ఆదివారం 31 మే 2020
Karimnagar - Jan 18, 2020 , 03:20:56

బీజేపీవి అసత్య ప్రచారాలు

బీజేపీవి అసత్య ప్రచారాలు


చొప్పదండి, నమస్తే తెలంగాణ: మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ కుమార్‌ మరోసారి అసత్య ప్రచారాలు, ప్రకటనలు చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ ధ్వజమెత్తారు. ప్రజలు వారి మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. శుక్రవారం చొప్పదండిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మేజర్‌ గ్రామపంచాయతీగా ఉన్న చొప్పదండిని మున్సిపల్‌గా మార్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రస్తుతం చొప్పదండిలో జరిగే ఎన్నికలకు ప్రత్యేక గుర్తింపు ఉందనీ, పట్టణ భవిష్యత్తును సూచించే దిశగా ఫలితాలు ఉండాలని సూచించారు. మున్సిపల్‌కు మొదటిసారి ఎన్నికయ్యే పాలకవర్గ సభ్యులు తీసుకునే నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. చొప్పదండిలో సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయాలని గత మూడేండ్ల క్రితమే ప్రతిపాదనలు పంపించామన్నారు. స్థానిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్రంలో చిన్న చిన్న విమానాశ్రయాలు ఏర్పాటు చేసేందుకు సర్వే చేసే క్రమంలో చొప్పదండి మండలంలోని భూములను సైతం పరిశీలించినట్లు పేర్కొన్నారు. మరో 10-20 ఏండ్లలో చొప్పదండి మున్సిపల్‌ కార్పొరేషన్‌గా మారి తీరుతుందన్నారు. ఎన్నికల్లో గెలుపుకోసం బీజేపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారనీ, కల్యాణ లక్ష్మి, కేసీఆర్‌ కిట్‌, ఉజ్వల ఎల్‌పీజీ పథకాల్లో కేంద్ర ప్రభుత్వం సగంవాటా ఉందని మరోసారి మోసపూరిత ప్రచారానికి సిద్ధమవుతూ ముందుకువస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలు మోసపూరిత ప్రకటనలు నమ్మవద్దని సూచించారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తేనే చొప్పదండి అభివృద్ధి చెందుతుందనీ, 14 సీట్లకు 14 గెలిపించి మరోసారి టీఆర్‌ఎస్‌ సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  అనంతరం హైదరాబాద్‌ నగర మేయర్‌, కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల సమన్వయకర్త బొంతు రామ్మోహన్‌ మాట్లాడుతూ పల్లెలను పట్టణాలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. పల్లెప్రగతితో గ్రామాలు సస్యశ్యామలంగా మారాయనీ, మున్సిపల్‌ ఎన్నికల అనంతరం పట్టణ ప్రగతితో పట్టణాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. అంతకుముందు రామ్మోహన్‌ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ముదిగంటి సురేందర్‌రెడ్డి, ఎంపీపీలు చిలుక రవి, మేనేని స్వర్ణలత, కలిగేటి కవిత, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య, ప్రశాంతి,  మాజీ ఎంపీపీలు గుర్రం భూమారెడ్డి, వెల్మ మల్లారెడ్డి, వల్లాల క్రిష్ణహరి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బందారపు అజయ్‌కుమార్‌గౌడ్‌, పట్టణాధ్యక్షుడు కొత్త గంగారెడ్డి, నాయకులు గడ్డం చుక్కారెడ్డి, ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్‌, మాచర్ల వినయ్‌, వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


logo