e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home కరీంనగర్ సీఎం కేసీఆర్‌తోనే గొల్ల కుర్మలకు స్వాతంత్య్రం

సీఎం కేసీఆర్‌తోనే గొల్ల కుర్మలకు స్వాతంత్య్రం

-కరీంనగర్‌, జూలై 28 (నమస్తే తెలంగాణ):గొల్ల, కుర్మలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ స్పష్టం చేశారు. రాష్ర్టానికి ఆయనే శ్రీరామ రక్ష అని, అడగకముందే అన్నీ ఇస్తున్నారని కొనియాడారు. గొర్రెల పంపిణీ ఎన్నికల కోసం కాదన్న ఆయన, రాష్ట్రమంతటా ప్రతి ఒక్కరికీ అందిస్తామని చెప్పారు. హుజూరాబాద్‌ను అభివృద్ధి చేసింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, ఒక వ్యక్తితో జరిగేది కాదని పేర్కొన్నారు. ఆత్మగౌరవం అంటే ఢిల్లీలో ఇల్లిల్లూ తిరుగుడా? అంటూ పరోక్షంగా ఈటలను ఎద్దేవా చేసిన ఆయన, బడగులు, బలహీన వర్గాలు ఆత్మగౌరవంతో బతికేలా ముఖ్యమంత్రి పథకాలు అమలు చేస్తున్నారని తేల్చిచెప్పారు. బీజపీ నాయకులకు దమ్ముంటే ఒక జాతీయ ప్రాజెక్టు తీసుకురావాలని హితవుపలికారు. ఈ మేరకు బుధవారం జమ్మికుంట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి అట్టహాసంగా ప్రారంభించారు. అనంతరం వేలాదిగా తరలివచ్చిన గొల్ల, కుర్మలనుద్దేశించి ప్రసంగించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకువస్తున్న పథకాలతో గొల్ల, కుర్మలకు నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ స్పష్టం చేశారు. హుజూరాబాద్‌ను అభివృద్ధి చేసింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, ఇంత అభివృద్ధి ఒక్క వ్యక్తితో సాధ్యం కాదని తెలిపారు. ఆఖరి గొల్ల, కుర్మ కుటుంబానికి గొర్రెలు అందే వరకు తాను నిద్రపోనని, అధికారులను నిద్రపోనివ్వనని స్ప ష్టం చేశారు. బుధవారం జమ్మికుంట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి శ్రీనివాస్‌ యాదవ్‌ రెండో విడుత గొర్రెల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ పథకాన్ని ప్రారంభించినా రాష్ట్ర ప్రజలందరికీ వర్తిస్తుందని, హుజూరాబాద్‌ నియోజకవర్గం కోసమే ఈ పథకాలు అమలు చేయడం లేదని, కొందరు మూర్ఖులు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఈ సందర్భంగా మంత్రులు ఒకే రోజు 500 మందికి గొర్రెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మట్లాడారు.

- Advertisement -

ఇక్కడి నాయకులు కొందరు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని, ఏడేండ్లు అధికారంలో ఉన్నప్పుడు ఇదే హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మహారాజులా తిరిగారు కదా? అని పరోక్షంగా బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై సెటైర్లు వేశారు. ‘మీరు చేసుకున్న స్వయంకృతాపరాదం వల్లనే మీ పరిస్థితి ఇలా తయారైంది’అని ఎద్దేవా చేశారు. ‘ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి ఆ ఇంటికి, ఈ ఇంటికి తిరిగితే ఆత్మగౌరవం దెబ్బతినడం లేదా’ అంటూ నిలదీశారు. ‘ఈ ఎన్నికలు హుజూరాబాద్‌ ప్రజలు కోరుకున్నవా?, ఇక్కడి ప్రజల ఆత్మగౌరవం కోసం జరగుతున్న యా?, మీ వ్యక్తిగతమా ఒక్క సారి ఆలోచించుకోవాలి’ అని హితవు పలికారు. సీఎం కేసీఆర్‌ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలు తెస్తూ వారు ఆత్మగౌరవంతో బతికేలా ప్రోత్సహిస్తున్నారని స్పష్టం చేశారు.
హుజూరాబాద్‌ కోసమే రెండో విడుత గొర్రెల పంపిణీ చేపట్టారని కొన్ని మీడియా సంస్థలు, కొందరు అర్థంకాని మూర్ఖులు విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మొదటి విడుత పంపిణీ ఒక్క హుజూరాబాద్‌లోనే జరిగిందా? గొల్ల, కుర్మలు ఒక్కసారి ఆలోచించాలని కోరా రు. దళిత బంధుపైనా కొందరు ఇలాంటి విమర్శలే చేస్తున్నారని, సీఎం కేసీఆర్‌ గతంలో నే ఈ పథకం గురించి నిండు శాసనసభలో ప్ర స్తావించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. దళిత బంధు ఓట్ల కోసం ప్రవేశ పెట్టిందని మాట్లాడే నాయకులకు ఈ విషయం తెలియంది కాదన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, కుల వృత్తులపై ఆధారపడిన వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆలోచన అని స్పష్టం చేశారు.

24 గంటల కరెంటు, రైతుబంధు, రైతు బీమా, కాళేశ్వరం నీళ్లు హుజూరాబాద్‌ ఎన్నికల కోసమే వచ్చాయా? అనేది ఒక్క సారి ఆలోచించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రతి పంచాయతీకి ట్రాక్టర్‌ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఊరికో నర్సరీ, వైకుంఠధామం, డంప్‌ యార్డులు ఉన్నాయా? చెప్పాలని ప్రతిపక్ష పార్టీల నాయకులకు సవాల్‌ విసిరారు.

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సోకాల్డ్‌ నాయకులు కొందరు ఈ రాష్ర్టానికి ఏం చేశారో? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవుపలికారు. ‘కేంద్రంలో మీ పార్టీయే అధికారంలో ఉంది కదా? దమ్ముంటే రాష్ర్టానికి ఒక నేషనల్‌ ప్రాజెక్టు తీసుకురండి’ అంటూ పరోక్షంగా బీజేపీ నాయకులకు మంత్రి సవాల్‌ విసిరారు.హుజూరాబాద్‌లో ఏదైనా అభివృద్ధి జరిగిందా? అంటే అది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వల్లనేనని, ఎవరో ఒక వ్యక్తి ఇది సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఉంటేనే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలైనా చేసుకోవచ్చన్నారు. రాష్ర్టానికి సీఎం కేసీఆరే శ్రీరామరక్ష అని అన్నారు. కాళేశ్వరం, ఎల్లంపల్లి, కొండపోచమ్మ ప్రాజెక్టులు వస్తాయని ఎవరైనా ఊహించారా? అని ప్రశ్నించారు.

గొల్ల, కుర్మలు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం ఆకాంక్ష:మంత్రి కొప్పుల ఈశ్వర్‌
దేశంలో గొల్ల, కుర్మలు ఉన్నారన్న సంగతిని మిగతా రాష్ర్టాలు మర్చిపోయాయని, మన రాష్ట్రం లో మాత్రం వారు ఆర్థికంగా ఎదగాలని సీఎం కేసీఆర్‌ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకు వచ్చారని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ స్పష్టం చేశారు. మొదటి విడుతలో రూ.7 వేల కోట్లు, రెండో విడుతలో రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. గొల్ల, కుర్మల సమస్యలకు శాశ్వత పరిష్కారంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. ఆరున్నరేండ్ల కింద తెలంగాణ బతుకులు ఎలా ఉండేవని, ఇప్పుడెలా ఉన్నాయో ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఎస్సీల అభివృద్ధి కోసం దళిత బంధు పథకాన్ని ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టారని తెలిపారు. కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం మాట్లాడుతూ ఈ పథకంతో రాష్ట్రంలోని గొల్ల, కుర్మలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు.

రెండో విడుత కోసం రూ.6 వేల కోట్లు వెచ్చిస్తున్నారని చెప్పారు. గొల్ల, కుర్మల కోసం హైదరాబాద్‌లో హాస్టల్‌ భవనాలు నిర్మిస్తున్నారని, వీరి పిల్లలు అక్కడ ఉండి చదువుకోవచ్చన్నారు. కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌, కరీంనగర్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌, జడ్పీటీసీ డాక్టర్‌ శ్యాం, ఎంపీపీ మమత, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వాల బాలకిషన్‌రావు, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, పశువైద్య, పశు సంవర్ధకశాఖ సెక్రెటరీ అనితా రాజేంద్ర, రాష్ట్ర గొర్రెల, మేకల పెంపకందారుల సమాఖ్య ఎండీ రాంచందర్‌ నాయక్‌, రాష్ట్ర పశువైద్య, పశు సంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్‌ లక్ష్మారెడ్డి, అధికారులు, వెటర్నరీ వైద్యులు, సిబ్బంది, లబ్ధిదారులు, యాదవ సంఘాల ప్రతినిధులు, నాయకులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాంస్కృతిక సారథి కళాకారులు తేలు విజయ, సాయిచంద్‌, భరత్‌, అనిల్‌కుమార్‌, తదితర కళా బృందం తమ ఆట, పాటలతో అలరించారు. హుజూరాబాద్‌ డీఎస్పీ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఐ, ఎస్‌ఐ, సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana