e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home కరీంనగర్ కబ్జా..కలకలం

కబ్జా..కలకలం

కబ్జా..కలకలం

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం
ఆది నుంచీ భూముల విషయంలో ఆరోపణలు
కొనుగోలుపై దృష్టి?.. చుట్టుపక్కల కన్నేసి ఆక్రమిస్తారనే విమర్శలు
హుజూరాబాద్‌లో ఓ ప్రజాప్రతినిధికి శఠగోపం
ప్రకంపనలు సృష్టిస్తున్న తాజా పరిణామాలు
విచారణకు ఏకంగా ముఖ్యమంత్రి ఆదేశాలు
టీఆర్‌ఎస్‌ వర్గాల్లో హాట్‌టాపిక్‌

కరీంనగర్‌, ఏప్రిల్‌ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ భూకబ్జా వ్యవహారం కలకలం రేపుతున్నది. మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలంలో అసైన్డ్‌ భూముల ఆక్రమణ వెలుగులోకి రావడం సంచలనం సృష్టిస్తున్నది. ఆది నుంచీ భూముల కొనుగోలుపై ఆసక్తి చూపే మంత్రి.. ఎక్కడ భూమి కొన్నా మళ్లీ దాని చుట్టూ స్థలాలను ఆక్రమిస్తారనే ఆరోపణలు ఉండగా, ప్రస్తుత పరిణామాలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. గతంలో భూలావాదేవీల కోసం హుజూరాబాద్‌లో ఓ ప్రజాప్రతినిధికి గులాబీ కండువా కప్పి.. తర్వాత అతడి ద్వారా భూమి కొనుగోలు చేయించి శఠగోపం పెట్టారన్న విమర్శలు వచ్చాయి. అధికార దర్పాన్ని వాడుకుంటూ.. ఇతరులతో కలసి ఈ మధ్యకాలంలో కోదాడ, భువనగిరి వద్ద భారీ వెంచర్లు చేసినట్లుగా ప్రచారం జరుగుతున్నది. మొత్తంగా కబ్జా వ్యవహారంపై జోరుగా చర్చ సాగుతుండగా, ఈటల ద్వారా నష్టపోయిన బాధితులు ఇప్పుడు బయటికి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.

మంత్రి ఈటల రాజేందర్‌కు ఆది నుంచీ టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. కేబినెట్‌లో ప్రతిసారీ మంచి పోర్టుఫోలియో ఇస్తూ వస్తున్నారు. రైతుబంధు లాంటి కీలక పథకాలను రాజేందర్‌ సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌లోనే ప్రారంభించారు. అయితే, ఈ మధ్యకాలంలో మంత్రి ఈటల పలు వేదికలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత వాటిని సర్దిచెప్పుకునే ప్రయత్నం చేశారు. తన సన్నిహితులతోపాటు తన వద్దకు వచ్చిపోయే వాళ్లతోనూ ప్రభుత్వంపై అసందర్భ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తున్నది. తాను చేసిన తప్పులు ఏదో ఒక రోజు బయట పడుతాయని ముందుగానే గ్రహించి ఈ తరహా కామెంట్లు చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినా పార్టీ అధినేత ఏనాడూ వాటిని పెద్దగా పట్టించుకోకుండా ఈటలకు సముచిత గౌవరం ఇస్తూ వస్తున్నారు. కానీ, తాజాగా అసైన్డ్‌ భూముల కబ్జా వ్యవహారం బయటకు పొక్కడం.. ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించడం కలకలం రేపుతున్నది. లోతుగా చూస్తే.. ఆదినుంచీ వందల ఎకరాలున్న ప్రాంతాలపై కన్నేయడం, వాటిని మధ్యవర్తుల ద్వారా కొంత కొనుగోలు చేయడం.. ఆ తర్వాత మంత్రి సన్నిహితులు లేదంటే అనుచరులు మంత్రి పేరు చెప్పి కొన్న భూముల పక్కన ఉన్న జాగలను స్వాధీనం చేసుకోవడం పరిపాటి అనే ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.
పౌల్ట్రీఫాంలు నడిపే మంత్రి ఈటలకు అనతికాలంలో ఇంత భారీగా ఆస్తులు ఎలా వచ్చాయన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. హుజూరాబాద్‌లో మంత్రి ఈటలపై పోటీ చేసిన ప్రతిపక్షాల నాయకులు.. భూముల కొనుగోలు, లావాదేవీలు, అధిక ఆస్తుల వంటి అంశాలపై చాలాసార్లు విమర్శలు చేశారు. ఇక హుజూరాబాద్‌లో ఇతర పార్టీలో ఉన్న ఓ ప్రజాప్రతినిధికి టీఆర్‌ఎస్‌ కండువా కప్పి అతడికి పదవి ఇప్పించారని, దీని వెనుక భూముల కొనుగోలు వ్యవహారం ఉందని ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పదవి ఇప్పిస్తే హుజూరాబాద్‌లో 30గుంటల భూమి కొనుగోలు చేసి ఇవ్వాలనే షరతు మేరకు సదరు ప్రజాప్రతినిధి 60 లక్షలు పెట్టబడి పెట్టగా.. మంత్రి కూడా ఆ భూమికి కొంత సర్దుబాటు చేసినట్లు తెలుస్తున్నది. సదరు భూమిని మంత్రి తన బంధువులపై రిజిస్ట్రేషన్‌ చేసి కొన్నాళ్లకే కోటిన్నరకు విక్రయించారని సమాచారం. అందులో తనకు కొంత వాటా ఇవ్వాలని పెట్టుబడి పెట్టిన ప్రజాప్రతినిధి ప్రశ్నిస్తే.. ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని అతడికి ఇచ్చిన పోస్టు నుంచి తొలగించినట్లు హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తున్నది. మరికొన్ని చోట్ల ఇదే తరహా వ్యవహారాలు జరిగినట్లు తెలుస్తున్నది. ఇన్నాళ్లూ మంత్రి హోదాలో ఉండడంతో అన్యాయం జరిగినా ఎవరూ ముందుకు రాలేదని తెలుస్తోంది. ఇక నుంచి బాధితులు ఒక్కొక్కరుగా ముందుకు రావొచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇవేకాదు, ఇటీవలి కాలంలో కొంత మందితో కలసి కోదాడలో వంద ఎకరాలు, భువనగిరి వద్ద 200 ఎకరాల్లో ప్లాట్స్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ మంత్రితో ఉన్న వ్యక్తులు చుట్టుపక్కల వాళ్లను బెదిరించినట్లు తెలుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా కలకలం
మంత్రి ఈటల రాజేందర్‌పై కొన్నాళ్లుగా రకరకాలుగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. గత ఎన్నికల సమయంలోనూ.. అనేక ప్రాంతాల్లో మంత్రి ఈటలపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ పోస్టర్లు వెలిశాయి. మంత్రి ఈటల ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించారని, ముందుగా దానికి సమాధానం చెప్పాలని, మరికొన్ని చోట్ల భూములు ఆక్రమణ చేశారని పేర్కొంటూ పోస్టర్లు వేశారు. దానిపై అప్పట్లో మంత్రి వివరణ సైతం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ మధ్యకాలంలో మంత్రి ఆస్తులు, అంతస్తులు, భూముల కొనుగోళ్లు క్రయవిక్రయాలపై ఆక్కడక్కడా విమర్శలు వస్తుండగా, తాజా పరిణామాలు ప్రజల్లోనూ, టీఆర్‌ఎస్‌ వర్గాల్లోనూ హాట్‌టాపిక్‌ అయ్యాయి. సీనియర్‌ మంత్రిగా చెప్పుకునే ఈటల అసైన్డ్‌ భూములను కబ్జా చేయడం ఎంతవరకు సమంజమన్న ప్రశ్నలు వస్తున్నాయి. మున్ముందు ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోనన్న చర్చ ప్రస్తుతం నడుస్తున్నది. పైగా హైదరాబాద్‌ కేంద్రంగా మంత్రి భూ దందాలు అనేకం నడిపినట్లు తెలుస్తున్నది. వందలాది ఎకరాలు కొనుగోలు చేసేందుకు డబ్బు ఎక్కడి నుంచి సమకూరుతున్నదన్న ప్రశ్నలు వస్తున్నాయి. మొత్తానికి ఈటల అసైన్డ్‌ భూములను కబ్జా చేయడం అనేది ప్రభుత్వానికి మచ్చ తెచ్చే పనే అన్న అభిప్రాయాలను టీఆర్‌ఎస్‌ శ్రేణులే వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కబ్జా..కలకలం

ట్రెండింగ్‌

Advertisement