e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home కరీంనగర్ అబద్ధపు మాటలు.. అసత్యపు ప్రచారాలు

అబద్ధపు మాటలు.. అసత్యపు ప్రచారాలు

అబద్ధపు మాటలు.. అసత్యపు ప్రచారాలు

భూముల వ్యవహారం బయటపడ్డాక ఈటల విమర్శలు
ప్రభుత్వాన్ని బదనాం చేసేలా వ్యాఖ్యలు
రాజేందర్‌పై ధ్వజమెత్తిన మంత్రులు కొప్పుల, గంగుల
విలేకరుల సమావేశంలో సూటి ప్రశ్నలు
ఏనాడైనా బడుగు బలహీనవర్గాల గురించి పట్టించుకున్నారా..?
రైతుబంధు డబ్బులు ఎందుకు వద్దనలేదు?
మీ భూములు రెగ్యులరైజ్‌ చేయకపోతే బదనాం చేస్తారా..?
పదవి పోతే అవమానం, ఆత్మగౌరవం గుర్తుకొస్తున్నాయా..?
బీజేపీలో చేరేది మీ ఆస్తుల రక్షణ కోసమే కదా..?
ఏ మాత్రం ఆత్మాభిమానం ఉన్నా సమాధానం చెప్పాలి

కరీంనగర్‌, జూన్‌4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆరంభం నుంచి నిన్నామొన్నటి వరకు ఎన్నో పదవులు ఇచ్చి గౌరవించారన్న విశ్వాసం లేకుండా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అబద్ధాలు మాట్లాడుతూ.. అసత్య ప్రచారాలకు దిగుతున్నారని మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ ధ్వజమెత్తారు. పదవులు అనుభవించిన రోజుల్లో గుర్తుకురాని అవమానం, ఆత్మగౌరవం ఇప్పుడే గుర్తుకొస్తున్నాయా? అంటూ ఎద్దేవా చేశారు. ఐదేళ్ల క్రితం అవమానం జరిగిందని చెబుతున్న ఆయన, ఆనాడే ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. ఇన్నాళ్లూ బడుగు, బలహీనవర్గాల గురించి పట్టించుకోకుండా ఇప్పుడు బీసీ కార్డు ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీలో చేరబోయేది మీ ఆస్తుల రక్షణ కోసమే కదా..? అని ప్రశ్నించారు. ఎన్నికలొస్తే వందశాతం విజయం టీఆర్‌ఎస్‌దేనని స్పష్టం చేశారు. కరీంనగర్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈటల ఆరోపణలను పూర్తిగా ఖండించడమే కాకుండా, సూటిగా పలు ప్రశ్నలు సంధించారు. ఏ మాత్రం ఆత్మాభిమానం ఉన్నా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

తన రాజకీయ ప్రయోజనాల కోసం ఈటల రాజేందర్‌ పచ్చి అబద్ధాలు ఆడుతూ, అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ ధ్వజమెత్తారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ఈటల మాటలను ఖండించారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, మేయర్‌ సునీల్‌రావుతో కలిసి మంత్రులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్నా ముందుగా తాము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

విశ్వాసం లేకుండా విమర్శలా? : మంత్రి కొప్పుల
ఆరంభం నుంచి నేటి వరకు ఈటలకు ఎన్నో పదవులిచ్చి ముఖ్యమంత్రి గౌరవించారు. రాజేందర్‌ బ్రహ్మాండంగా పని చేస్తున్నారని ఎన్నోసార్లు అభినందించారు. అయినా, ఆయన ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిన్నదో అర్థం కావడం లేదు. ప్రగతి భవన్‌కు వెళ్తే రెండుసార్లు అపాయింట్‌మెంట్‌ దొరకలేదని ఈటల చెబుతున్నారు. మంత్రి హోదాలో పనిచేసిన ఆయన ఆమాత్రం అర్థం చేసుకోలేరా? ఆ సమయంలో సీఎం స్పెషల్‌ మీటింగ్‌లో ఉండొచ్చు. లేదా ఏదైనా కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వల్లో అపాయింట్‌మెంట్‌ దొరకకపోయి ఉండొచ్చు. ఆ అంశాన్ని ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఇష్యూ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఎన్నో కీలక నిర్ణయాల్లో ఈటలకు సీఎం సముచిత గౌరవం ఇచ్చి సొంత తమ్ముడిలా భావించారు. అయినా, విశ్వాసం లేకుండా విమర్శలు చేస్తున్నారు. ఇదేనా మీరు చెప్పే ప్రజాస్వామ్యం. కేబినెట్లో నిర్ణయాలు తీసుకున్నప్పుడు అక్కడ సమర్థించి, బయటకొచ్చి మాత్రం ప్రభుత్వానికి, పార్టీకి, నాయకత్వానికి వ్యతిరేకంగా ఎన్నోసార్లు మాట్లాడారు కదా! ఇదేనా మీ ఆత్మగౌరవం? రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రి కొన్ని నిబనంధనలకు లోబడి ఉండాలి. ఇంటర్నల్‌గా మాట్లాడే వేదిక ఉన్నా.. బహిరంగంగా ప్రభుత్వ పథకాలను విమర్శించడమేమిటి? ఇది పరోక్షంగా ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించినట్లు కాదా? ఐదేళ్లుగా అసంతృప్తితో ఉంటే ఆత్మగౌరవం ఉన్న మీరు ఇంతకాలం ఎందుకున్నారు? పార్టీలో ఉంటూ పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టే చర్యలు ఐదేళ్లుగా మీరు ఎందుకు చేశారు? ఇంత చేసినా మిమ్మల్ని భరించిన ముఖ్యమంత్రిని మెచ్చుకోవాలి.

అయితే, సహనానికి కూడా ఓ హద్దుంటుంది. మీరు దేవాలయ భూములు, ఎస్సీల భూములు ఆక్రమించుకున్న సంగతి మాకు ఎవ్వరికీ మొన్నటి వరకు తెలియదు. భూముల వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత సీఎంతో మీకు సఖ్యత లేదని ఇప్పుడు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మీరు చెప్పేటివి నీతులు.. చేసేటివి తప్పుడు పనులు అని చెప్పడానికి రైతుబంధు పథకమే ఒక ఉదాహరణ. బెంజ్‌ కార్లలో తిరిగే వారికి, పంటలేని గుట్టలకు రైతుబంధు వద్దని మీరు చెప్పినట్లుగా చెబుతున్నారు. అది నిజమైతే మీరెందుకు ఏడాదికి 10.28 లక్షల రైతు బంధు తీసుకుంటున్నారు. ఇది మీకు సబబేనా? డబ్బులున్న వాళ్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఎంతో మంది.. రైతుబంధు డబ్బులు వద్దని చెప్పారు. మీరెందుకు ఆ దారిలో వెళ్లలేదో చెప్పాలి. అసైన్డ్‌ భూములు, దేవాలయ భూములు కొనడం నేరమని తెలిసినా మీరే తీసుకున్నారు. అది తప్పని ప్రశ్నిస్తే ఆత్మగౌరవం అంటున్నారు. బడుగు, బలహీవనర్గాల గురించి మాట్లాడే ముందు మీరు తీసుకున్న భూములను రిటర్న్‌ చేయండి.

అప్పుడే మీకు వారి గురించి మాట్లాడే నైతిక హక్కు వస్తుంది. తెలంగాణలో బీసీ కులాలను గౌరవించాలని, విశాలమైన స్థలాల్లో కోట్ల రూపాయలతో ఆత్మగౌరవ భవనాల నిర్మాణ బాధ్యత కూడా మీకే అప్పగించారు కదా.. మీరు ఆ నిర్మాణ బాధ్యతను ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలి. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని, వాటి కోసం ప్రాణాలొైడ్డెనా పోరాడుతానన్న రాజేందర్‌ ఇప్పుడు బీజేపీలో చేరుబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే ఇంతకుముందు మీరు మాట్లాడిన మాటలకు విలువ లేదా? అవసరాలను బట్టి మీరు అబద్దాలు ఆడుతున్నారనడం ఇందుకు నిదర్శనం కాదా? ఇది ఆత్మగౌరవమా? ఆత్మ వంచనా? మీరే చెప్పాలి. వామపక్ష భావజాలం నుంచి వచ్చిన మీరు బీజేపీలో చేరుతున్నారంటే మీ ఆత్మరక్షణ, మీ ఆస్తుల రక్షణ కోసమే కదా..? బీజేపీలో చేరడమంటే ఆత్మవంచన తప్ప మరొకటి కాదు. ఢిల్లీలో ఉన్న నాలుగు రోజుల్లో మూడు రోజుల పాటు ప్రయత్నం చేసినా అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ దొరకలేదు. వాట్సాప్‌ కాల్‌లో మాత్రమే అమిత్‌ షా మాట్లాడారు కదా..? ఇప్పుడెక్కడపోయింది మీ ఆత్మగౌరవం? దేశంలో నంబర్‌వన్‌ రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది.

ఏడేళ్లు పూర్తి కాకముందే కోటి ఎకరాలకు నీళ్లిచే ప్రాజెక్టులు సీఎం పూర్తి చేశారు. అయితే, కొంతమంది నాయకులు, కొన్ని వర్గాలు సంతృప్తిగా లేకపోవచ్చు. కానీ, అన్నివర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇటీవల జరిగిన వరుస ఎన్నికలే కేసీఆర్‌పై ప్రజలకు ఉన్న విశ్వానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఇదే విశ్వాసం భవిష్యత్తులోనూ ఉంటుంది. మీరు చేసే అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. మీకు ప్రభుత్వ తీరు నచ్చకపోతే ఎప్పుడో రాజీనామా చేయాల్సింది. ఇన్నాళ్లూ పదవులు అనుభవించి మీకు నష్టం కలుగుతుందనే సరికి ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. మీరు బీజేపీ, కాంగ్రెస్‌ నాయకుల వెంట తిరిగినప్పుడే మీ ఆత్మగౌరవం పోయింది.

ఓనర్‌ నుంచి క్లీనర్‌ అయ్యావా..? : గంగుల కమలాకర్‌
రాజేందర్‌ చెప్పే విషయాలకు చేసే పనులకు మాత్రం పొంతన లేదు. తాజాగా జరుగుతున్న అనేక సంఘటనలే అందుకు ఉదాహరణలు. నిత్యం తనకు ఆత్మగౌరవం ఉందని చెప్పుకునే ఈటల దానిని ఢిల్లీలో తాకట్టు పెట్టారు. ఈ తాకట్టు ప్రజల కోసం కాకుండా నీ ఆస్తుల రక్షణ కోసం పెట్టిన మాట వాస్తవం అవునా..? కాదా..? చెప్పాలి. కారుకు, గులాబీకి ఓనర్‌నని చెప్పిన మీరు, ఇప్పుడు ఓనర్‌వయ్యారా..? లేక ఢిల్లీ వెళ్లి క్లీనర్‌ అయ్యారా? చెప్పాలి. నల్లచట్టాలు తెల్లగా చేస్తామని బీజేపీ నుంచి మీకేమైనా హామీ దొరికిందా..? బడుగు బలహీన వర్గాలకు మేలు చేస్తామని బీజేపీ మీకేమైనా చెప్పిందా..? బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌పై మీరేమైనా జాతీయ అధ్యక్షుడు నడ్డాతో మాట్లాడారా..? ఆయన హామీ ఇచ్చారా..? లేక చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని గానీ, లేదా కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఇస్తామని ఏమైనా చెప్పారా..? ప్రజలకు ముందు సమాధానం చెప్పాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర సహాయ మంత్రి కిషన్‌ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నా.. మీ పాలసీ ప్రకారం పార్టీకి, పదవికి రాజీనామా చేయిస్తున్నారు సరే. మరి బీసీల, బడుగుల భూములు లాక్కున్న రాజేందర్‌ నుంచి భూములు కూడా వాపస్‌ ఇచ్చేలా చేయండి. దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పే మీరు దేవరయంజాల్‌లో రాముని భూములు ఆక్రమించుకున్న ఈటలను పార్టీలో ఎలా చేర్చుకుంటారో ఒకసారి ఆలోచన చేయండి. కేవలం తన స్వార్థ రాజకీయాల కోసం రాజేందర్‌ బీసీ కార్డు వాడుకుంటున్నది నిజం కాదా..? గతంలో ఈటలకు ఎన్నో పదవులిచ్చారు, ఆదరించారు, సముచిత స్థానం కల్పించారు కదా! అయినా, నీ ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిన్నదో మాకు అర్థం కావడం లేదు. నీతోపాటు ఉద్యమంలో ఆరంభం నుంచి ఉన్న కొప్పుల ఈశ్వర్‌కు మొదటిసారి మంత్రి పదవి ఇవ్వలేదు కదా! ఆ విషయం మీకు గుర్తుకు లేదా..? నీ ఆత్మగౌరవం దెబ్బతిన్నరోజే ఎందుకు రాజీనామా చేయలేదు. సీఎంవో ఆఫీసులో బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఐఏఎస్‌ అధికారులు లేరని ఇప్పుడు చెబుతున్న నీవు ఆనాడే ఎందుకు రాజీనామా చేయలేదు. నీవు వంద శాతం హుజూరాబాద్‌లో గెలిచే ప్రసక్తే లేదు. నీవు గెలిచింది కేసీఆర్‌ బొమ్మ మీదనే. ఈసారి కూడా కేసీఆర్‌ బొమ్మపై పోటీ చేసేవాళ్లే గెలుస్తారు. మీరు బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం గురించి మాట్లాడే నైతిక హక్కు కోల్పోయారు. ఇక ముందైనా అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి. ఎవరెన్ని రకాలుగా ప్రచారం చేసినా ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకే ప్రజలు పట్టం కడుతారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అబద్ధపు మాటలు.. అసత్యపు ప్రచారాలు

ట్రెండింగ్‌

Advertisement