శనివారం 06 జూన్ 2020
Karimnagar - Jan 24, 2020 , 02:01:29

నగర ‘పోరు’ నేడే

నగర ‘పోరు’ నేడే
  • -ఓటింగ్‌కు అన్ని ఏర్పాట్లూ చేసిన అధికారులు
  • - సామగ్రి పంపిణీ పూర్తి
  • - పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది
  • - 82 సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి
  • - అన్ని ప్రాంతాల్లో వెబ్‌కాస్టింగ్‌
  • - ఏర్పాట్లను పరిశీలించిన సీడీఎంఏ, కలెక్టర్‌, సీపీ

కరీంనగర ‘పోరు’కు సర్వం సిద్ధమైంది. జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలలో ఇప్పటికే పోలింగ్‌ పూర్తి కాగా, నగరంలో శుక్రవారం జరుగనున్నది. ఉదయం         7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనుండగా, ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. మొత్తం 60 డివిజన్లకు రెండు ఏకగ్రీవం కాగా, మిగిలిన 58 డివిజన్లకు ఓటింగ్‌ నిర్వహిస్తున్నారు. 369 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, మొత్తం 337 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 82 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
- కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: కరీంనగర్‌ నగరపాలక సంస్థలో ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 60 డివిజన్లు ఉండగా వీటిల్లో 37, 20 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా, మిగిలిన 58 డివిజన్లకు 369 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా.. శుక్రవారం పోలింగ్‌ జరుగనుంది. నగరంలో మొత్తంగా 2,72,692 ఓటర్లు ఉండగా, 82 కేంద్రాల్లో 337 పోలింగ్‌ సేష్టన్లను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల కోసం రెండు వేల మంది సిబ్బందిని నియమించగా.. 20 మంది రూట్‌, 20 మంది నోడల్‌, 20 మంది సెక్టార్‌, 337 మంది పోలింగ్‌ అధికారు(పీఓ)లతో పాటు 337 మంది ఏపీఓలు, బూత్‌కు ముగ్గురు చొప్పున ఓపీఓలను నియమించారు. వీరితో పాటు 20 మంది రిటర్నింగ్‌, 20 మంది అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. మరో 400 మంది మున్సిపాలిటీ సిబ్బంది కూడా విధుల్లో ఉంటారు. ప్రతి సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ నిర్వహిస్తున్నారు.

పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది..

నగరంలో పోలింగ్‌ నిర్వహణ కోసం ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల మైదానంలో సిబ్బందికి గురువారం సామగ్రిని అందించారు. ఇందుకోసం పోలింగ్‌ సేష్టన్ల వారీగా మైదానంలో టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచే ఎన్నికల సిబ్బందికి విధులు కేటాయించి సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. సిబ్బంది ఆయా పోలింగ్‌ కేంద్రాలను చేరుకునేందుకు వీలుగా 90 బస్సులను సిద్ధం చేయగా, సాయంత్రం 4 గంటల తర్వాత సామగ్రితో పోలింగ్‌ సేష్టన్లకు చేరుకున్నారు.
డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ను పరిశీలించిన సీడీఎంఏ, కలెక్టర్‌

కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో శుక్రవారం జరగనున్న పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ శశాంక తెలిపారు. గురువారం స్థానిక ఎస్సారార్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీడీఎంఏ) శ్రీదేవి, పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నగరపాలక సంస్థలో 60 డివిజన్లకు గాను రెండు ఏకగ్రీవం కాగా, 58 డివిజన్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు 337 పోలింగ్‌ కేంద్రాలను 82 ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నగరపాలక సంస్థ ఎన్నికల బరిలో 369మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని పేర్కొన్నారు. నగరంలో మొత్తం 2,72,692 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఎన్నికలకు 20 మంది రిటర్నింగ్‌, 20 మంది అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు, 58 డివిజన్లకు 58 మంది ప్రిసైడింగ్‌, 58 మంది అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు ప్రతి పోలింగ్‌ స్టేషన్‌కు ముగ్గురిని ఇతర పోలింగ్‌ అధికారులను నియమించినట్లు చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్‌ శాతం తక్కువగా ఉంటుందని అంటారనీ, చైతన్యవంతులైన కరీంనగర్‌ నగర ప్రజలు అందరూ ఓటింగ్‌లో పాల్గొనాలని కోరారు. నగరంలో 82 సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలిం గ్‌  కేంద్రాలను గుర్తించామనీ, వాటిలో వెబ్‌ కాస్టిం గ్‌, వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీసు బందోబస్తు కూడా ఎక్కువగానే చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌లాల్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ వేణుగోపాల్‌రెడ్డి, ఎస్‌ఈ భద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.
logo