సోమవారం 01 జూన్ 2020
Karimnagar - Jan 24, 2020 , 02:01:29

‘బ్యాలెట్‌'లో భవితవ్యం

‘బ్యాలెట్‌'లో భవితవ్యం
  • - రేపు మున్సి‘పోల్స్‌' ఫలితాలు
  • - కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
  • - గెలుపుపై ఎవరి ధీమా వారిదే
  • - పోలింగ్‌ శాతాన్ని బట్టి అంచనాలు
  • - అభ్యర్థుల్లో సర్వత్రా ఉత్కంఠ
  • - నాలుగు బల్దియాల్లో గెలుపు ఖాయమంటున్న టీఆర్‌ఎస్‌
  • - ఈ నెల 27న చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక

మున్సి‘పోల్స్‌' బుధవారం ముగియగా అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్‌ బాక్సుల్లో భద్రంగా ఉంది. ఈ నెల 25న ఓట్ల లెక్కింపు ఉండగా, సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు సంబంధించి వార్డుల వారీగా పోలింగ్‌ శాతాన్ని బట్టి అంచనాలు వేసుకుంటూ పార్టీల నేతలు ఫలితాలపై విశ్లేషించుకుంటున్నారు. అన్ని బల్దియాలపై గులాబీ జెండా ఎగురేసి చైర్మన్‌ పీఠం దక్కించుకుంటామని అధికార పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుండగా, తమకు బలమున్న చోట్ల గెలిచితీరుతామని విపక్ష పార్టీలు భరోసాతో ఉన్నాయి. కాగా, ఈ నెల 27న ఉదయం 11 గంటలకు కౌన్సిలర్లు ప్రమాణం స్వీకారం చేయనుండగా, 12.30 గంటలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ఉంటుంది.  - కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలైన హుజూరాబాద్‌, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లికి సంబంధించిన ఎన్నికలు బుధవారం ముగియగా, అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్‌ బాక్సుల్లో దాగి ఉంది. పోలింగ్‌ అనంతరం ఆయా పోలింగ్‌ కేంద్రాల్లోని బ్యాలెట్‌ బాక్సులను అధికారులు భారీ బందోబస్తు మధ్య ఆయా పట్టణాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూంలకు తరలించారు. ఈ నెల 25న ఓట్ల లెక్కింపు ఉండగా, బరిలో నిలిచిన అభ్యర్థులంతా గెలుపుపై అంచనాలు వేసుకుంటున్నారు. వారం రోజులుగా హోరాహోరీగా ప్రచారం నిర్వహించగా.. బుధవారం జరిగిన పోలింగ్‌ సరళిని బట్టి ఎవరి అంచనాల్లో వారు లెక్కలు వేసుకుంటున్నారు. ఓట్ల లెక్కింపునకు ఒక రోజు గడువు ఉండడంతో అభ్యర్థులు తమ వార్డుల్లో పర్యటిస్తూ గెలుపుపై అంచనాలు వేసుకుంటున్నారు.

గెలుపుపై ఎవరి ధీమా వారిదే

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 86 వార్డులు కాగా, హుజూరాబాద్‌లో 30, జమ్మికుంటలో 30, చొప్పదండిలో 14, కొత్తపల్లిలో 12 ఉన్నాయి. ఇందులో హుజూరాబాద్‌లోని 2, 28 వార్డు ల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన వార్డుల్లో ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో మెజార్టీ స్థానాలు అధికార పార్టీ కైవసం చేసుకునే అవకాశముండగా, తమకు బలమున్న కొన్ని వార్డుల్లోనైనా గెలుపొందుతామనే ధీమాలో విపక్ష పార్టీలు ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు 2, 3 స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, నాలుగు మున్సిపాలిటీల చైర్మన్‌ స్థానాలు టీఆర్‌ఎస్‌ ఖాతాలోకి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది.

పోలింగ్‌ శాతాన్ని బట్టి అంచనాలు

మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ సరళిని బట్టి అన్ని పార్టీల అభ్యర్థులు తమ గెలుపుపై అంచనాలు వేసుకుంటున్నారు. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు సైతం తమతమ వార్డుల్లోని ఓటర్లతో చర్చిస్తూ గెలుపుపై అంచనాకు వస్తున్నారు. నాలుగు మున్సిపాలిటీల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు అత్యధికంగా పోలింగ్‌లో పాల్గొనడం విశేషం. మొత్తంగా 38,423 మంది మహిళా ఓటర్లకు గానూ 31147 (81.06 శాతం), 38004 మంది పురుష ఓటర్లకు గానూ 30382 (79.94 శాతం) మంది ఓటు వేశారు. దీనిని బట్టి మహిళలే గెలుపు నిర్ణేతలుగా తెలుస్తున్నది. మున్సిపాలిటీల వారీగా పోలింగ్‌ చూస్తే హుజూరాబాద్‌లో 19,946 (82.49 శాతం), జమ్మికుంటలో 23,571 (78.89 శాతం), కొత్తపల్లిలో 7,707 (79.74 శాతం), చొప్పదండిలో 10,305 (81.12 శాతం) మంది ఓట్లు వేశారు. ఇందులో అత్యధికంగా మహిళలే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ని బట్టి ఆయా మున్సిపాలిటీల్లోని వార్డుల్లో అధికార పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొందుతుందనీ, ఒకటీ రెండు చోట్ల మాత్రమే కాంగ్రెస్‌, బీజేపీ, ఇతరులు గెలుపొందే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్‌పోల్‌ అంచనాలు వస్తున్నాయి.

27న మున్సిపల్‌ చైర్మన్ల ఎన్నిక

మున్సిపల్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నికలను ఈ నెల 27న నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ మేరకు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్‌ చైర్మన్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కలెక్టర్‌ పర్యవేక్షణలో జరిగే ఈ ఎన్నికల కోసం ప్రత్యేక అధికారులను నియమిస్తారు. కరీంనగర్‌ నగరపాలక సంస్థ మినహా జిల్లాలోని జమ్మికుంట, హుజూరాబాద్‌, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీలకు ఈ నెల 22న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నెల 25న ఆయా మున్సిపాలిటీల పరిధిలోనే ఓట్ల లెక్కింపు ఉంటుంది. గెలిచిన అభ్యర్థులకు ఇదే రోజు ఆయా మున్సిపాలిటీలకు నియమించిన ప్రత్యేకాధికారులు నోటీసులు జారీ చేస్తారు. ఈ నెల 27న జరిగే ప్రత్యేక సమావేశానికి హాజరు కావాలని నోటీసులు ఇస్తారు. ఈ మేరకు ఆయా మున్సిపాలిటీలకు కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు ప్రత్యేక సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ నెల 27న ప్రతి మున్సిపాలిటీలో ఉదయం 11.00 గంటలకు ప్రత్యేక అధికారుల అధ్యక్షతన మొదటి సమావేశం జరుగుతుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు మున్సిపల్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికల కమిషన్‌ సూచించినట్లు ఈ నెల 27న చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలు ఏవైనా కారణాలతో జరగని పక్షంలో మరుసటి రోజైన 28న ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.
logo