ఆదివారం 31 మే 2020
Karimnagar - Jan 21, 2020 , 01:53:30

మళ్లీ గెలిస్తేనే వేగంగా అభివృద్ధి

మళ్లీ గెలిస్తేనే వేగంగా అభివృద్ధి
  • - గులాబీ అభ్యర్థులకు అత్యధిక మెజారిటీ ఇవ్వాలి
  • - 24 గంటల కరెంటు టీఆర్‌ఎస్‌ ఘనతే - మంత్రి గంగుల కమలాకర్‌
  • - నగరంలో విస్తృతంగా ప్రచారం పలు చోట్ల రోడ్‌షోలు

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ : కరీంనగర్‌లో టీఆర్‌ఎస్‌ను మళ్లీ గెలిపిస్తేనే అభివృద్ధి వేగంగా జరుగుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. తమ హయాంలోనే నగరం అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఈ మేరకు సోమవారం నగరంలోని రాంనగర్‌, భగత్‌నగర్‌, రేకుర్తి, హుస్సేనిపుర చౌరస్తాల్లో 15, 17, 18, 19, 34, 36, 54, 11, 13, 33, 51, 52, 53 డివిజన్లకు సంబంధించి ప్రచారం సాగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి చేసే పార్టీలకే ప్రజలు ఓటు వేయాలనికోరారు. విపక్షాలకు ఓటు వేస్తే ధర్నాలు, ఆందోళనలకు మాత్రమే పరిమితమవుతారని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే ఎల్‌ఎండీ, మధ్యమానేరు పూర్తిస్థాయిలో నిండాయనీ, గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో నీరు లేదన్నారు. ప్రజలకు 24 గంటల కరెంటు అందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌దేనన్నారు. గత ప్రభుత్వాల కాలంలో ఎప్పుడు కరెంటు వస్తుందో పోతుందో కూడా తెలియని పరిస్థితి ఉండేందన్నారు.

మహిళల ఆర్థికాభివృద్ది కోసం సీఎం కేసీఆర్‌ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నగరంలో అభివృద్ధికి నోచుకోని రోడ్లను కూడా ఇప్పుడు తాము అభివృద్ధి చేస్తున్నామన్నారు. మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ ఓటు వేయాలన్నారు. నగరంలోని ప్రధాన రహదారులన్నీ ఇప్పటికే పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాయనీ, డివిజన్లలోని రోడ్లు, మురుగుకాల్వలు కూడా పూర్తిస్థాయిలో ఆధునికీకరిస్తున్నామనీ, రానున్న రోజుల్లో నగర రూపురేఖలు పూర్తిస్థాయిలో మారిపోతాయని చెప్పారు. ప్రచారంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌, మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు వై సునీల్‌రావు, దిండిగాల మహేశ్‌, ఆమ లతఆనంద్‌, బోనాలశ్రీకాంత్‌, తోట మధు, నందెల్లి మధుహ, గోలి కిష్టయ్య, కోల భాగ్యలక్ష్మి, బుచ్చిరెడ్డి, తుల శ్రీదేవి, టీఆర్‌ఎస్‌ నాయకులు చల్ల హరిశంకర్‌, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.
logo