గురువారం 28 మే 2020
Karimnagar - Jan 14, 2020 , 03:58:44

గణతంత్ర వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి

గణతంత్ర వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి


(కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ) గణతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ శశాంక జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై జిల్లా అధికారులతో సోమవారం  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో  గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలనీ, గ్రౌండ్‌ను పోలీసు, రెవెన్యూ అధికారులు సిద్ధం చేయాలన్నారు. వేడుకల సందర్భంగా ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజలకు సీటింగ్‌ అరెంజ్‌మెంట్స్‌ చేయాలని రెవెన్యూ డివిజనల్‌ అధికారిని ఆదేశించారు. వేడుకల సందర్భంగా పరేడ్‌కు వచ్చే ప్రజలు, విద్యార్థినీ, విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని మున్సిపల్‌ అధికారులకు సూచించారు. మైక్‌ ఏర్పాట్లను సమాచారశాఖ ద్వారా ఏర్పాటు చేయాలని ఉప కార్యనిర్వాహక సమాచార ఇంజినీర్‌ను ఆదేశించారు. కలెక్టర్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగించేందుకు వీలుగా వివిధ పథకాల ప్రగతితో సందేశాన్ని తయారు చేయాలని జిల్లా పౌరసంబంధాల అధికారికి సూచించారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను ప్రదానం చేసేందుకు అర్హులైన వారినే ఎంపిక చేయాలన్నారు. జిల్లాలో రెండు విడుతలుగా నిర్వహించిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాల్లో అత్యంత ప్రతిభ చూపిన పంచాయతీ అభివృద్ధికి విశేష కృషి చేసిన అధికారులకు ప్రశంసా పత్రాలను ప్రదానం చేసేందుకు ఎంపిక చేయాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. జిల్లాలో అమలవుతున్న వివిధ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలతో కూడిన శకటాలను గ్రౌండ్‌లో ప్రదర్శించేందుకు చక్కగా రూపొందించాలని సూచించారు. దేశభక్తితో కూడిన సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చేందుకు వివిధ పాఠశాలల విద్యార్థులను ఎంపిక చేయాలని జిల్లా విద్యాధికారిని ఆదేశించారు. జేసీ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్‌, జిల్లా రెవెన్యూ అధికారి ప్రావీణ్య, జడ్పీ సీఈవో వెంకటమాధవరావు, డీఆర్డీవో వెంకటేశ్వర్‌రావు, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌, మెప్మా పీడీ పవన్‌కుమార్‌, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి అశోక్‌కుమార్‌, మార్కెట్‌ డీడీ పద్మావతి, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం నవీన్‌కుమార్‌, జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్‌, జిల్లా మత్య్సశాఖ అధికారి ఖదీర్‌ అహ్మద్‌, వయోజన విద్యాశాఖ ఉప సంచాలకుడు జయశంకర్‌, ఎల్‌డీఎం రమేశ్‌కుమార్‌, కరీంనగర్‌, హుజూరాబాద్‌ ఆర్డీవోలు ఆనంద్‌కుమార్‌, పీ బెన్‌షాలోం, తదితరులు పాల్గొన్నారు.logo