గురువారం 04 జూన్ 2020
Karimnagar - Jan 23, 2020 , 02:48:30

ఓటెత్తిన పట్టణం

ఓటెత్తిన పట్టణం
 • - ముగిసిన ‘పుర’ ఓటింగ్
 • - కదిలిన పట్టణవాసులు
 • - ఉదయం నుంచే కేంద్రాలకు బారులు
 • - కొత్త బల్దియాల్లో ఉత్సాహం చూపిన ఓటర్లు
 • - ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు
 • - మొత్తంగా ఓటు వేసింది 61,529 మంది..
 • - హుజూరాబాద్ అత్యధికంగా 82.49 శాతం
 • - ఓటింగ్ మహిళలదే ఆధిక్యం
 • - కేంద్రాలను పర్యవేక్షించిన కలెక్టర్, సీపీ
 • - 25న ఫలితాలు
 • - ఉత్కంఠలో అభ్యర్థులు


కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ‘పుర’ పోరు ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో బుధవారం పోలింగ్ నిర్వహించగా, పట్టణవాసుల్లో ఓటోత్సాహం కనిపించింది. అంతటా ఉదయం నుంచే కేంద్రాలకు బారులు తీరి ఓటు వేయడం కనిపించింది. 76427 మంది ఓటర్లకు 61529 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో సగటున 80.50 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా హుజూరాబాద్ 82.49 శాతం, చొప్పదండిలో 81.12శాతం, అల్పంగా కొత్తపల్లిలో 79.74శాతం, జమ్మికుంటలో 78.89 శాతం నమోదైనట్లు యంత్రాంగం తెలిపింది. మొత్తంగా 38,423 మంది మహిళా ఓటర్లకు గానూ 31147 (81.06 శాతం), 38004 మంది పురుష ఓటర్లకు గానూ 30382 (79.94 శాతం) మంది ఓటు వేయగా, అంతిమంగా ఆడబిడ్డలే ‘గెలుపు’నిర్ణేతలని స్పష్టమవుతున్నది. కాగా, కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్ కొత్తపల్లి మున్సిపల్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.       

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రా ల వద్ద బారులు తీరారు. అధికారులు అన్ని వసతులూ కల్పించడంతో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఓటు వేశారు. పెద్ద సంఖ్యలో ఓట్లు ఉన్న జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీల్లోనే కాదు.. కొత్తగా ఏర్పడిన చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీల్లోనూ ఓటర్లు బారులు తీరారు. పురుషుల కంటే మహిళలే ఎక్కువగా కనిపించారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన వీల్ చైర్స్ ఉపయోగించారు. వీరికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందాలే కాకుండా పోలీసులు, ఇతర సిబ్బంది కూడా సేవలు అందించగా, త్వరగా ఓటు వేసే అవకాశం కల్పించారు. 84 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు 145 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో బారులు తీరిన ఓటర్లు ఎక్కువ సమయం వేచి ఉండకుండా ఓటు వేయగలిగారు. కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్ కొత్తపల్లి ఎన్నికల కేంద్రాలను సందర్శించి అధికారులకు సలహాలు, సూచనలు చేశారు. నిత్యం పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు పూర్తిగా ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా జరిగాయి.

గంట గంటకూ పెరిగిన పోలింగ్

ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ మొదట కాస్త మందకొడిగా కనిపించింది. 9 గంటల వరకు హుజూరాబాద్ 3,957, జమ్మికుంటలో 5,081, కొత్తపల్లిలో 1,837, చొప్పదండిలో 2,002 మంది చొప్పున 12,877 మంది మాత్రమే ఓట్లు వేశారు. అప్పటికి 16.84 శాతం మాత్రమే ఉన్న పోలింగ్ ఉదయం 9 నుంచి పుంజుకుంది. 11 గంటల మధ్య బాగా పెరిగింది. ఈ సమయంలో 39.41 శాతానికి పోలింగ్ చేరుకుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 14,777, జమ్మికుంటలో 18,095, కొత్తపల్లిలో 5,863, చొప్పదండిలో 7,328 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అప్పటికే 60.27 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి కాస్త మందకొడిగా మారింది. సాయంత్రం 5 గంటల వరకు హుజూరాబాద్ 19,946 (82.49 శాతం), జమ్మికంటలో 23,571 (78.89 శాతం), కొత్తపల్లిలో 7,707 (79.74 శాతం), చొప్పదండిలో 10,305 (81.12 శాతం) మంది ఓట్లు వేశారు. అత్యధికంగా మహిళలే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా చూస్తే 30,382 మంది పురుషులు, 31,147 మంది మహిళలు ఓట్లు వేశారు.

స్ట్రాంగ్ బ్యాలెట్ బాక్సులు

ఎన్నికలు ముగిసిన అనంతరం ఆయా పోలింగ్ కేంద్రాల్లోని బ్యాలెట్ బాక్సులను అధికారులు భారీ బందోబస్తు మధ్య స్ట్రాంగ్ తరలించారు. జమ్మికుంటకు సంబంధించినవి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు, హుజూరాబాద్ సంబంధించిన బాక్సులు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు, చొప్పదండికి సంబంధించినవి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు, కొత్తపల్లికి సంబంధించిన బాక్సులు స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలకు తరలించారు. కాగా, పోలింగ్ శాతం అధికంగా నమోదవడంతో ఫలితాలపై అభ్యర్థుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. logo