e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 27, 2021
Home కరీంనగర్ మేమున్నాం..

మేమున్నాం..

  • మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో సహాయక చర్యలు ముమ్మరం
  • రంగంలోకి కలెక్టర్‌ సహా జిల్లా యంత్రాగం
  • 86 కుటుంబాలు పునరావాస కాలనీలకు తరలింపు

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్‌28 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల టౌన్‌/ కలెక్టరేట్‌: రెండ్రోజులుగా తెరిపిలేని వర్షంతో అతలాకుతలమైన సిరిసిల్ల పట్టణం కొద్దికొద్దిగా తేరుకుంటున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీగా కురవడంతో కార్మిక క్షేత్రం జలదిగ్బంధంలో చిక్కుకుంది. పైన ఉన్న చెరువులన్నీ నిండి మత్తళ్లు దూకడం, నీరంతా సిరిసిల్లను ముంచివేసింది. సిరిసిల్లలోని వెంకంపేట, జయప్రకాష్‌నగర్‌, అంభికానగర్‌, ప్రగతినగర్‌, సుందరయ్యనగర్‌, అనంతనగర్‌, అశోక్‌నగర్‌, సంజీవయ్యనగర్‌, పాతబస్టాండ్‌, పెద్దబజార్‌, ఆటోనగర్‌, రాళ్లబావి, శాంతినగర్‌, పోస్టాఫీస్‌ ఏరియాల్లోని రోడ్లపై వరద నీరు భారీగా చేరుకుంది. చాలా ఇండ్లలోకి నీరు వచ్చింది. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

రంగంలోకి యంత్రాంగం
ముందు జాగ్రత్త చర్యగా మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో సోమవారం మధ్యాహ్నం నుంచే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మంగళవారం కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి సహా జిల్లా యంత్రాంగం, మున్సిపల్‌ అధికారులు రంగంలోకి దిగారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలైన నర్సింగ్‌ కళాశాల, సినారె కళామందిరాలకు తరలించారు. కొత్త చెరువు ప్రాంతంలో వరద నీటిలో చిక్కుకున్న ఆటోను క్రేన్‌తో బయటికి తీశారు. అదే ప్రాంతంలో నీటిలో చిక్కుకుపోయిన దంపతులను జేసీబీ సాయంతో సురక్షిత ప్రాంతానికి తరలించారు. రాత్రంతా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టడంతో ఎటువంటి ప్రమాదాలు జరగలేదని ప్రజలు చెబుతున్నారు.

- Advertisement -

క్షేత్రస్థాయిలోకి కలెక్టర్‌..
కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఇన్‌చార్జి డీఆర్‌వో శ్రీనివాసరావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, తహశీల్దార్‌ విజయ్‌తో కలిసి లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. శాంతినగర్‌, కొత్తచెరువు, జంగమయ్యకుంట, వెంకంపేట, ఈదుల చెరువు వద్ద క్షేత్రస్థాయిలో పర్యటించి రెవెన్యూ, పోలీస్‌, మున్సిపల్‌ అధికారులు చేపడుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. శిథిలావస్థలో ఇండ్లలో ఉన్నవారిని ఖాళీ చేయాలని కోరారు. అనంతరం స్థానిక నర్సింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. బాధితులకు కల్పించిన మౌళిక వసతులు, భోజన సౌకర్యంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అధికారుల భరోసా..
లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు నిరంతరం శ్రమించారు. కలెక్టర్‌ ఆదేశాలతో పోలీస్‌, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ, మున్సిపల్‌ అధికారులు సహా హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం సభ్యులు వరద బాధిత ప్రజలకు మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్‌ రూం టోల్‌ ఫ్రీనంబర్‌ 9100069040కు వచ్చిన సమాచారం ఆధారంగా సహాయక చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాలకు చెందిన 86మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అలాగే స్థానికంగా సురక్షిత ప్రాంతాల్లో ఉన్న బంధువుల ఇండ్లకు సుమారు వంద మందికి పైగా తరలించారు. వార్డుల వారీగా ప్రత్యేక బృందాలతో ప్రజలకు అందుబాటులో ఉంటూ బాసటగా నిలిచారు. మొత్తం 4జేసీబీలు, 8ట్రాక్టర్లు, 2బొలేరో వాహనాలతో పాటు ట్రావెలర్‌ వాహనాన్ని ఏర్పాటుచేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శాంతినగర్‌లో కమిషనర్‌ వెల్దండి సమ్మయ్య వాహనంలో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

వైద్య శిబిరాల ఏర్పాటు..
సినారె కళామందిరం, నర్సింగ్‌ కళాశాలల్లోని పునరావాస కేంద్రాల్లో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు శిబిరాలను ఏర్పాటుచేశారు. డీఎంహెచ్‌వో సుమన్‌మోహన్‌రావు శిబిరాలను పరిశీలించి సిబ్బంది, ప్రజలకు సూచనలు చేశారు. జలుబు, దగ్గు, జ్వర లక్షణాలు ఉన్నవారు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ దవాఖానల్లో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

సహాయక చర్యల్లో ప్రజాప్రతినిధులు..
లోతట్టు ప్రాంతాల్లో జిల్లా యంత్రాంగం చేపడుతున్న సహాయక చర్యల్లో మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, నాయకులు అడ్డగట్ల మురళి, రాపెల్లి దినేష్‌, జాగిరి శైలు, ఆకుల కృష్ణ, కల్లూరి రాజు, వేముల రవి, దిడ్డి రాజు, గెంట్యాల శ్రీనివాస్‌తో పాటు ఆయా వార్డుల ప్రజాప్రతినిధులు ప్రజలకు చేయూతనందించారు.

చురుగ్గా కాలువ పనులు..
వరద నీటిని మళ్లించేందుకు అధికారులు చేపట్టిన కచ్చ కాలువ పనులు చురుగ్గా సాగుతున్నా యి. 80శాతం పూర్తయింది. మరో వారంలో పనులు పూర్తవుతుండగా ఇంతలోనే మళ్లీ తుఫా న్‌ రావడంతో నీరు లోతట్టు ప్రాంతాలను ముంచేసింది. కాలువ తవ్వడం వల్ల సుందరయ్యనగర్‌, ప్రగతినగర్‌, శివనగర్‌ వార్డులకు బోనాల చెరువు మత్తడి నీరు రాలేదని అధికారులు తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement