తిమ్మాపూర్ రూరల్, సెప్టెంబర్ 7: రౌడీయిజాన్ని ఉపేక్షించబోమని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. గ్రామ సర్పంచే రౌడీలతో రాజకీయం చేస్తే.. అది సరికాదని తాను బాధితుల పక్షాన నిలబడ్డానని చెప్పారు. కాగా, తాను సర్పంచ్‌తో మాట్లాడిన ఫోన్ కాల్‌ను వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల శంకరపట్నం మండలం కరీంపేట్ గ్రామంలో చోటు చేసుకున్న ఘటనపై వస్తున్న వార్తలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శంకరపట్నం నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కరీంపేటకు చెందిన కూలీ పనులు చేసుకునే ఓ కుటుంబానికి, సర్పంచ్‌కు మధ్య 80 గజాల స్థలానికి సంబంధించి వివాదం ఉందని తెలిపారు. దీనిపై గతంలో పెద్దమనుషులు పంచాయితీ నిర్వహించి తీర్పు చెప్పగా, సర్పంచ్ పెద్దల మాట వినకుండా ఆ స్థలంలో నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డును రెండుసార్లు తొలగించాడని పేర్కొన్నారు. అంతేకాకుండా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు, రౌడీషీటర్ ఎల్కపల్లి సంపత్ తన అనుచరులతో కరీంపేట్‌కు వెళ్లి గూండాయిజం చేసి బాధితులను భయభ్రాంతులకు గురి చేశాడని తెలిపారు.
తనకు సమాచారం రాగా పోలీసులను పంపించానని, ఈక్రమంలో సంపత్‌పై ఎస్ఐ చేయి చేసుకున్నారని చెప్పారు. పరిస్థితి చేయిదాటిపోతుందనే ఉద్దేశంతో తానే స్వయంగా సర్పంచ్‌కు ఫోన్ చేసి నచ్చజెప్పానని తెలిపారు. దీనిని వక్రీకరిస్తూ తాను బెదిరింపులకు పాల్పడినట్లు మీడియాలో వార్తలు రావడం బాధాకరమని, వార్తలు రాసేముందు ఒకటికి రెండుసార్లు నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. టీఆర్ఎస్లో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలే ఉంటారని, తాను 14 ఏండ్లుగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో క్రమశిక్షణ కలిగిన నాయకునిగా ఉన్నానని పేర్కొన్నారు. టీఆర్ఎస్లో క్రమశిక్షణ లేకుండా రౌడీయిజం చేసిన సంపత్‌ను గతంలో సస్పెండ్ చేశామని, ప్రస్తుతం కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అతడిపై ఆ పార్టీ కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. వెనుకబడిన కరీంపేటలో ఎంతో అభివృద్ధి చేశామని చెప్పారు. గ్రామాభివృద్ధిలో పోటీ పడాల్సిన సర్పంచ్ రౌడీలతో రాజకీయం చేయడం తగదని సూచించారు. ఆయన వెంట జడ్పీటీసీలు తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్, లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్, వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
‘సారు.. మమ్మల్ని కాపాడండి’
‘సారు.. మమ్మల్ని కాపాడండి’ అంటూ కరీంపేట్ బాధితులు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఎదుట గోడు వెల్లబోసుకున్నారు. మంగళవారం సాయంత్రం ఎల్ఎండీలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి తమకు జరిగిన అన్యాయం గురించి వివరించారు. తమకు కరీంపేట సర్పంచ్ మల్లయ్య, మొగిలిపాలెం మాజీ సర్పంచ్ ఎల్కపల్లి సంపత్తో ప్రాణభయం ఉందని విన్నవించారు. తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
రజకులకు అండగా ఎమ్మెల్యే
రజకులకు అండగా ఉండే రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వ్యాఖ్యలకు కొందరు పెడర్థాలు తీయడం సరికాదని రజక సంఘం జిల్లా అధ్యక్షుడు దుబ్బాక రమేశ్ పేర్కొన్నారు. వంకాయగూడెంలోని ఓ ఫంక్షన్హాల్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కరీంపేట్ సర్పంచ్ వనపర్తి మల్లయ్యకు అదే గ్రామానికి చెందిన అంకతి కుటుంబసభ్యులతో కొద్ది రోజులుగా భూవివాదం కొనసాగుతోందన్నారు. కాగా, సర్పంచ్ ఈ విషయమై ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో పాటు తమ సంఘానికి చెందిన నాయకుడు రాసమల్ల శ్రీనివాస్‌పై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అలాగే, ఎమ్మెల్యే రసమయి రజకులను కించపరిచినట్లు తమ సంఘానికి చెందిన కొందరు నాయకులే వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. రజకులకు ఏ సమస్య వచ్చినా గొప్ప మనసుతో స్పందించే వ్యక్తి రసమయి బాలకిషన్ అని పేర్కొన్నారు. రజక యువజన సంఘం గౌరవాధ్యక్షుడు దురిశెట్టి రవి, జిల్లా నాయకుడు పొన్నాల సంపత్, నియోజకవర్గ ఇన్చార్జి నాంపల్లి శంకర్, మండలాధ్యక్షుడు తాడిచెర్ల తిరుపతి, నాయకులు నాంపల్లి ఆదిత్య, రాచర్ల వెంకటేశం, కాంత్రి కిరణ్, కోటి, రామకృష్ణ, కిట్టు, అనిల్, రాసమల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.