e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home కరీంనగర్ ఫేస్‌బుక్‌..బీ అలర్ట్‌ ‘ఫేక్‌' ఐడీ!

ఫేస్‌బుక్‌..బీ అలర్ట్‌ ‘ఫేక్‌’ ఐడీ!

ఫేస్‌బుక్‌..బీ అలర్ట్‌ ‘ఫేక్‌' ఐడీ!

రెచ్చిపోతున్న సైబర్‌ నేరగాళ్లు lహ్యాక్‌ లేదంటే ఫేక్‌ ఐడీలతో మోసాలు
ఆపదలో ఉన్నామంటూ మెసేజ్‌లు lనమ్మి నట్టేట మునుగుతున్న యూజర్లు
అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు lకొంచెం జాగ్రత్తగా ఉన్నా ఫేక్‌ ఖాతాలను గుర్తించవచ్చు : ఐటీ నిపుణుడు రాము

కరీంనగర్‌, జూలై 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఫేస్‌బుక్‌ వేదికగా సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నెటిజన్లకు ఉన్న ఆసక్తిని ఆసరాగా చేసుకొని మితిమీరిపోతున్నారు. అయితే హ్యాక్‌.. లేదంటే ఫేక్‌ ఐడీ క్రియేట్‌ చేసి వల వేస్తున్నారు. మన ప్రొఫైల్‌ ఐడీ, ఫొటోను కాపీ చేసి మరో నకిలీ అకౌంట్‌ ఓపెన్‌ చేస్తున్నారు. మన ఫ్రెండ్‌ లిస్ట్‌లో ఉండే అందరికీ మళ్లీ రిక్వెస్ట్‌ పంపి, రకరకాల మోసాలకు తెరలేపుతున్నారు. కొందరు బ్లాక్‌ మెయిల్‌ చేస్తే, మరికొందరు మెసేజ్‌లతో నమ్మిస్తున్నారు. వీరి వలలో చిక్కి ఎందరో మోసపోతుండగా, ఇటీవలి కాలంలో ఎవరిని చూసినా నా ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయింది లేదంటే ఫేక్‌ ఐడీ క్రియేట్‌ అయింది అనే మాట తరచుగా వినిపిస్తున్నది. ఈ క్రమంలోనే మోసపోతున్న బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ఒక అంచనా ప్రకారం పూర్వ కరీంనగర్‌ జిల్లాలో రోజుకు వందకుపైగా ఫేస్‌బుక్‌ అకౌంట్లు హ్యాక్‌ అవుతున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ ముప్పు నుంచి ఎలా తప్పించుకోవాలి? దీనికి అడ్డుకట్ట ఎలా వేయాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి? హ్యాక్‌/ ఫేక్‌ ఐడీ క్రియేట్‌ అయినప్పుడు ఏం చేయాలి?.. తదితర అంశాలపై ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం..

సాధారణంగా మనం ఫేస్‌బుక్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవాలంటే పేరు, మెయిల్‌ ఐడీ, ఫోన్‌ నంబర్‌ అవసరం. ఆ వివరాలు ఇవ్వగానే మనకు యూజర్‌ ఐడీ క్రియేట్‌ (https://www.facebook.com/ pingali ఇలా ఉంటుంది) అవుతుంది. ఆ తదుపరి మన ప్రొఫైల్‌ ఫొటో, మనకు ఇష్టమున్న పేరును పెట్టుకోవచ్చు. ఇంత వరకు బాగానే ఉన్నది. కానీ, ఇటీవలి కాలంలో ఫేస్‌బుక్‌ యూజర్లను సైబర్‌ దాడి భయపెడుతున్నది. కొంత కాలంగా రెచ్చిపోతున్న సైబర్‌ నేరస్తులు, అకౌంట్‌ను హ్యాక్‌ చేసి బ్లాక్‌ మెయిల్‌ చేయడమో..? లేదంటే ఫేక్‌ ఐడీ క్రియేట్‌ చేసి మన పేరు మీద డబ్బులు వసూలు చేయడమో చేస్తున్నారు. ముందుగా పెద్ద సంఖ్యలో ఫేస్‌బుక్‌ అకౌంట్లు స్టడీ చేస్తున్నారు. అందులో వారి అంచనాలకు తగిన విధంగా ఉన్న వారిని సెలెక్టు చేసుకుంటున్నారు. అలా టార్గెట్‌ చేసిన వ్యక్తుల ప్రొఫైల్‌ ఫొటోలు, పేరును తీసుకొని.. ఫేక్‌ ఐడీలు క్రియేట్‌ చేస్తున్నారు. అప్పటికే క్రియేట్‌ చేసుకున్న ఐడీని గానీ, లేదా కొత్తగా క్రియేట్‌ చేసిన ఐడీని గానీ టార్గెట్‌ చేసిన వ్యక్తి పేరు, ఫొటోలు వాడుతున్నారు. అవి మన స్నేహితులు ఎవరైనా చూస్తే ఆ అకౌంట్‌ మనదే అని పొరబడే ప్రమాదముంటున్నది.

- Advertisement -

తక్షణమే రిపోర్ట్‌ చేయాలి
ఫేక్‌ అకౌంట్‌ అని గుర్తించగానే.. మన మిత్రులెవ్వరూ మోసపోకుండా వెంటనే మనమే రంగంలోకి దిగాలి. ముందుగా ఫేక్‌ అకౌంట్‌ను బ్లాక్‌ చేయాలి. అందుకోసం ఫేస్‌బుక్‌ సంస్థకు ఫిర్యాదు చేయాలి. అది ఎలాగంటే మనకు వచ్చిన ఫేక్‌ ప్రొఫైల్‌ పేరుపై క్లిక్‌చేయాలి. ఆ తదుపరి మెసేజ్‌ పక్కన మూడు చుక్కలుగా (…) కనిపించే సింబల్‌పై క్లిక్‌చేసి ఫ్రొపైల్‌ సెట్టింగ్‌లోకి వెళ్లాలి. ఇక్కడ find support or repot profile పై క్లిక్‌చేయాలి. క్లిక్‌చేయగానే ‘ప్లీజ్‌ సెలెక్టు ఏ ఏప్రాబ్లం’ ఆప్షన్‌ వస్తుంది. ఇందులో pretending to be someone అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయగానే me అనే అప్షన్‌ వస్తుంది. దానిపై క్లిక్‌ చేసి submit పై నొక్కితే ఫేక్‌బుక్‌ వాళ్లు వెంటనే స్పందించి సదరు అకౌంట్‌ను నిలిపి వేస్తారు. దాంతో ఆ ఫేక్‌ అకౌంట్‌ కార్యకలాపాలు ఆగిపోతాయి.

చాటింగ్‌ చేసేటప్పుడు.. మెసేజ్‌ పంపించే వ్యక్తి పేరుపై క్లిక్‌చేస్తే అతని ప్రొఫైల్‌ ఓపెన్‌ అవుతుంది. ఆ తదుపరి ఫ్రొపైల్‌ పక్కనే ఉన్న మూడు (…) చుక్కలు ఉంటాయి. వాటిపై క్లిక్‌ చేస్తే అతని ఒరిజనల్‌ ఐడీ, అతని పేరు కనిపిస్తుంది. అప్పుడు పోల్చి చూసుకుంటే మనతో చాటింగ్‌ చేసే వ్యక్తి మన నుంచి సహాయం కోరుతున్న వ్యక్తి వేరు అనేది గుర్తించడానికి వీలు ఉంటుంది.
సైబర్‌ నేరస్తులు మూడు రకాలుగా డబ్బులు అడుగుతున్నట్లుగా ఇప్పటి వరకు సైబర్‌ పోలీసులు గుర్తించారు. అందులో మొదటిది రిక్వెస్టుగా అంటే ‘దవాఖానలో ఉన్నాను. డబ్బులు సాయం చేయడి’ అంటూ డబ్బులు అడగడం. రెండో మన ప్రొఫైల్‌ స్టడీ చేసి.. మన వీక్‌ పాయిట్లను వారికి అనుకూలంగా మార్చుకొని.. మనను మాటల్లో పెట్టి వాటిని రికార్డు చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడడం. ఇక మూడోది చూస్తే డీ ఫేమ్‌ చేస్తూ వసూళ్లకు పాల్పడడం.

చాలా మంది మన ఫొటోలు చూసి.. మనమే డబ్బులు అడుగుతున్నామని భావించి.. సైబర్‌ క్రైంకు పాల్పడే వ్యక్తి ఇచ్చిన అకౌంట్‌ నంబర్‌ లేదా సెల్‌ నంబర్‌కు డబ్బులు పంపిస్తూ మోసపోతున్నారు. డబ్బులు పంపే సమయంలో కొన్ని అంశాలను నిశితంగా పరిశీలిస్తే అది ఫేక్‌ ఐడీ అని, అడిగే వాడు దొంగ అని గుర్తు పట్టవచ్చని చెబుతున్నారు ఐటీ నిపుణులు. అది ఎలాగంటే సైబర్‌ నేరాలకు పాల్పడే వాడు.. ఫలానా నంబర్‌కు డబ్బులు పంపాలని రిక్వెస్ట్‌ పంపిస్తాడు. గుగూల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎం లేదా అకౌంట్‌ నంబర్‌ ద్వారా డబ్బులు కోరుతాడు. సదరు నంబర్‌కు డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేసే సమయంలో సదరు నంబర్‌ పేరుతో బ్యాంకులో ఉండే ఒరిజనల్‌ పేరు కనిపిస్తుంది. ఇక్కడ మనను డబ్బు అడిగిన వ్యక్తి అంటే మన స్నేహితుడు, అలాగే మనం డబ్బు పంపిస్తున్న వ్యక్తి పేరు ఒక్కటేనా లేదా ఒక సారి చెక్‌ చేసుకోవాలి. మనకు తెలిసిన పేరు, మనల్ని డబ్బు అడిగిన వ్యక్తి పేరు వేర్వేరుగా ఉంటే.. వెంటనే మన మిత్రుడికి ఫోన్‌ చేసి క్రాస్‌ చెక్‌ చేసుకోవాలి. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే పిన్‌ నంబర్‌ ఎంట్రీ చేసే ముందు కచ్చితంగా ఒకసారి మనం ట్రాన్స్‌ఫర్‌ చేసే వ్యక్తి పేరును పోల్చి చూడాలి. మనను బురిడీ కొట్టిస్తున్నాడని తెలిసిన తక్షణమే మనం అప్రమత్తంగా ఉండాలి

డబ్బులు లాగేందుకు ప్లాన్‌
సైబర్‌ నేరస్తులు డబ్బులు లాగేందుకు రకరకాల మార్గాలను అనుసరిస్తున్నారు. ఫేక్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసిన వెంటనే మన ఫ్రెండ్స్‌ లిస్ట్‌లో ఉన్న అందరికీ మళ్లీ ఫ్రెండ్స్‌ రిక్వెస్ట్‌ పంపుతారు. రిక్వెస్ట్‌ యాక్సెప్ట్‌ చేయగానే మెసెంజర్‌ ద్వారా చాటింగ్‌ మొదలు పెడుతారు. ‘నేను దవాఖానలో ఉన్నా. అర్జంట్‌గా డబ్బులు అవసరం పడ్డాయి. తిరిగి రేపటి వరకు పంపిస్తా. దయచేసి నాకు డబ్బులు పంపండి’ ఇలా రకరకాలుగా మెసేజ్‌లు పెడుతారు. ఆ అకౌంట్‌ను చూడగానే.. మన ఫ్రెండే మనల్ని సాయం కోరినట్లుగా ఉంటుంది. ఎందుకంటే ఫేక్‌ అకౌంట్‌కు ఉండేది మన పేరు, మన ఫొటోనే కదా!

టీఎన్‌జీవోస్‌ జిల్లా కార్యదర్శి దారం శ్రీనివాస్‌ పేరిట ఇటీవల ఫతే సింగ్‌ అనే వ్యక్తి ఫేక్‌ ఐడీ క్రియేట్‌ చేశాడు. శ్రీనివాస్‌ ఫ్రెండ్స్‌ లిస్టులోని అందరికీ ఫ్రెండ్‌ రిక్విస్ట్‌ పెట్టడమే కాదు, మెసెంజర్‌ ద్వారా కొందరితో చాటింగ్‌ చేశాడు. ‘హాస్పిటల్‌లో ఉన్నాను. అర్జంట్‌గా డబ్బులు కావాలి’ అని మెసేజ్‌ పంపించాడు. ఆ మేరకు ఓ వ్యక్తి స్పందించి 20 వేలను సైబర్‌ నేరస్తుడు చెప్పిన ఫోన్‌ నంబర్‌కు పంపగా, మరో 10 వేలు పంపించాలని కోరాడు. దాంతో డబ్బులు పంపిన వ్యక్తి అనుమానించి, శ్రీనివాస్‌కు ఏమైందో తెలుసుకుందామని ఇంటికెళ్లడంతో అసలు విషయం తెలిసింది. తన పేరిట ఫేక్‌ అకౌంట్‌ క్రియేట్‌ అయిందని శ్రీనివాస్‌ గుర్తించి, ఫేస్‌బుక్‌ సంస్థతోపాటు సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే.

అకౌంట్‌ ప్రైవసీ తప్పనిసరి
మనం ఎన్నో రకాలుగా మన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను సేఫ్‌గా ఉంచుకునే అవకాశమున్నది. అందుకోసం ప్రైవసీ సెట్టింగ్స్‌ను మార్చుకోవాలి. అకౌంట్‌ను కేవలం మన ఫ్రెండ్‌ లిస్ట్‌లో ఉన్న వారికే ప్రొఫైల్‌ కనిపించేలా లాక్‌ చేసుకోవచ్చు. అందుకోసం మన ప్రొఫైల్‌ ఓపెన్‌ చేసినప్పుడు మూడు చుక్కలు (…) అడ్డంలో కనిపిస్తాయి. అందులోకి వెళ్లినప్పుడు ‘లాక్‌ ప్రొఫైల్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. ఇది ఓపెన్‌ చేసి లాక్‌ చేసుకోవచ్చు. అలాగే, మన ప్రొఫైల్‌ పిక్‌ను నేరుగా ఎవరూ డౌన్‌లోడ్‌ చేయకుండా చేయవచ్చు. ఫొటోపై క్లిక్‌ చేస్తే వచ్చే ఆప్షన్లలో ‘టర్న్‌ ఆన్‌ ప్రొఫైల్‌ పిక్చర్‌ గార్డ్‌’ను ఓకే చేస్తే సరిపోతుంది. అలా చేయడం వల్ల మన ఫొటోను ఎవరూ నేరుగా కాపీ చేయడానికి అవకాశముండదు. అలాగే, మనం అప్‌డేట్‌ చేసే ఫొటోలు, మెసేజ్‌లు కేవలం మన ఫ్రెండ్స్‌ లిస్ట్‌లో ఉన్నవారికే కనిపించేలా ‘ఎడిట్‌ ప్రైవసీ’ ఆప్షన్‌లోకి వెళ్లి పెట్టుకోవచ్చు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఫేస్‌బుక్‌..బీ అలర్ట్‌ ‘ఫేక్‌' ఐడీ!
ఫేస్‌బుక్‌..బీ అలర్ట్‌ ‘ఫేక్‌' ఐడీ!
ఫేస్‌బుక్‌..బీ అలర్ట్‌ ‘ఫేక్‌' ఐడీ!

ట్రెండింగ్‌

Advertisement