మంగళవారం 26 మే 2020
Karimnagar - Jan 21, 2020 , 01:52:00

నిండు మనసుతో ఆశీర్వదించండి

నిండు మనసుతో ఆశీర్వదించండి
  • - భారీ మెజారిటీతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించండి
  • - ఒక్క స్థానం కూడా ప్రతిపక్షాలకు ఇవ్వొద్దు
  • - టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం
  • - పైసా ఖర్చు లేకుండా విద్య, వైద్యం అందిస్తున్నాం
  • - సంపూర్ణ మద్దతునివ్వండి.. అభివృద్ధికి తోడ్పడండి
  • - రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌
  • - హుజూరాబాద్‌, జమ్మికుంటలో రోడ్‌షోలు
  • - భారీగా హాజరైన జనం

హుజురాబాద్‌ నమస్తే తెలంగాణ/ టౌన్‌ /జమ్మికుంట : మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను నిండు మనసుతో ఆశీర్వదించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జమ్మికుంట, హుజూరాబాద్‌ పట్టణాల్లో గులాబీ సైన్యం నిర్వహించిన భారీ ర్యాలీలు, రోడ్‌షోలలో మంత్రి పాల్గొన్నారు. ముందుగా జమ్మికుంటలో టీఆర్‌ఎస్‌ అర్బన్‌శాఖ అధ్యక్షుడు టంగుటూరి రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ చౌక్‌ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు పట్టణంలోని 30 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో రోడ్‌ షో నిర్వహించారు. ముందుగా అంబేద్కర్‌, గాంధీజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

రోడ్‌ షో తర్వాత తెలంగాణ చౌక్‌ వద్ద టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు. అనంతరం హుజూరాబాద్‌లో జమ్మికుంటరోడ్‌లోని సాయిరూప గార్డెన్‌ నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. చౌరస్తాలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా రెండు పట్టణాల్లో భారీగా హాజరైన ప్రజలనుద్దేశించి మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్‌, ఇతర పార్టీల నాయకులు పదవులకోసం పాకులాడడమే తప్ప ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఒక్క కౌన్సిలర్‌ స్థానం కూడా ప్రతిపక్షాలకు ఇవ్వవద్దని కోరారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తామంటే ఆంధ్రా మీడియా, అప్పటి పాలకులు చిలువలు వలువలు చేశాయని గుర్తు చేశారు. దేశంలోని కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో 24 గంటల కరెంటు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఆ పార్టీలనాయకులు కేవలం ఓట్ల కోసమే వస్తారే తప్ప ప్రజల బాగోగుల గురించి పట్టించుకోరని ఎద్దేవా చేశారు.

 భారీ మెజారిటీతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తే పట్టణాన్ని సుందరీకరణ చేసే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు , అర్హులైన వారందరికీ పింఛన్‌లు ఇస్తామన్నారు. గతంలో నిజాం కాలంలో కట్టిన భవనంలో దవాఖాన కొనసాగిందనీ, దానిని తర్వాత పాలకులు పట్టించుకోలేదనీ, ఇప్పుడు హైదరాబాద్‌, కరీంనగర్‌ తరహాలో హుజురాబాద్‌ దవాఖానను తీర్చిదిద్దానని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా రాష్ట్ర సర్కార్‌ పనిచేస్తున్నదనీ, పేద ప్రజలకు విద్య, వైద్యంపై పైసా ఖర్చు లేకుండా అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలో ప్రజల ఆదరణ మరువలేనిదనీ, ప్రజలకు మచ్చ తేకుండా నడుచుకుంటున్నాననీ, చెడ్డ పేరు వచ్చినప్పుడు రాజకీయాల నుంచి దూరమవుతానని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పథకాల్లో ఒక్కటన్నా బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత ప్రాంతాల్లో అమలు చేస్తున్నారా..? అని ప్రశ్నించారు. జమ్మికుంటను సుందరంగా తీర్చిదిద్దుకుందామనీ, సంపూర్ణ మద్దతునివ్వాలని కోరారు. యువతకు ఉపాధి చూపే బాధ్యత తనదేననీ, ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తాననీ, ఉద్యోగులుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ప్రచార రోడ్‌షోలలో జడ్పీ అధ్యక్షురాలు విజయ, బీసీ కమిషన్‌ సభ్యులు వకుళారణం కృష్ణమోహన్‌రావు, ఎంపీపీలు మమత, ఇరుమల్ల రాణి, జడ్పీటీసీలు డాక్టర్‌ శ్యాం, పడిదం బక్కారెడ్డి, హుజూరాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎడవెల్లి కొండాలరెడ్డి, నాయకులు బండ శ్రీనివాస్‌, పరిపాటి రవీందర్‌రెడ్డి, రమేశ్‌, సమ్మిరెడ్డి, రవీందర్‌రెడ్డి, గోపు కొంరారెడ్డి, కొలిపాక శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.logo