మంగళవారం 26 మే 2020
Karimnagar - Jan 19, 2020 , 02:13:43

రేకుర్తిని అభివృద్ధి పథంలో నిలుపుతాం

రేకుర్తిని అభివృద్ధి పథంలో నిలుపుతాం


కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: నగరంలోని 18, 19వ డివిజన్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నందెల్లి మధుహ, గొలి కిష్టయ్యలను ప్రజలు ఎన్నికల్లో ఆదరించి గెలిపిస్తే రేకుర్తిని అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలిపేలా కృషి చేస్తామని మాజీ సర్పంచ్‌ నందెల్లి ప్రకాశ్‌ అన్నారు. శనివారం డివిజన్‌ పరిధిలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అభ్యర్థులతో కలిసి ఇంటింటికీ ప్రచారం ప్రారంభించారు. ప్రతి ఇంటికీ వెళ్లి గత ఐదేండ్ల కాలంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ముఖ్యంగా నగరంలో వేసవి కాలం వచ్చిందంటే ఉండే కరెంటు కోతలు టీఆర్‌ఎస్‌ హయాంలో లేవనీ, ప్రస్తుతం 24 గంటల కరెంటు అందిస్తున్నది సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం మాత్రమేనని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి చెరువునూ నింపారని పేర్కొన్నారు. భవిష్యత్తు అవసరాల దృష్టి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలన్నారు.

నగరంలో రేకుర్తి విలీనం అయినా ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు తీసుకువచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. 18, 19వ డివిజన్లలోని అనేక కాలనీల్లో ఇంకా మట్టి రోడ్లు ఉన్నాయనీ, వాటిని సీసీ రోడ్లు మార్చేందుకు కృషి చేస్తామన్నారు. తాను సర్పంచ్‌గా రేకుర్తి పంచాయతీలో అనేక అభివృద్ధి పనులు చేశానని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నందెల్లి మధుహ, గొలి కిష్టయ్యలు మాట్లాడుతూ కార్పొరేటర్లుగా తమను గెలిపిస్తే డివిజన్‌ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మంచినీటి సరఫరా మెరుగుపర్చడంతో పాటుగా, మొక్కలు నాటడం, పారిశుధ్య పనుల్లో ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. అన్ని రంగాల్లో ఈ డివిజన్లు అగ్రపథంలో నిలిచేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రచారంలో టీఆర్‌ఎస్‌ నాయకులు పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్‌, మల్లేశం, సన్నీ, రాజేందర్‌, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.logo