శనివారం 30 మే 2020
Karimnagar - Jan 25, 2020 , 02:28:37

బీజేపీతో అభివృద్ధి శూన్యం

బీజేపీతో అభివృద్ధి శూన్యం
  • - మోదీ పాలనలో దేశంలో తీవ్ర ఆర్థిక మాంద్యం
  • -రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌
  • - దేశం బీజేపీ సొంతం అన్నట్లు భావిస్తున్నది
  • - రాష్ర్టాల అభివృద్ధిని విస్మరిస్తోంది
  • - తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వడం లేదు

జమ్మికుంట/ హుజూరాబాద్‌ టౌన్‌: మోదీ పాలనలో దేశం తీవ్ర ఆర్థిక మాంద్యంలో ఉందనీ, బీజేపీతో అభివృద్ధి శూన్యమని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ విమర్శించారు. శుక్రవారం జమ్మికుంటలో ఓ ప్రైవేట్‌ కార్యక్రమానికి హాజరైన ఆయన అనంతరం టీఆర్‌ఎస్‌ అర్బన్‌ శాఖ అధ్యక్షుడు టంగుటూరి రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో, హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్‌ నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాల్లో మాట్లాడారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బీజేపీ జాతీయవాదంపైనే కాలం వెళ్లదీస్తున్నదనీ, దేశ ప్రజల శ్రేయస్సును అస్సలు పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. బీజేపీ ఎజెండా అంతా వేరేగా ఉందన్నారు. ప్రధానిగా మోదీ ఒక్క జాతీయ పథకాన్ని కూడా తేలేదనీ, దేశం ఒక్క బీజేపీ సొంతమన్నట్లు వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. దళితులు, గిరిజనులు ఉన్న రాష్ర్టాల్లో అభివృద్ధి కోసం జాతీయ పథకాలను అందించలేని చేతగాని ప్రభుత్వమని విమర్శించారు. తెలంగాణ రాష్ర్టానికి ఐదు జాతీయ రహదారులు కావాలని డీపీఆర్‌ ఇచ్చినప్పటికీ, ఇప్పటికీ పరిశీలించలేదనీ, రిజక్ట్‌ కూడా చేయలేదని తెలిపారు. కేంద్రం విధానాల వల్ల పలు రంగాల్లో వెనుకబడి ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం రాష్ర్టాల సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలని కోరారు. దేశానికి దిక్సూచీగా రాష్ట్రం నిలిచిందనీ, అందుకు సీఎం కేసీఆర్‌ పాలనే కారణమన్నారు. 2020లో ప్రవేశపెట్టే బడ్జెట్‌ కోసం దేశంలోని అన్ని రాష్ర్టాలు ఎదురు చూస్తున్నాయని చెప్పారు. 2020 బడ్జెట్‌లో తెలంగాణ రాష్ర్టానికి రావల్సిన వాటాను ముందుగానే ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాజీపేట్‌ నుంచి వయా హుజూరాబాద్‌ మీదుగా కరీంనగర్‌ వరకు నూతన రైల్వే ప్రాజెక్టు కోసం గతంలో రూ.రెండు కోట్లు కేటాయించి సర్వే చేయించామనీ, దీనికి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తే రైల్వే లైన్‌కు అవసరమైన భూసేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ముందుకు వస్తుందన్నారు. తెలంగాణలోని అన్ని నూతన ప్రాజెక్టు నిర్మాణాల కోసం తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహాయ, సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ రైల్వే నూతన(కొత్త) లైన్లు కావాలో ప్రతిపాదనలు అందజేసి సంవత్సరాలు గడుస్తున్నదనీ, వెంటనే ఈ బడ్జెట్‌లో అంగీకరించి నిధులు కేటాయించాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు.

15వ ఆర్థిక సంఘం నేరుగా పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారమే నిధులను జడ్పీ, మండల పరిషత్తులకు అందజేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. జమ్మికుంట, హుజూరాబాద్‌లు రెండు జంట పట్టణాలనీ, వాటి అభివృద్ధికి తనవంతుగా సహాయ పడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. మంత్రి ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌ నియోజకవర్గంలో చేసిన, చేస్తున్న అభివృద్ధిని కొనియాడారు. రెండు మున్సిపాలిటీల్లో గులాబీ జెండానే ఎగురుతుందనీ, ఆయా పట్టణాల అభివృద్ధిలో మంత్రితో పాటూ తాను పాలుపంచుకుంటానని చెప్పారు. ఎంపీగా కొనసాగిన కాలంలో ఇక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఆయా సమావేశాల్లో జడ్పీ అధ్యక్షురాలు విజయ, ఐడీసీ చైర్మన్‌ శంకర్‌రెడ్డి, జడ్పీటీసీ శ్యాం, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్‌ మాజీ అధ్యక్షుడు రాజేశ్వర్‌రావు, నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి,  మల్లయ్య, రమేశ్‌, శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్‌, హుజూరాబాద్‌లో ఏకగ్రీవంగా గెలిచిన కౌన్సిలర్‌ బీ యాదగిరినాయక్‌, టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ అభ్యర్థులు, నాయకులు పాల్గొన్నారు.logo