బుధవారం 27 మే 2020
Karimnagar - Jan 20, 2020 , 03:04:17

పోలియోరహిత సమాజాన్ని నిర్మిద్దాం

పోలియోరహిత సమాజాన్ని నిర్మిద్దాం
కరీంనగర్‌ హెల్త్‌: పోలియోరహిత సమాజనిర్మాణం సామాజిక బాధ్యత అని కలెక్టర్‌ శశాంక పేర్కొన్నారు. ఆదివారం ఉదయం మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్‌)లో కలెక్టర్‌ పిల్లలకు పోలియో చుక్కలు వేసి, పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 147 పల్స్‌ పోలియో కేంద్రాల ద్వారా 0-5 ఏళ్లలోపు వయస్సు గల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేస్తున్నామని తెలిపారు. జిల్లాలో 85 వేలకు పైగా 5 ఏళ్లలోపు పిల్లలున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. పిల్లల చక్కని భవిష్యత్తుకు రెండు పల్స్‌ పోలియో చుక్కలు వేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదనేనన్నారు.  ఆదివారం పల్స్‌ పోలియో కేంద్రాలకు రాలేని, తప్పిపోయిన పిల్లలకు సోమ, మంగళ వారాల్లో ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేస్తారని వివరించారు. జిల్లాలోని ఇటుకబట్టీలు, స్లమ్‌ ఏరియాలు, హైవే రోడ్ల సమీపంలో, భవన నిర్మాణ కార్మికులు అధికంగా ఉన్న ప్రాంతాల్లోని పిల్లలందరికీ చుక్కల మందు వేయించేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లాలోని బస్టాండ్‌, రైల్వే స్టేషన్లలో ప్రయాణంలో ఉన్న పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు 32 మొబైల్‌ పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ సుజాత, మాతా శిశు ఆరోగ్య కేంద్రం పాలనాధికారి డాక్టర్‌ అలీం, ఆర్‌ఎంవో డాక్టర్‌ శౌరయ్య, డాక్టర్‌ మంజుల, తదితరులు పాల్గొన్నారు.


logo