e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home కరీంనగర్ కమలాపూర్‌ గడ్డ.. గులాబీకి అడ్డా

కమలాపూర్‌ గడ్డ.. గులాబీకి అడ్డా

ఏం చేసిండని ఈటలకు ఓటెయ్యాలె
దళితుల ఇండ్లు కూల్చిన చరిత్ర ఆయనది
గెల్లు శ్రీనివాస్‌ గెలుపు ఖాయం
ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
కమలాపూర్‌లో టీఆర్‌ఎస్‌ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం

కమలాపూర్‌ (పరకాల), సెప్టెంబర్‌ 13: టీఆర్‌ఎస్‌లో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని పదవులు అనుభవించిన ఈటల, తెలంగాణ రాష్ట్ర, ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టాడని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. సోమవారం కమలాపూర్‌ మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మండల కేంద్రంలోని పలు వాడల్లో 2వేల ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్‌ రావు మాట్లాడారు. కమలాపూర్‌ గడ్డ మొదటినుంచి టీఆర్‌ఎస్‌ అడ్డా అని, అనామకుడిగా ఉన్న ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌ జెండాపైనే గెలిచారని గుర్తు చేశారు. అనంతరం టీఆర్‌ఎస్‌ నీడలోనే ఎమ్మెల్యేగా, మంత్రిగా, టీఆర్‌ఎస్‌ కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా పదవులు అనుభవించి కోట్ల రూపాయలను సంపాదించారని ఆరోపించారు. పార్టీలో ఉంటూనే పార్టీకి ద్రోహం చేయాలని ఈటల చూశాడని విమర్శించారు. ఆత్మగౌరవం అని చెప్పే ఈటల కమలాపూర్‌ ప్రజలకు చేసిందేమీ లేదని, కనీసం సొంత గ్రామంలో ఒక్క డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు కూడా కట్టించలేదన్నారు. బొట్టుబిల్లలు, కట్టు మిషన్లు, గడియారాలు, గొడుగులు పంపిణీ చేస్తూ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న ఆయనకు రానున్న ఉప ఎన్నికల్లో సొంత ఊరు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు.

ఆది నుంచి టీఆర్‌ఎస్‌వైపే కమలాపూర్‌ ప్రజలు
టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి కమలాపూర్‌ ప్రజలంతా టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారని పేర్కొన్నారు. 2004లో అప్పటికే సీనియర్‌ నాయకుడైన ముద్దసాని దామోదర్‌రెడ్డిపై అనామకుడిగా ఉన్న ఈటల గులాబీ జెండాపై గెలిచారని, మళ్లీ ప్రస్తుతం ఇదే పునరావృతం కానున్నదని చెప్పారు. గతేడాది రూ.25వేల లోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం, ప్రస్తుతం రూ.50వేల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తున్నదని తెలిపారు. రూ.లక్ష లోపు ఉన్న వ్యవసాయ రుణాలను వచ్చే ఏడాది వరకు వడ్డీతో సహా మాఫీ చేస్తామన్నారు.

- Advertisement -

అమ్మకానికి కేరాఫ్‌ బీజేపీ ప్రభుత్వం
నమ్మకానికి కేరాఫ్‌గా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిలిస్తే అమ్మకానికి కేరాఫ్‌గా బీజేపీ ప్రభుత్వం నిలుస్తున్నదని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. అమ్మకానికో మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం దేశంలోని విలువైన ప్రభుత్వ ఆస్తుల్ని, సంస్థలను యథేచ్ఛగా అమ్మేస్తుందన్నారు. డీజిల్‌, పెట్రోల్‌, వంట గ్యాస్‌ ధరలను పెంచుతూ సామాన్య ప్రజలపై వాతలు, వ్యవసాయ విద్యుత్‌ మోటర్లకు మీటర్లను బిగిస్తూ, దొడ్డు బియ్యం కొనమంటూ రైతులకు కోతలు పెడుతున్న బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. ఈటల మొసలి కన్నీరు కారుస్తున్నారని, ప్రజలు నమ్మి మోసపోవద్దన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కుడా చైర్మన్‌ మర్ర యాదవరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, కౌశిక్‌రెడ్డి, మండల ఇన్‌చార్జి డాక్టర్‌ పేర్యాల రవీందర్‌రావు, జడ్పీటీసీ లాండిగ కళ్యాణి, సర్పంచులు కట్కూరి విజయ, సాంబయ్య, సింగిల్‌ విండో చైర్మన్‌ సంపత్‌రావు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana