గురువారం 04 జూన్ 2020
Karimnagar - Jan 19, 2020 , 02:12:18

గెలిపిస్తే జవాబుదారీతనంతో పనిచేస్తా

గెలిపిస్తే జవాబుదారీతనంతో పనిచేస్తా


కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే జవాబుదారీతనంతో పనిచేస్తాననీ, నిత్యం అందుబాటులో ఉండి సమస్యలన్నీ పరిష్కరిస్తానని 56వ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వంగపల్లి రాజేందర్‌రావు హామీ ఇచ్చారు. శనివారం డివిజన్‌లోని భాగ్యనగర్‌ కాలనీలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పాదయాత్ర నిర్వహించి, ఇంటింటా జోరుగా ప్రచారం సాగించారు. ఆయన మాట్లాడుతూ, నగరంలోనే నంబర్‌వన్‌ డివిజన్‌గా మార్చేందుకు కృషిచేస్తానన్నారు. ఇప్పటికే సీసీ రోడ్లు వేశామనీ, మిగిలిన వాటిని కూడా సత్వరమే పూర్తి చేయిస్తానన్నారు. ప్రతి వీధుల్లో ఇరువైపులా మొక్కలు నాటి, అవి వృక్షాలుగా ఎదిగేందుకు అన్ని విధాలా కృషి చేస్తామన్నారు. డివిజన్‌స్థాయిలో ఎలాంటి సమస్యలున్నా తన వంతుగా మున్సిపాలిటీ ద్వారా పరిష్కరిస్తానన్నారు. డివిజన్‌లోని దేవాలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

అందరికీ అందుబాటులో ఉండే విధంగా కమ్యూనిటీ హాల్‌తోపాటు ఇతర సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. అలాగే, సాయిబాబా గుడి నుంచి ఉన్న రోడ్డును అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. డివిజన్‌లోని ప్రధాన రహదారులను సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు శిథిలావస్థకు చేరిన రోడ్లు, మురుగు కాలువల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకొని వేగంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. వేసవిలో మంచినీటి సమస్య లేకుండా చూస్తానన్నారు. మంత్రి గంగుల కమలాకర్‌ ఇచ్చిన హామీ మేరకు వచ్చే మూడు నెలల్లో ప్రతిరోజూ మంచినీటి సరఫరా అందించేలా చూస్తామన్నారు. ప్రతి ఇంటికీ మంచినీరు వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నీటి ప్రెషర్‌ సరిగా లేకపోతే తప్పనిసరిగా అవసరమైన ప్రాంతాల్లో కొత్త మంచినీటి పైపులైన్లు కూడా వేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డివిజన్‌ పరిధిలో వంద శాతం సీసీ రోడ్ల నిర్మాణం చేస్తామన్నారు. ప్రతి రోడ్డును పరిశుభ్రంగా ఉంచుతామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తానని పేర్కొన్నారు.  అభివృద్ధి పనులు మరింత వేగంగా ముందుకు సాగాలంటే టీఆర్‌ఎస్‌కు ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఆయన వెంట మాజీ కార్పొరేటర్లు అజిత్‌రావు, సదానందచారి, నాయకులు ఆకారపు భాస్కర్‌రెడ్డి, గోలి రవి, రవీందర్‌, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.


logo