గురువారం 28 మే 2020
Karimnagar - Jan 14, 2020 , 03:57:42

భోగ భాగ్యాల ‘భోగి’

భోగ భాగ్యాల ‘భోగి’


సుభాష్‌నగర్‌: సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే పవిత్ర శుభ ఘడియలకు సిద్ధమవడమే భోగి పండుగ. చెడును తగులబెట్టి మంచిని ఆహ్వానించడమే ఈ పండుగ పరమార్థం. సంక్రాంతి పండుగకు ముందు రోజు వచ్చే పండుగ కనుక దీనిని భోగి పండుగ అంటారు. పచ్చటి పంటలు.. పడుచుల ఆటలు.. ఊరూరా భోగి మంటలు.. వాకిళ్లకు రంగుల సింగారాలు.. తెలుగు లోగిళ్లు వెలుగు పూలై విరిసే సంక్రాంతి సంబురాలు రానే వచ్చాయి. మూడు రోజుల పాటు ఇంటిల్లి పాది ఘనంగా జరుపుకునే వేడుకలు నేడు ఆరంభమయ్యాయి.

సకల జనులు సిద్ధం

పుష్యమాసం మంగళవారం భోగి పండుగను జరుపుకునేందుకు సకల జనులు సిద్ధమయ్యారు. తొలి రోజు భోగి, మలి రోజు బుధవారం మకర సంక్రాంతి, ఆఖరి రోజు గురువారం కనుమ పండుగగా జరుపుకుంటారు. సూర్యుడి గమనానికి ప్రతిరూపంగా జరుపుకునే పండుగనే సంక్రాంతిగా భావిస్తాం. మనం నిర్వహించుకునే ప్రతి పండుగలోనూ, చేసే ప్రతి పూజలోనూ ఏదో ఒక పరమార్థం దాగి ఉంటదన్నది సత్యం. దక్షిణాయణం చివరి రోజుల్లో సూర్యుడు భూమికి దూరంగా ఉంటాడు. దీంతో సూర్యరశ్మి తగినంత ఉండక, క్రిమి కీటకాలు నశించవు.. ఈ క్రమంలోనే మహిళలు  పెండ (పేడ) నీళ్లతో ఇళ్లన్నీ అలికి శుభ్రం చేసి సుద్ద లేదా బియ్యం పిండితో ముగ్గులు వేస్తారు. వీటి ప్రభావంతో క్రిమి కీటకాలు నశిస్తాయి. ముగ్గుల మీద పెండ ముద్దలుంచి, పసుపు కుంకుమలు పెట్టి బంతి, చేమంతి మొదలైన పూలతో అలంకరిస్తారు. వీటినే గొబ్బెమ్మలు అంటారు. వేకువ జామునే హరిదాసుల హరినామస్మరణ, గంగిరెద్దుల విన్యాసాలు, వైష్ణవాలయాల్లో విష్ణు సహస్ర నామ పారాయణాలు వీనులవిందు చేస్తాయి. భోగి రోజు గోదాదేవి కల్యాణం కమనీయంగా జరిపిస్తారు. మకర సంక్రాంతి రోజున సంక్రాంతి పండుగను, కనుమ రోజు మినుములతో గారెలు చేసి పెద్దలకు నైవేద్యం పెట్టడం, పశువులను పూజించడం చేస్తారు. పది రోజుల ముందు నుంచే ఇళ్లల్లో రుచికరమైన పిండి వంటలు తయారు చేసుకోవడం మొదలు పెడుతారు. అత్తవారింటికి కొత్త అల్లుళ్లు వచ్చి రాచ మర్యాదలు అందుకుంటారు.
 

సూర్యారాధన

సూర్యుడు ఆది పురుషుడు, అందుకే సూర్య నారాయణ మూర్తి అంటారు. ఆదికాలం నుంచి మానవుడు భానుడిని ఆరాధిస్తున్నాడు. సూర్యుడు ప్రతి నెలా ఒక రాశిలో సంచరిస్తాడు. కర్కాటకం నుంచి ధనస్సు వరకు గల ఆరు రాశులను దాటి మకర రాశిలోకి ప్రవేశించడమే మకర సంక్రమణం. కర్కాటకం నుంచి ధనస్సు వరకు సూర్య సంచార కాలం దక్షిణాయనం అంటారు. సూర్యుడు మకర సంక్రమణం చెందే సమయం పవిత్రమైంది. అంతకంటే ముందు భోగి పండుగ జరుపుకుంటారు. పురాతన పరంపర నుంచి కొత్త దనంలోకి పరిణితి చెందడమే సంక్రమణం. దక్షిణాయనంలో చేసిన పాపాలన్నీ గుట్టగా పోసి కాలపెడితే, పుణ్యకాలమైన ఉత్తరాయణం ఉత్తమ జీవితం ఇస్తుందని నమ్మకం. పాత వ్యవస్థలోని చెడును మంటల్లో కాల్చి, సజీవ తత్వాన్ని గ్రహించి, గుణాత్మక పరివర్తనం చేయడమే భోగి మంటలు.

మకర సంక్రాంతి

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజును మకర సంక్రాంతి అంటారు. ఈ రోజుతో ధనుర్మాసం పూర్తవుతుంది. సూర్యుడు దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు పరిభ్రమిస్తాడు. దీనినే ఉత్తరాయణంగా చెబుతారు. ఇది మహా పుణ్యకాలం. ఏ శుభకార్యానికైనా మంచిది. అందుకే సంక్రాంతి మహత్తరమైన పండుగ అని పురాణాలు ప్రవచిస్తున్నాయి. సంక్రాంతి నాడు పితృదేవతలకు తర్పణం విడుస్తారు. బ్రాహ్మణులకు బియ్యం, బెల్లం గుమ్మడికాయ దానం చేస్తారు. కొత్త బియ్యం, బెల్లంతో పాయసం చేసి సంక్రాంతి లక్ష్మికి నైవేద్యంగా పెడుతారు. మహిళలు ముగ్గులు వేయడం, పిండి వంటలు చేయడంలో నిమగ్నులవుతే, చిన్నారులు పతంగులు ఎగురవేస్తారు. పురుషులు కోడి పందాలతో సరదాగా గడుపుతారు.
రైతుల పండుగ కనుమ

మార్కెట్‌కు సంక్రాంతి కళ..

సంక్రాంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ ప్రాంతం కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నది. చుట్టు పక్కల పల్లెల నుంచి వచ్చిన ప్రజలు, నగరవాసులతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. గ్రామీణులు పూలు, మామిడి ఆకులు, మట్టి గురిగెలు, నవధాన్యాలు, రంగులు, ఆవుపేడ, చింతకాయలు అమ్మకానికి తేగా నగరవాసులు ఎగబడి మరి కొనుగోలు చేశారు. బంతి పూలు కిలోకు రూ 50 నుంచి రూ.100ల వరకు, చేమంతులు చెటాకుకు రూ.20 నుంచి రూ.35 వరకు విక్రయించారు. పెద్ద సంఖ్యలో తాత్కాలిక రంగుల దుకాణాలు ఏర్పాటు చేయగా, అన్నిచోట్ల అతివలతో దుకాణాలు కళకళలాడాయి. పావు కిలో రంగు ధర రూ.10 నుంచి రూ.15 వరకు పలికింది. నోము సామగ్రి రూ.20 నుంచి రూ.50 వరకు ఉన్నాయి.

భోగి, సంక్రాంతి పండుగల తర్వాత రోజు జరుపుకునే పండుగ కనుమ. దీనిని రైతులు ఘనంగా జరుపుకుంటారు. పశువులను అలంకరించి గోప్రదక్షిణం చేస్తారు. ఆ రకంగా వాటి రుణాన్ని తీర్చుకున్నట్లు భావిస్తారు. గ్రామ దేవతలకు నైవేద్యాలు పెడుతారు. కొత్త ధాన్యాలతో పొంగలి వండి దేవుడికి ప్రసాదంగా నివేదిస్తారు. కనుమ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఎడ్ల బండ్లతో ఊరేగిస్తారు.

సిరుల భోగి..

దక్షిణాయణం దేవతలు నిద్రించిన కాలం కావడంతో సంక్రాంతికి ఒక రోజు ముందు పీడ నివారణకు ఇంట్లోని పురాతన వస్తువులను భోగి మంటల్లో ఆహుతి చేస్తారు. ఈ రోజు నుంచి కొత్త వస్తువులు ఉపయోగించడం ఆనవాయితీగా వస్తోంది. భోగి రోజున తెల్లవారు జామున పిల్లలకు తలారా స్నానం చేయించి రేగుపండ్లు, చెరుకు ముక్కలు, అక్షింతలు కలిపి వారి తలలపై పోయడం ద్వారా దృష్టి దోషం తొలగిపోతుందని పెద్దలు చెబుతారు. భోగి పండ్లను పెద్దల చేత పోయించడం వల్ల చిన్నారుల ఆయుష్షు పెరుగుతందని ప్రతీతి. భోగి రోజే గోదాదేవి రంగనాథస్వామిని వివాహమాడింది. అప్పటి నుంచే ఆమె భోగభాగ్యాలు పొందిందని ప్రతీతి. భోగి రోజు మహిళలు వాకిళ్లను రంగు రంగుల ముగ్గులతో నింపి, వాటి మధ్య ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెడుతారు. వాటిపై గరక పోసలు ఉంచి, చుట్టూ నవధాన్యాలు, పళ్లు పోస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి తమ ఇళ్లలోకి వస్తుందని నమ్ముతారు.logo