ఆదివారం 31 మే 2020
Karimnagar - Jan 25, 2020 , 02:32:15

కరీంనగర్‌లో కారుదే జోరు

కరీంనగర్‌లో కారుదే జోరు
  • -40 డివిజన్లకుపైగా గెలిచే అవకాశం
  • -బీజేపీ, కాంగ్రెస్‌కు సింగిల్‌ డిజిట్‌ దాటడం గగనమే
  • -కొన్ని డివిజన్లలో ఎంఐఎం ప్రభావం
  • -టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో గెలుపు ధీమా
  • -ఓటింగ్‌ సరళి పరిశీలన తర్వాత అంచనా
  • -27న ఫలితాలు.. మెజార్టీపైనే ఆశలు
  • -ఫలిస్తున్న మంత్రి గంగుల వ్యూహం
  • -సంబురాల్లో శ్రేణులు


(కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ): కీలకమైన కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌పై విపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కారు జోరును అడ్డుకోలేకపోయాయి. చరిత్రలో లేని విధంగా రెండు డివిజన్లను ఏకగ్రీవం చేసుకుని సత్తా చాటిన అధికార టీఆర్‌ఎస్‌, శుక్రవారం 58 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లోనూ హవా కొనసాగించింది. ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్‌ ప్రభావం ఒకట్రెండు డివిజన్లకే పరిమితం కాగా, బీజేపీ కూడా అంతగా ప్రభావం చూపినట్లు కనిపించలేదు. నాలుగైదు డివిజన్లలో టీఆర్‌ఎస్‌కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చినట్లు కనిపించినా, ఇలాంటి చోట్ల కూడా అధికార పార్టీ అభ్యర్థులదే విజయమని తెలుస్తోంది. మొత్తానికి ఈ రెండు పార్టీలు కరీంనగర్‌ కార్పొరేషన్‌లో సింగిల్‌ డిజిట్‌కు పరిమితం కావచ్చని స్పష్టంగా తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థుల తరపున ఎంపీ బండి సంజయ్‌, కాంగ్రెస్‌ అభ్యర్థుల పక్షాన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ప్రచారం చేసినా నగర ఓటర్లు మాత్రం అంతగా ప్రభావితం కాలేదు. అభివృద్ధి మంత్రంతో అన్నీ తానై జనంలోకి వెళ్లిన మంత్రి గంగుల కమలాకర్‌ చేసిన ప్రచార వ్యూహం ఫలించిందని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ప్రతి డివిజన్‌లో అభ్యర్థులను వెంటేసుకుని ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించిన మంత్రి గంగుల ప్రజల మధ్యన మెదులుతూ అన్ని డివిజన్ల అభివృద్ధి బాధ్యత తనదేనని హామీ ఇస్తూ వచ్చారు. ఆయన చేసిన ప్రచారం, ఇచ్చిన హామీలు నగర ప్రజలపై ప్రభావం చూపినట్లు శుక్రవారం జరిగిన ఓటింగ్‌ సరళిని బట్టి స్పష్టంగా తెలుస్తోంది.

ప్రత్యర్థులకు అందనంత వేగంగా..

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రత్యర్థి పార్టీలకు అందని వేగంతో దూసుకుపోయారు. నగర అభివృద్ధికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇచ్చిన నిధులు, మంత్రి గంగుల కమలాకర్‌ నగరం కోసం చేస్తున్న కృషిని ఈ ఎన్నికల్లో ప్రధానంగా ప్రచారం చేశారు. అభ్యర్థులు అన్ని పార్టీల కంటే విభిన్నంగా చేసిన ప్రచారం మంచి ఫలితాన్నిచ్చిందని చెప్పవచ్చు. కాగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్‌కుమార్‌ ఉన్నప్పటికీ, ఆయన కొన్ని డివిజన్లకే ప్రచారాన్ని పరిమితం చేయడం, బీజేపీ ఎన్నికల వ్యూహం సరిగ్గా లేక పోవడంతో టీఆర్‌ఎస్‌దే పైచేయిగా నిలిచింది. ఇక, కాంగ్రెస్‌ మాత్రం ఒకట్రెండు డివిజన్లలో మాత్రమే ప్రభావం చూపినా ఒక్క చోటనైనా విజయం సాధిస్తుందా? అన్న సందేహాలు తప్పడం లేదు. ఇక ఎంఐఎం ప్రభావం ఉన్న పలు డివిజన్లలోనూ టీఆర్‌ఎస్‌ గట్టి పోటీ ఇచ్చింది. నాలుగు డివిజన్లలోనే ఈపార్టీ ప్రభావం కనిపించింది. కొన్ని డివిజన్లలో బీజేపీ- టీఆర్‌ఎస్‌, మరి కొన్ని డివిజన్లలో ఎంఐఎం- టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల మధ్య ‘నువ్వా నేనా’ అన్నట్లుగా పోటీ సాగింది. కొన్ని డివిజన్లలో స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీల కంటే మెరుగైన ఓట్లు సాధించినట్లు తెలుస్తోంది. రెండు మూడు డివిజన్లలో స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని డివిజన్లలో బీజేపీ, కాంగ్రెస్‌ ఓట్లను స్వతంత్రులు చీల్చడంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు కలిసి వచ్చింది. దీంతో మొత్తానికి కరీంనగర్‌ నగర పాలక సంస్థపై మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఫలించిన మంత్రి గంగుల కృషి..

మంత్రి పదవి చేపట్టిన అనంతరం కార్పొరేషన్‌కు మొదటిసారిగా జరుగుతున్న ఈ ఎన్నికలను గంగుల కమలాకర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిజానికి టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్లు ఆశించే వారి సంఖ్య అధికంగా కనిపించింది. అయితే టికెట్‌ ఎవరికి ఇచ్చినా అందరూ కలిసి పనిచేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలంటూ వ్యూహాత్మకంగా అన్ని డివిజన్ల నాయకులను పిలిచి ముందుగానే మంత్రి మాట్లాడారు. దీంతో ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి రెబల్‌ బెడద లేకుండా పోయింది. టీఆర్‌ఎస్‌ టికెట్లు ఆశించే వారి సంఖ్య అధికంగా ఉన్న నేపథ్యంలో టికెట్‌ రానివారంతా తమ పార్టీలకు వస్తారని కాంగ్రెస్‌, బీజేపీ పెట్టుకున్న ఆశలపై మంత్రి గంగుల అత్యంత చాకచక్యంగా వ్యవహరించి నీళ్లు చల్లారు. ఇదే కాకుండా బీఫారాలు ఇచ్చే సమయంలోనూ ఆయా డివిజన్ల నాయకులందరినీ పిలిచి మాట్లాడడంతో పాటు అభ్యర్థిని గెలిపించి తీసుకుని రావాలనీ, కష్టపడిన ప్రతి నాయకుడికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని నచ్చజెప్పారు. మంత్రి చేసిన ఈ కృషి శుక్రవారం జరిగిన ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.logo