ఆదివారం 31 మే 2020
Karimnagar - Jan 18, 2020 , 03:22:40

హామీ ఇస్తున్నాం..

హామీ ఇస్తున్నాం..


(కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ) కరీంనగర్‌ కార్పొరేషన్‌లో పోటీ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులతో మంత్రి గంగుల కమలాకర్‌, హైదరాబాద్‌ నగర మేయర్‌, కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల సమన్వయకర్త బొంతు రామ్మోహన్‌ నగరంలోని శ్వేత హోటలో శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ‘తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేం పార్టీ నియమ నిబంధనలకు లోబడి నడుచుకుంటాం. రాష్ట్ర కొత్త మున్సిపల్‌ చట్టాన్ని తూచా తప్పకుండా అమలుచేస్తాం. ప్రభుత్వ ప్రతిష్టను పెంపొందించే దిశగా పని చేస్తాం. ఎటువంటి అవినీతికి పాల్పడం, బంధు ప్రీతి లేకుండా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవలందిస్తామని హామీ ఇస్తున్నాం’ అంటూ సభ్యులంతా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ నగర మేయర్‌, కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల సమన్వయకర్త బొంతు రామ్మోహన్‌, మంత్రి గంగుల కమలాకర్‌ అభ్యర్థులతో చాలా సేపు మాట్లాడారు. ప్రచారంలో అనుసరించాల్సిన పద్ధతులు, ఇతర పార్టీల కుట్రలు, కుతంత్రాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, వాటి ద్వారా నగరంలో డివిజన్ల వారీగా చేకూరిన లబ్ధి, ఇంటింటికీ చేరిన ప్రభుత్వ ఫలాలు వంటి పలు వివరాలను ప్రజలకు వివరించి, ఓట్లు అభ్యర్థించాలని సూచించారు. మొత్తం సీట్లు గెలుచుకోవాలనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుస్తామనే అతి విశ్వాసం వద్దని సూచించారు. ప్రజలే దేవుళ్లనీ, వారి ఆశీర్వాదంతో మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.


logo