గురువారం 28 మే 2020
Karimnagar - Jan 20, 2020 , 03:10:17

కాంగ్రెస్‌, బీజేపీలకు ఓటెందుకు వేయాలి

కాంగ్రెస్‌, బీజేపీలకు ఓటెందుకు వేయాలి
 • -ఏం అభివృద్ధి చేశారని అడుగుతున్నారు
 • -రాష్ట్ర పథకాల్లో కేంద్రం నిధులు ఉన్నాయని బీజేపీ అబద్ధపు ప్రచారం
 • - కేంద్ర బడ్జెట్‌లో ఇక్కడి పథకాలకు సగం నిధులు కేటాయిస్తారా?
 • - నగరాన్ని అభివృద్ధి చేసింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే..
 • - మంత్రి గంగుల పాత్ర ఎంతో ఉంది..
 • - కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీని సాధించింది మేమే..
 • -ఈసారి గెలిపిస్తే 100 కిలోమీటర్ల వేగంతో అభివృద్ధి
 • - కరీంనగర్‌కు ఐటీ టవర్‌ కావాలని ఎవరైనా అడిగారా?
 • - మానేరు రివర్‌ ఫ్రంట్‌ ఇవ్వాలని ఎవరైనా కోరారా?
 • -వీటన్నింటికీ మేమే రూపకల్పన చేసి సాధించాం
 • - నగరంలో 60కి 60 సీట్లు మేమే గెలుస్తాం
 • - రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌

కరీంనగర్‌తో పాటు ఇతర పట్టణాలను ఏం అభివృద్ధి చేశారని ఓట్లు అడుగుతున్నారని కాంగ్రెస్‌, బీజేపీ నాయకులను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ ప్రశ్నించారు. ఆ పార్టీలకు ఎందుకు ఓటు వేయాలో ఆలోచించుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్‌ను అభివృద్ధి చేసింది కేవలం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని స్పష్టం చేసిన ఆయన, నగరాభివృద్ధిలో ఎమ్మెల్యేగా మంత్రి గంగుల కమలాకర్‌ పాత్ర ఎంతో ఉన్నదని చెప్పారు. ఆదివారం స్థానిక శ్వేతా హోటల్‌లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నగరాభివృద్ధి గురించి పట్టించుకోని కాంగ్రెస్‌, బీజేపీలకు ఓటడిగే హక్కు లేదని ధ్వజమెత్తారు.
- కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ

(కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ) 014కు ముందు 2020లో కరీంనగర్‌ ఎలా ఉందో ఓటర్లు గమనించాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్‌కుమార్‌ నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరంలోని శ్వేతా హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొట్ట మొదట కరీంనగర్‌లో పర్యటించి అనేక హామీలు ఇచ్చారనీ, వాటిపై కొందరు వెకిలి నవ్వులు నవ్వారనీ, మరికొందరు ఇది సాధ్యమయ్యేపనేనా అని ప్రశ్నించారని గుర్తు చేశారు. వెకిలి నవ్వులు నవ్విన వారి నోర్లు మూయించేలా, అసాధ్యం సుసాధ్యమయ్యేలా కరీంనగర్‌ ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో కండ్లకు కట్టినట్లుగా కనిపిస్తోందన్నారు. ఇతర జిల్లాల వారు కరీంనగర్‌ అభివృద్ధిని చూసి ముచ్చట పడుతున్నారని చెప్పారు. నగరాభివృద్ధి కోసం గడచిన ఐదేళ్లలో ఎంపీగా తాను, ఎమ్మెల్యేగా మంత్రి గంగుల కమలాకర్‌తోపాటు మేయర్‌, కార్పొరేటర్ల కృషి ఎంతో ఉందన్నారు. నగరానికి ఐటీ టవర్స్‌, తీగల వంతెన, మానేరు రివర్‌ ఫ్రంట్‌ కావాలని ఎవరైనా అడిగారా? అని ప్రశ్నించిన వినోద్‌కుమార్‌, వాటన్నింటికీ తామే రూపకల్పన చేసి సాధించుకున్నామని స్పష్టం చేశారు. ఇప్పుడు ఆరు అంతస్థుల్లో ఐటీ టవర్‌ నిర్మాణం పూర్తి కావడం, కలకత్తా హౌరా వంతెన లాంటిది నగరానికి ఆనుకుని ఉన్న మానేరు వంతెన మీద శరవేగంగా నిర్మాణం జరుగుతున్న విషయాన్ని ఎవరు కాదనగలరని నొక్కి చెప్పారు. వారం రోజుల కిందనే మంత్రి గంగుల సీఎం కేసీఆర్‌ను తన సమక్షంలోనే కలిసి మానేరు రివర్‌ ఫ్రంట్‌ గురించి చర్చించారని తెలిపారు. సింథటిక్‌ ట్రాక్‌, సైన్స్‌ సెంటర్‌ ఇలా అనేక పనులు నగరం కోసం సాధించుకున్నామనీ, ఈ అభివృద్ధిని చూసి టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని వినోద్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు.

కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ ఘనత టీఆర్‌ఎస్‌దే..

కరీంనగర్‌ దేశంలోనే చాలా చిన్న నగరమైనప్పటికీ స్మార్ట్‌సిటీ జాబితాలో చోటు దక్కిందనీ, ఇది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఘనతని వినోద్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఎంపీగా తాను సాధించిన పనుల్లో ఎక్కువ సమయం స్మార్ట్‌సిటీ కోసమే కేటాయించానని గుర్తుచేశారు. కేవలం 3 లక్షల జనాభా మాత్రమే ఉన్న ఈ నగరాన్ని స్మార్ట్‌ సిటీ జాబితాలో చేర్చడం గొప్ప విషయంగా తాము భావిస్తున్నామన్నారు. దీనిని సాధించేందుకు మంత్రి గంగుల, అప్పటి మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ తనతో అనేకసార్లు ఢిల్లీ వచ్చి కేంద్ర మంత్రులు, అధికారులను కలిసి వెంట పడి సాధించుకున్నారని చెప్పారు. స్మార్ట్‌ సిటీ నిధులు రాకముందు రూ.200 కోట్లు తెచ్చుకుని నగరంలోని ప్రధాన రోడ్లను నిర్మించినట్లు తెలిపారు. ఇపుడు ఎక్కడ చూసినా రోడ్లు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయనీ, విద్యుత్‌ సమస్యలను అధిగమించి ప్రధాన రహదారులను  అందంగా ముస్తాబు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు తమ గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించాలనీ, ఓటడిగే నైతిక హక్కు కాంగ్రెస్‌, బీజేపీలకు ఉందా? అని ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవుపలికారు.

పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు..

బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిన వ్యక్తి అభివృద్ధి మీద మాట్లాడుదామని అంటున్నారనీ, ఏం మాట్లాడుతారనీ, ఎన్ని సార్లు మాట్లాడుతారని వినోద్‌కుమార్‌ ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకుల మాటలు వింటే విచిత్రంగా అనిపిస్తోందనీ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో సగం నిధులు కేంద్రం నుంచి వచ్చినవేనని పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిధులు, నీళ్లు, నియామకాలపై ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌ ఇప్పటికే వీటిలో ఎన్నింటినో సాధించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. రూ.40 వేల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వ కంట్రిబ్యూషన్‌తో రుణాలు తెచ్చి సాధించుకున్న మిషన్‌ భగీరథలో కేంద్రం వాటా ఉన్నదనీ, కల్యాణలక్ష్మి పథకంలో రూ.50 వేలు కేంద్రానివేననీ, కేసీఆర్‌ కిట్‌లో అందిస్తున్న రూ.12 వేలలో సగం కేంద్రానివేనని సోషల్‌ మీడియాలో బీజేపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారనీ, ఇంత కంటే సిగ్గు మాలిన పని మరొకటి లేదని మండిపడ్డారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి నిర్మిస్తున్న కాళేశ్వరం వంటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించుకున్న పథకాల్లో వాటాలున్నాయని అబద్దాలు ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమని అన్నారు. ఈ విషయమై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ను అడిగితే ఆయన నుంచి సమాధానం లేదన్నారు. బీజేపీ నాయకులకు దమ్ముంటే వచ్చే కేంద్ర బడ్జెట్‌ సెషన్‌లో రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సగం నిధులు కేటాయించేలా? ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు.

బీజేపీ చేసుకుంటున్న అబద్ద ప్రచారాన్ని తిప్పి కొడుతూ నగర ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టంగట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆ పార్టీల నుంచి ఎంపీలుగా గెలిచిన వారు ఇప్పటి వరకు అణా పైస పనికూడా చేయలేదనీ, సీఎం కేసీఆర్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్న బీజేపీ నాయకులు కేంద్రంలో అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా ఏం చేశారో వాళ్ల గుండెల మీద చేతులు వేసుకుని చెప్పాలని ప్రశ్నించారు. తాను ఎంపీగా గెలిచిన తొలినాళ్లలోనే అనేక పనులు సాధించుకున్నామని చెప్పిన వినోద్‌కుమార్‌, సాధించిన జాతీయ రహదారుల గురించి వివరించారు. ఇప్పటి వరకు చిన్న పని కూడా చేయలేని నాయకులకు ఎందుకు ఓట్లు వేయాలో నగర ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. వచ్చే నాలుగేండ్లలో రాష్ట్రంలో అధికారంలో ఉండేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేననీ, తమతోనే నగరం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. మంత్రి గంగుల కమలాకర్‌ నగర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారనీ, ఆయనకు మరింత సహకారాన్ని అందించాలంటే నగరంలోని 60 డివిజన్లకు 60 టీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే గెలిపించాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈసారి మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించుకుంటే వంద కిలో మీటర్ల వేగంతో అభివృద్ధి దూసుకుపోతుందని చెప్పారు. 2020లో 60-60 గెలుపు ఖాయమని స్పష్టం చేశారు.

30 సీట్లు ఎలా గెలుస్తారో క్లారిటీ ఇవ్వాలి : మంత్రి గంగుల

రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ నగరంలో 30 సీట్లు గెలుస్తామని ఎంపీ బండి సంజయ్‌ అన్నారనీ, అది తనకు అర్థం కాలేదనీ, 30 సీట్లు గెలుస్తారా, 3.0 సీట్లు గెలుస్తారా? కొంచెం క్లారిటీ ఇవ్వాలని కోరారు. తమ అభ్యర్థి వై సునీల్‌రావు పోటీ చేస్తున్న 33వ డివిజన్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థికి బీజేపీ బీఫాం ఇచ్చిన సంగతి మర్చిపోయి ఎంపీ 30 డివిజన్లు గెలుస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీకి సరైన అభ్యర్థులే లేరనీ, ఎక్కడి నుంచి 30 డివిజన్లు గెలుస్తారని ప్రశ్నించారు. తన లెటర్‌ ప్యాడ్స్‌ చూసి మంత్రులు బయపడుతున్నారని ఎంపీ చెబుతున్నారనీ, అవి చూసి బయపడేది కేంద్ర మంత్రులా, రాష్ట్ర మంత్రులా? అని మంత్రి గంగుల ప్రశ్నించారు. కేంద్ర మంత్రులకు ఎంపీ ఎప్పుడు ఫిర్యాదు చేసినా ఏదో ఒక వివాదమే అవుతోందనీ, ఆయన లెటర్‌ ప్యాడ్‌ వచ్చిందంటే కేంద్ర మంత్రులే భయపడుతున్నారని తెలిపారు. కరీంనగర్‌ ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారనే విశ్వాసం తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి బస్వరాజ్‌ సారయ్య, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్‌, కోడూరి సత్యనారాయణ గౌడ్‌, మాజీ ఎమ్మెల్సీ టీ సంతోష్‌కుమార్‌, మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అక్బర్‌ హుస్సేన్‌, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌ సింగ్‌, నాయకులు డాక్టర్‌ ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి, కొత్త శ్రీనివాస్‌ రెడ్డి, చల్ల హరిశంకర్‌, వై సునీల్‌రావు, కర్ర రాజశేఖర్‌ పాల్గొన్నారు.
logo