e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home కరీంనగర్ టాస్క్‌తో నైపుణ్య శిక్షణ

టాస్క్‌తో నైపుణ్య శిక్షణ

  • యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం
  • ఉద్యోగాల సాధనకు ఉపయోగకరంగా కార్యాచరణ
  • విద్యార్థి దశ నుంచే ఐటీ రంగంపై అవగాహన
  • మంత్రి కేటీఆర్‌ చొరవతో సిరిసిల్లలో టాస్క్‌ సెంటర్‌ ఏర్పాటు
  • రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌
  • జిల్లా కేంద్రంలో టాస్క్‌ కార్యాలయం ప్రారంభం

సిరిసిల్ల టౌన్‌, ఆగస్టు 2: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా టాస్క్‌ కార్యాలయం సేవలు అందిస్తున్నదని రాష్ట్ర ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సినారె గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ కార్యాలయాన్ని (టాస్క్‌) సోమవారం కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, టాస్క్‌ సీఈవో శ్రీకాంత్‌సిన్హా, గ్రంథాలయ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో జయేశ్‌రంజన్‌ మాట్లాడారు. టాస్క్‌ సెంటర్‌ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉన్నదని, ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌లో కార్యాలయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లా యువతకు టాస్క్‌ సేవలు అందుబాటులోకి తేవాలన్న మంత్రి కేటీఆర్‌ సూచన మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో టాస్క్‌ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. టాస్క్‌ కార్యాలయం ద్వారా ఐటీ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆయా కోర్సుల్లో శిక్షణ అందిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగుల్లో 60 శాతం మంది తెలుగు రాష్ర్టాలకు చెందిన వారు కాగా, 40 శాతం మంది ఇతర రాష్ర్టాల వారు ఉన్నారని చెప్పారు.

వందశాతం స్థానిక యువతకే ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో టాస్క్‌ సెంటర్‌ ద్వారా ఐటీ రంగానికి సంబంధించిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణను అందిస్తున్నామన్నారు. టాస్క్‌లో శిక్షణ తీసుకోవడం ద్వారా ఐటీ రంగంలో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి బంగారు భవిష్యత్‌ ఏర్పడుతుందని ఆకాంక్షించారు. మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో టాస్క్‌ సెంటర్‌ ఏర్పాటుకు సహకరించిన కలెక్టర్‌, గ్రంథాలయ చైర్మన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ మాట్లాడుతూ ఐటీ రంగంలో యువతకు ఉన్నత భవిష్యత్‌ ఉంటుందని అన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఇక్కడ టాస్క్‌ సెంటర్‌ ఏర్పాటైందన్నారు. ఐటీ రంగంలోని అనేక విభాగాలకు సంబంధించి ఇక్కడ నైపుణ్య శిక్షణ అందిస్తారన్నారు. యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రంథాలయ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య మాట్లాడుతూ టాస్క్‌ సెంటర్‌తో యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడనున్నాయన్నారు. మౌలిక వసతుల కల్పనకు అవసరమైన సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా లైబ్రేరియన్‌ శంకరయ్య, టాస్క్‌ సెంటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌ అరుణ్‌, సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana