బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Jan 14, 2020 , 03:59:20

డెయిరీ రైతుల సంక్షేమమే లక్ష్యం

 డెయిరీ రైతుల సంక్షేమమే లక్ష్యం


(కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ) 2020 సంవత్సరంలో లక్ష మంది రైతులను పాడి ఉత్పత్తిదారులుగా తయారు చేయడమే లక్ష్యంగా కరీంనగర్‌ డెయిరీ ముందుకు వెళ్తోందని డెయిరీ చైర్మన్‌ చలిమెడ రాజేశ్వర్‌రావు స్పష్టం చేశారు. సోమవారం డెయిరీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1997లో డెయిరీ పరిధిలో 12 వేల లీటర్ల పాల సేకరణ ఉండగా, కేవలం నాలుగువేల లీటర్ల పాలు మాత్రమే విక్రయాలు జరిగాయని గుర్తు చేశారు. వాటిని ప్రస్తుతం రెండు లక్షల లీటర్ల పాల సేకరణతోపాటు అదే స్థాయిలో విక్రయాలు చేస్తున్నామన్నారు. డెయిరీలో ప్రస్తుతం 70 వేల మంది పాడి రైతులున్నారనీ, 2020 చివరి నాటికి లక్ష మంది ఉత్పత్తిదారులను తయారు చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. దీని ద్వారా ఐదు లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరిగే అవకాశాలుంటాయన్నారు. పెరిగే పాల ఉత్పత్తిదారులకు అనుగుణంగా డెయిరీ విస్తరణ చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రెండు లక్షల లీటర్లకు సరిపోయే పరిస్థితులున్నాయనీ, వీటిని పరిగణలోకి తీసుకొని తిమ్మాపూర్‌ మండలం నుస్తులాపూర్‌లో మరో మూడు లక్షల లీటర్ల సామర్థ్యం గల ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. తమకు ఉత్పత్తిదారులు, వినియోగదారులు రెండు కళ్లలాంటి వారన్న చైర్మన్‌.. పాల సేకరణ చేసి ఊరుకుంటే సరిపోదనీ, వాటిని మార్కెటింగ్‌ చేయాలన్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌పై ప్రధాన దృష్టి పెట్టామనీ, ప్రస్తుతం రోజుకు 40 వేల లీటర్ల పాలు అమ్ముతున్నామని తెలిపారు. భవిష్యత్‌లో దీనిని లక్ష లీటర్ల విక్రయాలకు తీసుకెళ్లేందుకు కావాల్సిన మార్కెటింగ్‌పై దృష్టి పెట్టామన్నారు. మార్కెటింగ్‌ ఎంత విస్తృతంగా పెంచితే... ఆ మేరకు పాల సేకరణ చేయవచ్చని పేర్కొన్నారు. సేకరణ అధికంగా ఉండి విక్రయాలు లేకపోతే డెయిరీ నష్టాలను చూడాల్సి వస్తుందని తెలిపారు. ప్రస్తుతం 14 జిల్లాల నుంచి పాల సేకరణ జరుగుతున్నదనీ, త్వరలోనే మరో పది జిల్లాల నుంచి సేకరించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న 18 బల్క్‌ యూనిట్లకు మరో 15 కొత్తగా ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. లాభాపేక్ష లేకుండా వినియోగదారులకు నాణ్యమైన పాలను అందించడంతోపాటు.. అదే స్థాయిలో రైతులకు మేలు చేకూర్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు చైర్మన్‌ రాజేశ్వర్‌రావు స్పష్టం చేశారు.

70వేల మంది రైతుల శ్రమకు నిదర్శనం

‘ఇండియా డెయిరీ అవార్డు -2020’కి కరీంనగర్‌ డెయిరీ ఎంపిక కావడం సంతోషకరమన్నారు. దేశంలోని డెయిరీల పనితీరును 17 విభాగాల్లో పరిశీలించి..  బెస్ట్‌ మీడియం సైజ్డ్‌ కంపెనీ డెయిరీగా కరీంనగర్‌ డెయిరీని ఎంపిక చేసినట్లు తెలిపారు. డెయిరీ అందిస్తున్న సేవలు, పాడి రైతుల కోసం తీసుకుంటున్న చర్యల వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకొని.. ఈ అవార్డుకు ఎంపిక చేశారని చెప్పారు. ఈ నెల 10న ఢిల్లీలో ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ తీసుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. ఈ అవార్డు తాను ఒక్కడిది కాదనీ, తమ డెయిరీ కుటుంబంలోని 70 వేల మంది రైతుల కృషికి, శ్రమకు నిదర్శనమని స్పష్టం చేశారు. గతంలోనూ పలు అవార్డులను సొంతం చేసుకున్న విషయాన్ని గుర్తించారు. అయితే తాము అవార్డుల కోసం పనిచేయడం లేదనీ, వినియోగదారులు, రైతుల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.

త్వరలో ఎరువుల విక్రయాలు

తమ డెయిరీ పరిధిలోని రైతులకు వీలైనంత తక్కువ ధరకు, నాణ్యమైన ఎరువులను అందించేందుకు అతి త్వరలో శ్రీకారం చుడుతున్నట్లు రాజేశ్వర్‌రావు వెల్లడించారు. ఇందుకోసం ఇప్కోతో ఒప్పందాలు జరిగాయన్నారు. తమ డెయిరీ పరిధిలోని రైతులకు మాత్రమే సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకోసం తెలంగాణ మొత్తం డీలర్‌షిప్‌ను తీసుకుంటున్నట్లు తెలిపారు. ఒక్క పాడి విక్రయాలపైనే ఆధారపడకుండా.. డెయిరీని నమ్ముకున్న పాడి రైతులకు లబ్ధి కల్పించేందుకు పలు రకాల ప్రత్యామ్నాయ వ్యాపారంలోకి డెయిరీ అడుగు పెడుతుందని వివరించారు. ఎరువుల విక్రయాలు కూడా ఈ కోవలలోకి వస్తాయనీ, డెయిరీలో హెచ్‌పీ పెట్రోల్‌బంకు ఓపెన్‌ చేసేందుకు పనులు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే రకరకాల ఉత్పత్తులు తయారు చేసి విక్రయిస్తున్న డెయిరీ.. త్వరలో మ్యాంగో లస్సీని మార్కెట్‌లోకి ప్రవేశ పెట్టనున్నట్లు చైర్మన్‌ స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో డెయిరీ చైర్మన్‌తో పాటు ఎండీ డాక్టర్‌ శంకర్‌రెడ్డి, డెయిరీ సిబ్బంది పాల్గొన్నారు.logo