e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home కరీంనగర్ పన్నులు వేసేవాళ్లు కావాలా..?అన్నం పెట్టేవాళ్లు కావాలా..?

పన్నులు వేసేవాళ్లు కావాలా..?అన్నం పెట్టేవాళ్లు కావాలా..?

చేనేత కార్మికులకు బతుకుపై భరోసా ఇచ్చాం
త్వరలో చేతి వృత్తులవారికి బీమా
త్రిఫ్ట్‌ పథకాన్ని తిరిగి కొనసాగిస్తున్నాం
కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరుతో పద్మశాలీ భవనం
హుజూరాబాద్‌లో ఇప్పటికే ఎకరం, రూ. కోటి మంజూరు
మరో రూ.కోటి మంజూరు చేస్తాం
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు
చేనేత కార్మికులకు చెక్కుల పంపిణీ

అడిగిన దాని కంటే ఎక్కువ ఇచ్చిన సీఎం కేసీఆర్‌ : మంత్రి గంగుల కమలాకర్‌
కరీంనగర్‌, సెప్టెంబర్‌ 13 (నమస్తే తెలంగాణ) :“కేంద్రం ప్రభుత్వం సబ్సిడీలు ఎత్తేస్తున్నది. పన్నులు విధిస్తున్నది. మీరు అన్నం పెట్టే వాళ్లను ఆదరిస్తారో, పన్నులు వేసే వాళ్ల వెంట ఉంటారో ఆలోచించుకోవాలి.” అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. స్వాతంత్య్ర సమర యోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరిట హుజూరాబాద్‌లో పద్మశాలీ భవనాన్ని నిర్మిస్తామని, అసంపూర్తిగా ఉన్న చేనేత భవనాన్ని పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. సోమవారం హుజూరాబాద్‌లో వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా మంజూరైన నిధుల చెక్కులను మరో మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి పంపిణీ చేశారు.

తెలంగాణ రాక ముందు చేనేత కార్మికులు అన్నం లేక ఆకలి చావులు, ఆత్మహత్యలు చేసుకున్నారని, రాష్ట్రం వచ్చిన తర్వాత బతుకుపై భరోసా కలిగిందని మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. బతుకు దెరువు, భరోసా ఇచ్చిన ప్రభుత్వాన్ని మర్చిపోవద్దని, ప్రజలకు మేలు చేసేవారు ఎవరో, కీడు చేసే వారు ఎవరో ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. చేనేత కార్మికుల కోసం గతంలో అమలైన పథకాలను తిరిగి పునరుద్దరించామని మంత్రి స్పష్టం చేశారు. ఇందులో త్రిఫ్ట్‌ పథకం ఒకటని, ఇది రెండు కేటగిరీల్లో అమలువుతున్నదని తెలిపారు. కార్మికులు రూ.800 లేదంటే రూ.1,200 జమ చేసుకోవచ్చని, దానికి రెట్టింపు ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా రూ. 30 కోట్లను సంబంధిత మంత్రి కేటీఆర్‌ విడుదల చేశారని, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పథకాలకు రావాల్సిన రూ.73 కోట్లను విడుదల చేశారని తెలిపారు. ఈ పథకాల్లో హుజూరాబాద్‌ చేనేత సొసైటీకి రూ.1,90,75,803 వచ్చాయని, 20 శాతం రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.23,69,900, మార్కెటింగ్‌ ఇన్సెంటివ్‌ కింద రూ. 19,27,416, పావలా వడ్డీ కింద రూ. 3,09,390, టెస్కో ద్వారా రావాల్సిన బకాయిలు రూ. 45,68,742, చేనేత మిత్ర పథకం కింద యార్న్‌ సబ్సిడీ రూ.96,12,850 వచ్చిందన్నారు. అంతే కాకుండా చేనేత కార్మికులు చనిపోతే వచ్చే ఎక్స్‌గ్రేషియా కింద రూ. 2,87,500 అందించామన్నారు. హుజూరాబాద్‌లో ఒక మంచి ఫంక్షన్‌ హాలు కట్టుకునేందుకు ఎకరం స్థలాన్ని కేటాయించామని, రూ.కోటి మంజూరు కూడా చేశామని తెలిపారు. చేనేత, గీత, మత్స్య పారిశ్రామికుల కోసం రైతు బీమాలాంటి పథకాన్ని రూపొందించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని, ఇది అధికారుల పరిశీలనలో ఉందని, త్వరలోనే అమల్లోకి వస్తుందన్నారు. బీజేపీకి ఓటు వేస్తే నిత్యావసరాల ధరలు పెంచుతుందని అన్నారు.

- Advertisement -

అడిగిన దానికంటే ఎక్కువే
-మంత్రి గంగుల కమలాకర్‌
హుజూరాబాద్‌లోని పద్మ శాలీలు అడిగిన దానికంటే సీఎం కేసీఆర్‌ ఎక్కువే ప్రయోజనం చేకూర్చారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో పద్మశాలీ కమ్యూనిటీ హాల్‌ కోసం 10 గుంటల స్థలం, రూ. 50 లక్షలు కావాలని తాను మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లానని, ఆయన సీఎం కేసీఆర్‌ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారని తెలిపారు. గతంలో ఇక్కడ ఉన్న నాయకులు చేనేత కార్మికులను పట్టించుకోలేదని, దండం పెట్టి చెప్పుకున్నా సమస్యలు పరిష్కరించ లేదని ఆరోపించారు. సమావేశంలో మాజీ మంత్రులు ఎల్‌ రమణ, ఇనుగాల పెద్దిరెడ్డి, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు ఎలుగేటి ఉపేందర్‌, జడ్పీటీసీ సభ్యుడు పడితం బక్కారెడ్డి, పద్మశాలీ సంఘం నాయకులు పాల్గొన్నారు.

ఏడాది తిరగక ముందే చెక్కువచ్చింది..
నా భర్త వెంకటేశం మగ్గం పనిచేస్తుండేవాడు. తొమ్మిది నెలల కిందట గుండెపోటుతో మరణించాడు. ప్రభుత్వం టెస్కో ద్వారా ఏడాది తిరగకముందే రూ. 12, 500 అందజేసి ఆర్థికంగా అండగా నిలిచింది. సీఎం కేసీఆర్‌ సారుకు మంత్రులకు రుణపడి ఉంటం.
-పత్తిపాక పుల్లమ్మ, చేనేత కార్మికుడిభార్య (హుజూరాబాద్‌ టౌన్‌)

మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు
మంత్రి హరీశ్‌రావు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నరు. తెలంగాణ రాక ముందు పెండింగ్‌లో ఉన్న రీయింబర్స్‌మెంట్‌ కింద 20 శాతం నిధులు రావాల్సి ఉండే. గతంలో ఈటల రాజేందర్‌కు ఈ విషయం చాలా సార్లు చెప్పినం. కానీ పట్టించుకోలే. రెండు నెలల కింద హరీశ్‌ రావుకు ఈ విషయం చెప్పినం. మాట ఇచ్చినట్టుగనే ఈ పథకం కింద ఒక్క మా సంఘానికే రూ. 23,69,900 ఇప్పించిండ్రు. యార్న్‌ సబ్సిడీ, ఆప్కో ఎక్స్‌గ్రేషియా కింద రావాల్సిన డబ్బులు కూడా ఇప్పించిండ్రు. చాలా రోజులుగా మరుగునవడి పోయిన త్రిఫ్ట్‌ పథకాన్ని కూడా మళ్ల మొదలు పెట్టిండ్రు. ఇది ఒక్క మా ఒక్క హుజూరాబాద్‌కే కాకుండా మొత్తం రాష్ర్టానికి పనికస్తది. రాష్ట్ర ప్రభుత్వం తలుచుకోకుంటే మాకు ఇన్ని ప్రయోజనాలు వచ్చేవి కాదు. ఇసొంటి ప్రభుత్వాన్ని మర్సిపోము. తప్పకుండా రుణం తీర్సుకుంటం..

  • హుజూరాబాద్‌ చేనేత సహకార సంఘం అధ్యక్షుడు ఎలిగేటి ఉపేందర్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana