ఆదివారం 31 మే 2020
Karimnagar - Jan 18, 2020 , 03:23:22

అన్నింటికీ నాదే బాధ్యత

అన్నింటికీ నాదే బాధ్యత


(కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ) కరీం‘నగరం’ను నలుమూలలా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటుగా నీతిమంతమైన పాలన అందించే బాధ్యత తనదేనని మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. నగరంలోని శ్వేత హోటల్‌లో శుక్రవారం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. నీతిమంతంగా పాలన అందిస్తామనీ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని అభ్యర్థులు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. పార్టీ కన్న తల్లిలాంటిదని, ఈ పార్టీకి ముఖ్యమంత్రి కేసీఆరే బాస్‌ అని.. మిగిలిన వారంతా కార్యకర్తలం మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రజల మనసును బట్టి ప్రభుత్వాలు, పార్టీలు నడుచుకోవాలనీ, టీఆర్‌ఎస్‌ అదే బాటలో పయనిస్తున్నదని చెప్పారు. పార్టీ నియమ నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తపైనా ఉందని స్పష్టం చేశారు. ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘించినా సహించే ప్రశ్నే లేదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం బరిలో టీఆర్‌ఎస్‌ నుంచి నిలబడుతున్న అభ్యర్థులు సైతం ఇదే కోవలోకి వస్తారనీ, అందుకే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండడంతో నీతిమంతమైన పాలన అందించేందుకు ప్రతిజ్ఞ చేయించామని చెప్పారు. ఇది తమ కమిట్‌మెంట్‌కు ఒక మచ్చు తునక మాత్రమేనని పేర్కొన్నారు.

వారి ధ్యాస అడ్డంకులు సృష్టించడంపైనే..

2014కు ముందు కరీంనగర్‌లో జరిగిన అభివృద్ధిని, ఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని ఒక్కసారి పోల్చి చూసుకోవాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ప్రధాన రోడ్లని బాగు చేశామనీ, మరో 700 కోట్లతో అంతర్గత రోడ్ల పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ పనులన్నీ పూర్తయితే అద్భుత నగరంగా కనిపిస్తుందనీ, గతంలో ఈ పనులన్నీ ఆలస్యం కావడానికి కారణం ఎవరన్నది మీకు ఇప్పటికే చెప్పామన్నారు. అభివృద్ధి పనులు చేస్తే టీఆర్‌ఎస్‌కు పేరు వస్తుందనీ, మున్సిపల్‌ ఎన్నికల్లో తమకు ఓటమి తప్పదని భావించి విపక్షాలు లెటర్‌ ప్యాడ్స్‌పై కనిపించిన ప్రతి కేంద్ర మంత్రికీ, ప్రతి అధికారికీ లేఖలు పెట్టిన విషయాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ నుంచి ఏ ఒక్క కార్పొరేటర్‌ గెలిచినా వారి ధ్యాస అంతా అభివృద్ధిని అడ్డుకోవడంపైనే ఉంటుందని విమర్శించారు. ఈ సారి ఎన్నికలు.. అభివృద్ధి చేసేవారికి.. అభివృద్ధిని అడ్డుకునే వారికి మధ్య జరుగుతున్నాయనీ, ఓటర్లు మాత్రం అభివృద్ధి చేసే అధికార పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

అన్నింటికీ నాదే బాధ్యత..

‘నేను నగర ప్రజలకు హామీ ఇస్తున్నా. ఈ నగరం నలుమూలల ప్రజలు కోరుకున్న రీతిలో అభివృద్ధిచేసే బాధ్యత నాదే. గెలిచే ప్రతి అభ్యర్థీ ప్రజాసమస్యలు పరిష్కరించే విధంగా పనిచేస్తారు. నిత్యం ప్రజల్లో ఉండి, నీతిమంతమైన పాలన అందిస్తారు. కొత్త పురపాలక చట్టాన్ని తూచ తప్పకుండా అమలు చేస్తారు. వీలైనంత ఎక్కువగా ప్రజలకు సేవ చేస్తారు. ఆయా వార్డుల్లో ప్రజల ఆశయాలకు, ఆశలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేస్తారు. పచ్చదనం- పరిశుభ్రతకు పెద్దపీట వేసే విధంగా కొత్త పాలకవర్గం పనిచేస్తుంది. పాలన అందించే విషయంలో లేదా? ఇతర ఏ విషయాల్లోనైనా సరే ఇబ్బందులు వస్తే నన్ను సంప్రదించవచ్చు. 24 గంటలూ మీ బిడ్డగా నేను అందుబాటులో ఉంటున్న విషయం మీకు తెలిసిందే. ప్రజలు ఇచ్చిన ఆశీర్వాద బలంతోనే మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా. వారి రుణం తీర్చుకునే దిశగా పనిచేస్తున్నా. ఈ పరిస్థితుల్లో మరింత బలం ఇవ్వాలి’ అని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇవేకాదు, వచ్చే మూడు నెలల్లో ప్రతి ఇంటికీ నిత్యం మంచినీరు, రాబోయే ఆరు నెలల్లో 24 గంటలపాటు నీరు ఇచ్చి తీరుతామనీ, ఇది ఎన్నికల హామీ కాదని స్పష్టం చేశారు. నిత్యం నీటి సరఫరా చేసేందుకు 2014-15 నుంచి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పనులు చేస్తున్నామనీ, ప్రస్తుతం అవి పూర్తి అయ్యాయని చెప్పారు. పక్కనే మానేరు ఉన్నా.. దశాబ్దాలపాటు పాలన చేసినా ప్రజలకు నిత్యం నీటిని ఇవ్వలేకపోయారని విమర్శించారు. ఎల్‌ఎండీలో నీటి కొరత ఉండకుండా కాళేశ్వర ఎత్తిపోతల పథకం ఉపయోగపడుతుందనీ, నగర ప్రజలకు సంపూర్ణంగా నీరు ఇచ్చి తీరుతామన్నారు. మీటర్లు పెడుతారా? అన్న ప్రశ్నకు ప్రజల నిర్ణయానికి మేం వ్యతిరేకంగా వెళ్లం అంటూ సమాధానం ఇచ్చారు. స్మార్ట్‌సిటీ పనులు ప్రారంభమయ్యాయనీ, అద్భుతమైన సిమెంట్‌ రోడ్ల నిర్మాణం జరుగుతున్నదని చెప్పారు. ఇవేకాదు, వచ్చే మార్చి 15నుంచి మానేరు రివర్‌ ఫ్రంట్‌ పనులు ప్రారంభం అవుతాయనీ, ఇది తన కలల ప్రాజెక్టు అని పేర్కొన్నారు. రివర్‌ ఫ్రంట్‌ ఏర్పాటు వల్ల స్థానికంగా ఐదు వేల మంది నుంచి ఆరు వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. ప్రస్తుత ఎన్నికలు ముగియగానే ఐటీ టవర్‌ను ప్రారంభం చేసుకుంటామనీ, ఇందులో మూడు వేల మందికి ఉద్యోగాలు వస్తాయనీ, అయితే ఇంతటితో ఆగిపోవడం తమ లక్ష్యం కాదన్నారు. ఐటీ హబ్‌ను తయారు చేసి.. సుమారు పది వేల మందికి ఇక్కడే ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని చెప్పారు. ఇవేకాదు, దశాబ్దాల డంప్‌ యార్డు వచ్చే రెండేళ్లలో మనకు కనిపించదనీ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించబోతున్నామనీ, ప్రస్తుతం ఉన్న డంప్‌ యార్డు స్థలాన్ని ఆధునిక పార్కుగా మార్చుతామన్నారు.

తప్పుడు ప్రచారం..

తెలంగాణ రాష్ట్ర సమితిని ఎదుర్కోలేక.. మళ్లీ ప్రధాన పార్టీ కొంత పంథాను ఎంచుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. నగరంలో ఎంఐఎం-టీఆర్‌ఎస్‌ మిలాఖత్‌ అయ్యాయనీ, మేయర్‌ పదవిని ఎంఐఎం పార్టీకి ఇస్తామంటూ కొంత మంది ప్రచారం చేస్తున్నారనీ, ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. నిజంగానే మిలాఖత్‌ అయితే.. టీఆర్‌ఎస్‌ 60 డివిజన్లలో ఎలా పోటీచేస్తుందని ప్రశ్నించారు. అలాగే ఎనిమిది నుంచి పది డివిజన్లలో పోటీచేసే ఎంఐఎం పార్టీ నుంచి మేయర్‌ అభ్యర్థి ఎలా అవుతారని పేర్కొన్నారు. గత ఎంపీ ఎన్నికల సమయంలో సోషల్‌ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేసిన కొంత మంది నాయకులు, మళ్లీ అవే కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతున్నారనీ, ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారన్నారు. అనేక వార్డుల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌లో మేయర్‌ అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ.. ఆ విషయాన్ని అధిష్ఠా నం ప్రకటిస్తుందన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణగౌడ్‌, ఆరెపల్లి మోహన్‌, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, అర్బన్‌ బ్యాంకు మాజీ చైర్మన్‌ కర్ర రాజశేఖర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీనివాసరెడ్డి, చల్ల హరిశంకర్‌, చిట్టిమల్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


logo