e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home కరీంనగర్ చాలీసా పారాయణం..భక్తి పారవశ్యం

చాలీసా పారాయణం..భక్తి పారవశ్యం

చాలీసా పారాయణం..భక్తి పారవశ్యం

కొండగట్టుపై దిగ్విజయంగా అఖండ హనుమాన్‌ చాలీసా పఠనం
నేటితో రెండు మండలాల కాలం సంపూర్ణం
నేడు హనుమాన్‌ పెద్ద జయంతి ఆంతరంగికంగానే ఉత్సవాలు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు

మల్యాల, జూన్‌ 3 : అంజన్న నామస్మరణ సర్వభయాలను దూరం చేస్తుంది. మనిషిని శారీరకంగా, మానసికంగా బలవంతున్ని చేస్తుంది. మార్చి 17న కొండగట్టుపై ఎమ్మెల్సీ కవిత ప్రారంభించిన అఖండ హనుమాన్‌ చాలీసా పారాయణం దిగ్విజయమైంది. ప్రతి రోజూ సాయంత్రం 5.30 నుంచి 6.30గంటల వరకు ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిభావం ఉప్పొంగేలా సాగింది. నేటి హనుమాన్‌ పెద్ద జయంతితో రెండు మండలాల కాలం సంపూర్ణం కానున్నది.

నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని ఫిబ్రవరి 25న దర్శించుకున్నారు. కాశీ పండితుడు మహంతి సూచన మేరకు కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో తొలుత మండల కాలంపాటు హనుమాన్‌ చాలీసా పారాయణం చేసేందుకు పూనుకున్నారు. ఆలయ అర్చకులు, దాతలతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు అంజన్న ఆలయ అభివృద్ధి కోసం అంజన్న సేవాసమితిని ఏర్పాటు చేశారు. తర్వాత మార్చి 9న ఎమ్మెల్సీ కవిత దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి రామకోటి స్తూపం నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. కొండగట్టులో జరిగే చిన్న హనుమాన్‌ జయంతి కోసం 41 రోజుల దీక్షలను స్వీకరించే రోజున అంటే.. మార్చి 17 న 5 కోట్ల రామప్రతులను కొండగట్టు ఆలయానికి తీసుకువచ్చారు. అదే రోజు అఖండ హనుమాన్‌ చాలీసా పారాయణ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత శ్రీకారం చుట్టారు. రెండు మండలాల కాలం పాటు అంటే హనుమాన్‌ పెద్ద జయంతి (జూన్‌ 4) వరకు నిర్వహించాలని నిర్ణయించారు. కొండపై ఉన్న కొత్త కోనేరు సమీపంలో ప్రత్యేక వేదికను సిద్ధం చేయగా, ప్రతి రోజూ సాయంత్రం 5.30 నుంచి 6.30 వరకు గంటపాటు భక్తులు, అర్చకులు పదకొండు సార్లు పారాయణం చేస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో ఉన్న హనుమాన్‌ ఆలయాల్లో భక్తులు పారాయణం చేయాలని కొండగట్టు అంజన్న సేవా సమితి సభ్యులు పిలుపునిచ్చారు.

నేటితో సంపూర్ణం..
మార్చి 17 నుంచి దిగ్విజయంగా అఖండ హనుమాన్‌ చాలీసా పారాయణం చేస్తున్నారు. ప్రతి రోజూ భజన మండళ్ల సభ్యులు, పలువురు ప్రముఖులు, అంజన్న సేవాసమితి సభ్యులు, అర్చకులు 11 సార్లు పఠనం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు వీక్షించేలా భక్తి టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. జగిత్యాల జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్‌, సంజయ్‌ కుమార్‌ దంపతులు, మంత్రి కొప్పుల సతీమణి స్నేహలతతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొని, అంజన్న నామస్మరణ చేశారు. 79వ రోజు గురువారం మల్యాలకు చెందిన మఠమాంజనేయస్వామి ఆలయ భజన బృందం సభ్యులతోపాటు కరీంనగర్‌కు చెందిన గాయకుడు శ్రీనివాస్‌ కలిసి పారాయణం పఠించారు. శుక్రవారం హనుమాన్‌ పెద్ద జయంతి సందర్భంగా పారాయణం సంపూర్ణం చేయనున్నారు. ఈ మహోన్నత ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న భక్తులు, పూజారులు, పండితులు, భజన మండళ్ల సభ్యులు.. ఇలా అందరికీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధన్యవాదాలు తెలియజేశారు. కరోనాతో అవరోధాలు ఎదురైనా భక్తులు తమ ఇండ్ల నుంచే పారాయణంలో పాల్గొనడం గొప్ప విజయమని అభిప్రాయపడ్డారు. హనుమాన్‌ పెద్ద జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
దక్షిణ భారతదేశంలోనే తొలి రామకోటి స్తూపం
దక్షిణ భారతదేశంలోనే తొలి రామకోటి స్తూపాన్ని ప్రతిష్ఠించాలని కొండగట్టు అంజన్న సేవా సమితి సభ్యులు సంకల్పించారు. కొండపైన 90 లక్షల వ్యయంతో 23 అడుగుల ఎత్తుతో స్తూపాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 5 కోట్ల రామ కోటి ప్రతులను మార్చి 17న అఖండ హనుమాన్‌ చాలీసా పారాయణం ప్రారంభించే రోజున ఎమ్మెల్సీ కవిత కొండగట్టుపైకి శోభాయాత్రగా తీసుకువచ్చారు. స్వామివారి సన్నిధిలో ఉంచి అర్చన కార్యక్రమం నిర్వహించిన తదుపరి పారాయణ వేదికపై భద్రపరిచారు. పారాయణం జరిగే 80 రోజుల వ్యవధిలో మరో 6 కోట్ల రామనామ లిఖిత ప్రతులను సేకరించేందుకు రామకోటి పుస్తకాలను ఏప్రిల్‌ 6న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ వసంత ఆవిష్కరించి, భక్తులకు పంపిణీ చేశారు. ఇప్పటికే ఆలయ స్థపతి శ్రీవల్లీనాయగం, అదనపు కమిషనర్‌ శ్రీనివాసరావు రామకోటి స్తూపానికి మార్కింగ్‌ చేయగా, కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్తూప పనుల్లో ఆలస్యం జరుగుతున్నది.
నేడు హనుమాన్‌ పెద్దజయంతి..
నేడు హనుమాన్‌ పెద్ద జయంతి. కొండగట్టు అంజన్న సన్నిధిలో ఏటా ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. కానీ, ఈ సారి కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా, ఆంతరంగికంగా నిర్వహిస్తున్నారు. నాలుగు రోజులపాటు వేడుకలు జరుపుతుండగా, మూడోరోజు గురువారం అర్చకులు, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. వేంకటేశ్వరస్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యాగశాలలో స్థాపితా దేవతారాధన, హోమం, సుందరకాండ పారాయణం చేసి ఉత్సవ మూర్తులకు పంచామృతాలతో అభిషేకం, సహస్రనామార్చన, మహానివేదన, మంత్రపుష్పం సమర్పించారు. త్రయాహ్నిక త్రికుండాత్మక హోమాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో చంద్రశేఖర్‌, ఏఈవో బుద్ది శ్రీనివాస్‌, పర్యవేక్షకుడు శ్రీనివాసశర్మ, ఆలయ ఇన్‌స్పెక్టర్లు రాజేశ్వర్రావు, స్థానాచార్యులు జితేంద్రప్రసాద్‌, ప్రధాన అర్చకులు రామకృష్ణ, మారుతీస్వామి, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చాలీసా పారాయణం..భక్తి పారవశ్యం

ట్రెండింగ్‌

Advertisement