బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Jan 21, 2020 , 01:49:45

మున్సిపల్‌ ఎన్నికలకు అన్ని ఏర్పాట్ల్లు పూర్తి

మున్సిపల్‌ ఎన్నికలకు అన్ని ఏర్పాట్ల్లు పూర్తి
  • - నాలుగు పట్టణాల్లో 144 సెక్షన్‌
  • - కలెక్టర్‌ శశాంక
  • - సీపీతో కలిసి సమావేశం

(కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ): జిల్లాలో జమ్మికుంట, హుజూరాబాద్‌, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ కే శశాంక తెలిపారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్‌ శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, నాలుగు మున్సిపాలిటీలకు ఈ నెల 22న ఎన్నికలు, 25న లెక్కింపు, కరీంనగర్‌ పురపాలక సంస్థకు ఈ నెల 24న ఎన్నికలు, 27న లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుందన్నారు. కొత్తపల్లిలో 12, చొప్పదండిలో 14, జమ్మికుంటలో 30, హుజూరాబాద్‌లో మరో 30 చొప్పున 86 వార్డులు, కరీంనగర్‌ నగర పాలక సంస్థలో 60 డివిజన్లున్నాయని తెలిపారు. వీటిలో ఎన్నికలు నిర్వహించేందుకు 122 లోకేషన్లలో 493 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని  స్పష్టం చేశారు. 751 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారనీ, హుజూరాబాద్‌లో రెండు వార్డులు, కరీంనగర్‌ కార్పొరేషన్‌లో రెండు డివిజన్లకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్‌ తెలిపారు. మిగతా చోట్ల సర్వంసిద్ధం చేశామన్నారు.  హుజూరాబాద్‌ మున్సిపాలిటీకి సంబంధించి హుజూరాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌, కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్‌ తెలిపారు. జమ్మికుంట మున్సిపాలిటీకి సంబంధించి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, చొప్పదండి మున్సిపాలిటీకి సంబంధించి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కొత్తపల్లి మున్సిపాలిటీకి సంబంధించి స్థానిక జిల్లా ప్రజా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో, కరీంనగర్‌ నగరపాలక సంస్థకు సంబంధించి స్థానిక ప్రభుత్వ ఎస్సారార్‌ డిగ్రీ కళాశాలల్లో డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌, కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ వివరించారు.

23 మంది రూట్‌ ఆఫీసర్లు..

ఎన్నికల నిర్వహణ కోసం 23 రూట్లలో 23 మంది రూట్‌ ఆఫీసర్లను నియమించామనీ, ఇందుకు 120 బస్సులు వాడుతున్నామని కలెక్టర్‌  తెలిపారు. 592 మంది ప్రిసైడింగ్‌, మరో 592 మంది అసిస్టెంట్‌ ప్రెసైడింగ్‌ ఆఫీసర్లు, 1,795 మంది ఇతర పోలింగ్‌ ఆఫీసర్లు కలిపి మొత్తం 2,751 మందిని ఎన్నికల  నిర్వహణకు నియమించినట్లు వివరించారు.  ఎన్నికల నిర్వహణకు 54 మంది రిటర్నింగ్‌ ఆఫీసర్లు, 54 మంది అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్లు ఉన్నారని ఆయన తెలిపారు. అన్ని మున్సిపాలిటీల్లో 139 సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లున్నట్లు గుర్తించామని తెలిపారు. సమస్యాత్మక స్టేషన్లలో వెబ్‌ కాస్టింగ్‌ చేయిస్తున్నామనీ, 52 లోకేషన్లలో వీడియోగ్రఫీ చేస్తున్నామన్నారు. ఈ లొకేషన్ల పరిశీలనకు 70 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఓటర్లందరికీ ఫొటో, ఓటర్‌ స్లిప్‌లు పంపిణీ చేశామనీ,  ఫొటో, ఓటర్‌ స్లిప్‌తో పాటు 18 రకాల వ్యక్తిగత గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి వెంట తీసుకొని వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు సూచించారు. అన్ని పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందన్నారు. నాలుగు మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలతో ముగిసిందనీ, కరీంనగర్‌ నగరపాలక సంస్థలో మాత్రం ఈ నెల 22న సాయంత్రం 5 గంటల్లోపు ముగుస్తుందన్నారు. ఎన్నికలకు ఒకరోజు ముందు, ఎన్నికల రోజు ప్రింట్‌ మీడియాలో అడ్వైర్టెజ్‌మెంట్ల ప్రచురణలకు మీడియా నోడల్‌ ఆఫీసర్‌ సర్టిఫికేషన్‌ తప్పనిసరి అవసరమని తెలిపారు.

3,50,879 మంది ఓటర్లు..

మున్సిపల్‌ ఎన్నికల్లో 3,50,879 మంది ఓటర్లున్నారనీ, ఇందులో అత్యధికంగా కరీంనగర్‌ నగరపాలక సంస్థలో 2,72,692 మంది ఉన్నారని కలెక్టర్‌ తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో నిర్భయంగా, స్వేచ్ఛగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 24న కరీంనగర్‌ నగరపాలక సంస్థకు జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని విద్యాసంస్థలు, ఇతర సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు లేబర్‌ యాక్టు ప్రకారం 3 గంటల అనుమతి కల్పించినట్లు చెప్పారు.  కొత్తపల్లి, చొప్పదండి, జమ్మికుంట, హుజూరాబాద్‌ మున్సిపాలిటీల్లో   ప్రచారం ముగుస్తున్నందున ఎలాంటి సభలు, సమావేశాలు, మైక్‌లు వాడి ప్రచారం చేసుకోరాదని కలెక్టర్‌ స్పష్టం చేశారు.  ఎన్నికల కమిషన్‌ నిబంధనలు ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ప్రచారం ముగిసిన సైలెన్స్‌ పీరియడ్‌లో ఎలాంటి అతిక్రమణలు జరిగినా పరిశీలించేందుకు తమ బృందాలు నిఘా పెంచాయని తెలిపారు.

నిఘా నీడలో ఎన్నికలు..:సీపీ

జిల్లాలో రెండు విడుతల్లో జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామనీ, నిఘా నీడలో నిర్వహిస్తున్నామని సీపీ కమలాసన్‌రెడ్డి స్పష్టంచేశారు. నాలుగు మున్సిపాలిటీల్లో ప్రచార కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగాయనీ, ఇందుకు సహకరించిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులకు సీపీ ధన్యవాదాలు తెలిపారు.  492 మందిని బైండోవర్‌ చేశామనీ, 15 మందిని జైలుకు పంపామన్నారు. పోలీస్‌ కేంద్రాల పరిధిలో కొన్ని వందల సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్‌ స్టేషన్‌కు వంద మీటర్ల దూరంలో ఎవరినీ అనుమతించబోమన్నారు. ఎన్నికలను పర్యవేక్షించేందుకు ఏసీపీ స్థాయి అధికారులను ఒక్కో పట్టణాకి ఒక్కొక్కరి చొప్పున నోడల్‌ అధికారులుగా నియమించామన్నారు.   సమావేశంలో కరీంనగర్‌ నగరపాలక సంస్థ కమిషనర్‌ వేణుగోపాల్‌రెడ్డి, ఎంసీఎంసీ కమిటీ నోడల్‌ ఆఫీసర్‌, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌, తదితరులు పాల్గొన్నారు.
logo