసా ఇచ్చారు. అలాగే, విస్తృత ప్రచారంతో ప్రజలకు చేరువయ్యారు. అందుకే  ఇక్కడి 14 స్థానాల్లో తొమ్మిదింటిని దక్కించుకున్నారు.
logo