బుధవారం 27 మే 2020
Karimnagar - Jan 20, 2020 , 03:09:04

టీఇర్‌ఎస్‌ దూకుడు

టీఇర్‌ఎస్‌ దూకుడు
  • - హోరెత్తుతున్న గులాబీ సేన ప్రచారం
  • -వాడవాడనా ర్యాలీలు, ఊరేగింపులు
  • - గడపగడపకూ వెళ్తున్న అభ్యర్థులు
  • - అభివృద్ధిని వివరిస్తూ ఓటు అభ్యర్థన
  • -- కరీంనగర్‌, కొత్తపల్లిలో ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, మంత్రి గంగుల
  • - హుజూరాబాద్‌లో మంత్రి ఈటల
  • - అల్గునూర్‌, చొప్పదండిలో ఎమ్మెల్యేలు రసమయి, సుంకె


ప్రచారం గడువు దగ్గర పడుతున్న కొద్దీ టీఆర్‌ఎస్‌ దూకుడు పెంచుతోంది. గులాబీ సేన ప్రచారంతో కరీంనగర్‌తో పాటు జిల్లాలోని పట్టణాలు హోరెత్తుతున్నాయి. ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు ర్యాలీలు, ఊరేగింపులు తీస్తుండగా.. అభ్యర్థులు గడపగడపకూ వెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ అండగా ఉండాలని కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. కాగా, కరీంనగర్‌లో జరిగిన ప్రచారంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, మంత్రి గంగుల కమలాకర్‌ పాల్గొనగా, కొత్తపల్లిలో మంత్రి గంగుల వాడవాడనా పాదయాత్రగా కలియదిరిగారు. హుజూరాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్‌, కరీంనగర్‌ పరిధిలోని అల్గునూర్‌లో రసమయి బాలకిషన్‌, చొప్పదండిలో సుంకె రవిశంకర్‌ ప్రచారం చేపట్టి అభ్యర్థుల్లో జోష్‌ పెంచారు.     - కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ


(కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ) మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ఓటు అభ్యర్థిస్తున్నారు. ప్రతి ఓటరును కలుస్తూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ఆదివారం రాత్రి నగరంలోని తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్‌, 22, 23, 41, 42 డివిజన్లకు సంబంధించి వావిలాలపల్లిలో సమావేశం నిర్వహించారు. ఆయా డివిజన్ల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, స్థానిక ప్రజలు తరలివచ్చారు. అంతకు ముందు కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డుల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ సుడిగాలి ప్రచారం చేపట్టారు. పట్టణంలోని వడ్డెరవాడ, ఎస్సీ కాలనీ, గాంధీ చౌరస్తా, సంఘం చౌరస్తా, మడిగెలవాడ, సినిమా థియేటర్‌ ఏరియా, బీబీ జర్ధా రోడ్‌, అంగడిబజార్‌, రెడ్డిరామయ్యపల్లి, తూర్పవాడ ఇలా అన్ని చోట్ల ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయనకు పట్టణ ప్రజలు ఘన స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలు, ఒగ్గు కళాకారుల నృత్యాలు నడుమ మంత్రి గంగుల పట్టణంలో కలియతిరిగారు. ప్రతి ఇంటికీ వెళ్తూ, ప్రతి మనిషినీ కలుస్తూ ఓట్లు అభ్యర్థించిన తీరు ఓటర్లను ఆకట్టుకుంది. స్థానిక వార్డుల అభ్యర్థులతో కలిసి చేసిన ప్రచారానికి విశేష స్పందన వచ్చింది. సాయంత్రం నగరంలోని 1, 2వ డివిజన్ల పరిధిలోని తీగలగుట్టపల్లి, చంద్రపురికాలనీ, వల్లంపహాడ్‌ ప్రాంతాల్లో మంత్రి గంగుల ఇంటింటా ప్రచారం చేశారు.

స్థానిక అభ్యర్థులతో కలిసి ఓట్లు అభ్యర్థించారు. 7వ డివిజన్‌ పరిధిలోని సదాశివపల్లిలో స్థానిక అభ్యర్థితో కలిసి సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణా రావు ఇంటింటా ప్రచారం చేశారు. 8వ డివిజన్‌ పరిధిలోని అల్గునూర్‌లో మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ స్థానిక అభ్యర్థితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఇటు హుజూరాబాద్‌లో మరో మంత్రి ఈటల రాజేందర్‌ 7, 11, 28, 30 వార్డుల పరిధిలోని కొత్తపల్లి, ఇందిరానగర్‌, విద్యానగర్‌, రజకవాడ, కాకతీయకాలనీ తదితర ప్రాంతాల్లో ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా 19వ వార్డు నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి కొలిపాక సమ్మయ్య స్థానిక టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతు ప్రకటించి మంత్రి ఈటల రాజేందర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. హుజూరాబాద్‌లోని పలు వార్డుల్లో బీసీ కమిషన్‌ సభ్యులు వకులాభరణం కృష్ణమోహన్‌ ఇంటింటా ప్రచారం చేశారు. ఇటు చొప్పదండిలోని 14వ వార్డులో స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌ రెడ్డి, డీసీఎమ్మెస్‌ చైర్మన్‌ ముదుగంటి సురేందర్‌ రెడ్డితో కలిసి ఇంటింటా ప్రచారం చేశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నాయకులతో కలిసి ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. ఓటర్లు అక్కున చేర్చుకుని తమ సమస్యలు పరిష్కరించే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకే ఓటు వేస్తామని స్పష్టం చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల కంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు వేగంగా దూసుకు పోతున్నారు.logo