e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home కరీంనగర్ మోడ్రన్‌ మార్కెట్లు వచ్చేస్తున్నయ్‌

మోడ్రన్‌ మార్కెట్లు వచ్చేస్తున్నయ్‌

మోడ్రన్‌ మార్కెట్లు వచ్చేస్తున్నయ్‌

కరీంనగర్‌లో నాలుగు ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లు
సకల సౌకర్యాలతో భవనాలు
నిర్మాణాలకు సిద్ధమవుతున్న ప్రణాళికలు
వ్యవసాయ మార్కెట్‌ యార్డులో నిర్మాణానికి టెండర్లు

కరీంనగర్‌ కార్పొరేషన్‌, జూలై 13 : కరీంనగర్‌ ప్రజలకు మరింత మెరుగైన మార్కెట్లను అందుబాటులోకి తెచ్చేందుకు నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న మార్కెట్లు సరిపోకపోవడం, కొందరు రోడ్లపైనే విక్రయాలు సాగిస్తుండడం, పార్కింగ్‌ స్థలాలు లేక ట్రాఫిక్‌ ఇబ్బందులు వస్తుండడంతో వీటిన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నది. మొత్తం నాలుగు అధునాతన భవనాలను నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. కాగా, ఇప్పటికే వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మార్కెట్‌ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టింది.

కరీంనగర్‌లోని ఏకైక ప్రధాన కూరగాయల మార్కెట్‌లో తక్కువ స్థలం ఉండడంతో రోడ్లపైనే కూరగాయలు, పండ్లు, పూల వ్యాపారాలు జరుగుతున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో అనునిత్యం ట్రాఫిక్‌ సమస్యలు వస్తున్నాయి. వీటితోపాటు వివిధ ప్రాంతాల్లోనూ పండ్లు, పూల వ్యాపారులు రోడ్లపైనే అమ్మకాలను సాగిస్తుండడంతో సమస్యలు వస్తున్నాయి. ఇప్పటి వరకు పలు రోడ్లపై కూరగాయల మార్కెట్లు సాగగా.. ఇటీవల మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ వై సునీల్‌రావు ఆదేశాలతో రోడ్లపై విక్రయాలు జరగకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని నగరంలో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్ల నిర్మాణంపై కొన్ని రోజులుగా మేయర్‌ వై సునీల్‌రావు సమాలోచనలు చేశారు. దానికి అనుగుణంగా నాలుగు ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లను నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

- Advertisement -

ప్రస్తుత మార్కెట్లతో ట్రాఫిక్‌ ఇబ్బందులు
ప్రస్తుతం ప్రధాన మార్కెట్‌, కశ్మీర్‌గడ్డ రైతుబజార్‌, రాంనగర్‌, ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల, ఇందిరానగర్‌ మార్కెట్లలో కూరగాయల అమ్మకాలు సాగుతున్నాయి. వీటితోపాటు ప్రధాన మార్కెట్‌లో మటన్‌, ఫిష్‌, రాంనగర్‌, కశ్మీర్‌గడ్డలోని ఫిష్‌ అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే, ఈ ప్రాంతాల్లో సరైన పార్కింగ్‌ సౌకర్యాలు లేకపోవడం, కొందరు రోడ్లపైకి వచ్చి అమ్మకాలు సాగిస్తుండడంతో పదే పదే ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో వీటన్నింటికీ పరిష్కారం చూపే దిశగా ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. దీనిలో భాగంగా నగరంలో నాలుగు ప్రాంతాల్లో వీటిని నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నారు.

సకల సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లు
ఒకే ప్రాంతంలో అన్ని రకాల మార్కెట్లను అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లను సిద్ధం చేస్తున్నారు. ఇందులో వెజ్‌, నాన్‌వేజ్‌ మార్కెట్లతోపాటు పండ్లు, ఇతర మార్కెట్లను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే, ఈ మార్కెట్లకు వచ్చే వ్యాపారులు, కొనుగోలుదారులకు సరైన పార్కింగ్‌ సౌకర్యాలతోపాటు, మూత్రశాలలు, ఇతర సదుపాయాలను కల్పించే దిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ముఖ్యంగా నాన్‌వెజ్‌ మార్కెట్‌లో అపరిశుభ్ర వాతావరణం లేకుండా పూర్తిస్థాయిలో నీటి సదుపాయాలు కల్పించడంతోపాటు నాణ్యమైన నాన్‌వెజ్‌ అమ్మకాలు సాగేలా చర్యలు చేపట్టనున్నారు.

నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటుకు ప్రణాళికలు
కరీంనగర్‌లోని నాలుగు ప్రాంతాల్లో ఈ ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటి కోసం సుమారు రూ.30 కోట్ల మేర వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో ఇప్పటికే రూ.6 కోట్లతో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ యార్డులో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ కోసం టెండర్‌ పక్రియను పూర్తి చేశారు. మిగిలిన వాటిల్లో కశ్మీర్‌గడ్డ రైతుబజార్‌తోపాటు మార్కెట్‌ రోడ్డులోని ఆర్‌అండ్‌బీ శాఖ కార్యాలయ స్థలం, ఇరిగేషన్‌ కార్యాలయాల స్థలాల్లో వీటిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వీటికి సంబంధించి డీపీఆర్‌లను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యం
నగర ప్రజలకు మరిన్ని మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా మేం పని చేస్తున్నాం. ఇంటిగ్రేటెడ్‌ మా ర్కెట్ల ద్వారా ట్రాఫిక్‌ ఇబ్బందులు పరిష్కారం కావడంతో పాటు అన్ని రకాల మార్కెట్లు ఒకే దగ్గర ఉంటా యి. వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌కు ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయి. మిగిలిన మూడు ప్రాంతాలకు సంబంధించి కూడా త్వరలోనే నిర్ణయం తీసుకొని అభివృద్ధి చేస్తాం. ప్రస్తుతం ఉన్న మినీ, ఇతర కూరగాయల మార్కెట్లల్లో మరిన్ని సౌకర్యాలను కల్పించడంతోపాటు ఆయా ప్రాంతాల్లో కూరగాయల మార్కెట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం.

  • వై సునీల్‌రావు, కరీంనగర్‌ మేయర్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మోడ్రన్‌ మార్కెట్లు వచ్చేస్తున్నయ్‌
మోడ్రన్‌ మార్కెట్లు వచ్చేస్తున్నయ్‌
మోడ్రన్‌ మార్కెట్లు వచ్చేస్తున్నయ్‌

ట్రెండింగ్‌

Advertisement