బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Jan 12, 2020 , 04:44:02

నామినేషన్ల జోరు

నామినేషన్ల జోరు
  • -రెండో రోజు పెద్ద సంఖ్యలో దాఖలు
  • -భారీ ర్యాలీగా తరలివచ్చిన నాయకులు
  • -223 మంది అభ్యర్థులు.. 262 సెట్లు
  • -సందడిగా బల్దియా కార్యాలయ పరిసరాలు
  • -37వ డివిజన్‌లో పాల్గొన్న మంత్రి గంగుల
  • -నేటితో ముగియనున్న స్వీకరణ ప్రక్రియ

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ : కరీంనగర్‌ నగరపాలక సంస్థలో రెండో రోజు నామినేషన్ల జోరు కొనసాగింది. వివిధ డివిజన్ల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు తమ మద్దతుదారులతో కలిసి వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. మాజీ డిప్యూటీ మేయర్‌ గుగ్గిళ్లపు రమేశ్‌, మాజీ కార్పొరేటర్‌ చల్లా స్వరూపరాణి-హరిశంకర్‌ వారి వారి డివిజన్లలో భారీ ర్యాలీలు నిర్వహించి నామినేషన్లు దాఖలు చేశారు. 37వ డివిజన్‌లో జరిగిన ర్యాలీలో మంత్రి గంగుల కమలాకర్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో పాటు పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ర్యాలీ తీసే ముందు చల్ల స్వరూపారాణి, హరిశంకర్‌ దంపతులతో కలిసి మంత్రి రమాసహిత సత్యనారాయణస్వామి ఆలయంలో పూజలు చేశారు. 29వ డివిజన్‌లో నిర్వహించిన ర్యాలీలో మాజీ డిప్యూటీ మేయర్‌ రమేశ్‌తో పాటు కాలనీ నాయకులు, పెద్దలు పాల్గొన్నారు. ఉదయం నుంచే నామినేషన్లు దాఖలు చేయడానికి వివిధ పార్టీల నుంచి నేతలు తరలివచ్చారు. నామినేషన్ల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అధికారులు భారీ బందోబస్తు చేపట్టారు. అభ్యర్థులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కార్యాలయం ముందే హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేసి నామినేషన్లను పరిశీలించిన అనంతరమే కార్యాలయంలోకి పంపించారు. రెండో రోజు 223 మంది 262 నామినేషన్‌ సెట్లను దాఖలు చేశారు. నేటి సాయంత్రంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియనుండగా, పెద్దసంఖ్యలో దాఖలయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు.

టీఆర్‌ఎస్‌ నుంచి పెద్ద సంఖ్యలో నామినేషన్లు

కరీంనగర్‌ నగరపాలక సంస్థలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వంలో టీఆర్‌ఎస్‌ నుంచి అత్యధిక సంఖ్యలో నామినేషన్ల సెట్లు దాఖలవుతున్నాయి. మొదటి రోజు ఈ పార్టీ నుంచి 80 నామినేషన్లు రాగా, రెండో రోజు 98కి పెరిగింది. మొత్తానికి రెండో రోజు 223 మంది 262 నామినేషన్‌ సెట్లను దాఖలు చేశారు. బీజేపీ నుంచి 65, కాంగ్రెస్‌ నుంచి 25, సీపీఐ నుంచి 1, సీపీఎం నుంచి 1, ఎంఐఎం నుంచి 16, టీడీపీ నుంచి 2, ఇతర పార్టీల నుంచి 5, ఇండిపెండెంట్ల నుంచి 49 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో 12, 15, 36వ డివిజన్లలో అత్యధికంగా 11 నామినేషన్లు దాఖలు కాగా, 41, 49వ డివిజన్లలో రెండో రోజు ఎలాంటి నామినేషన్లూ దాఖలు కాలేదు. 3, 20, 21, 33, 34, 51 డివిజన్లలో ఒక్కటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే 11, 58, 60వ డివిజన్‌లో 9 నామినేషన్లు, 1వ డివిజన్‌లో 8 నామినేషన్లు రాగా, 5, 32, 50, 55 డివిజన్లలో 7 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. 56, 19, 9, 28, 29, 30, 31వ డివిజన్లలో ఆరు చొప్పున, 16, 17, 26, 38, 44, 57 డివిజన్లలో ఐదు చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. 7, 22, 23, 24, 27, 43, 47, 48, 52 , 59 డివిజన్లలో నాలుగు చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. 2, 6, 10, 13, 18, 25, 35, 39, 40, 46, 53, 54, డివిజన్లలో మూడు చొప్పున, 4, 8, 14, 37, 42, 45, డివిజన్లలో రెండు చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి.


logo