శుక్రవారం 05 జూన్ 2020
Karimnagar - Jan 09, 2020 , 18:02:00

జోరుగా హుషారుగా..

జోరుగా హుషారుగా..

-పరిసరాలను పరిశుభ్రం చేసుకున్న గ్రామీణులు
-నారాయణపూర్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌
-‘నేను నా ఊరి కోసం’ కార్యక్రమానికి శ్రీకారం
-గ్రామాభివృద్ధికి రూ. లక్ష విరాళం
-మహాత్మానగర్‌లో ట్రాక్టర్‌ పంపిణీ చేసిన ఎమ్మెల్యే రసమయి
-ఏడో రోజుకు పల్లె ప్రగతి

(కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ)రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా మంచి స్పందన వస్తున్నది. గంగాధర మండలం నారాయణపూర్‌లో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పాల్గొని గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేశారు. రోడ్లను శుభ్రం చేశారు. డ్రైనేజీల్లో పూడిక తీశారు. ఈ సందర్భంగా గ్రామంలో ‘నేనూ నా ఊరి కోసం’ కార్యక్రమాన్ని ప్రారంభించి, గ్రామాభివృద్ధికి రూ.లక్ష విరాళంగా అందజేశారు. తాను ఈ గ్రామంలోనే చదువుకున్నాననీ, అందుకే విరాళం ఇచ్చానని స్పష్టం చేశారు. గ్రామాల్లో చదువుకుని ఉన్నత స్థితికి ఎదిగిన వారంతా ఈ కార్యక్రమంలో భాగంగా విరాళాలు అందించాలని ఆయన కోరారు. రామడుగు మండలం చిప్పకుర్తిలో డీపీఓ రఘువరన్‌ పాల్గొన్నారు. చొప్పదండి మండలం భూపాలపట్నం, రేవెళ్లి గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. సైదాపూర్‌ మండలం సర్వాయిపేటలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ పర్యటించి 30 రోజుల పల్లె ప్రణాళిక పనులను పరిశీలించారు. జమ్మికుంట మండలం గండ్రాతుపల్లిలో ఇంకుడు గుంతల నిర్మాణానికి మార్కింగ్‌ ఇచ్చారు. శంకరపట్నం మండలం ముత్తారం, ఖానాపూర్‌, మెట్‌పల్లిలో, గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో, చిగురుమామిడి మండలం గునుకులపల్లిలో ఫ్లయింగ్‌ స్కాడ్‌ అధికారులు పర్యటించారు. తిమ్మాపూర్‌ మండలం మహాత్మానగర్‌ గ్రామ పంచాయతీకి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ట్రాక్టర్‌ పంపిణీ చేశారు. మానకొండూర్‌ మండలంలోని వన్నారంలో ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహన కల్పించారు. మద్దికుంటలో మొక్కలు నాటి ట్రీ గార్డులు ఏర్పాటు చేశారు.


logo