e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, December 8, 2021
Home కరీంనగర్ ఈటలవన్నీ అబద్ధాలే

ఈటలవన్నీ అబద్ధాలే

  • బీజేపీ గుంతలో దిగి బురద రుద్దుకున్నవ్‌
  • అసత్యాలు ప్రచారం చేస్తున్నవ్‌
  • గ్యాస్‌ ధరలపై నా సవాల్‌ను ఎందుకు స్వీకరించడం లేదు
  • మహిళల ఖాతాల్లో 25.89 కోట్లు పడ్డయ్‌.. కండ్లు కనిపించడం లేదా..!
  • ఏడేండ్లు కేంద్రంలో ఉన్న బీజేపీ ఏం చేసింది?
  • రాజేందర్‌పై మంత్రి హరీశ్‌రావు ధ్వజం
  • విష ప్రచారాన్ని మానుకోవాలని హితవు
  • పండుగపూట మహిళలు సంతోషంగా ఉన్నారని హర్షం

కరీంనగర్‌, అక్టోబర్‌ 16(నమస్తే తెలంగాణ):“బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్‌ చెప్పేవన్నీ అబద్ధ్దాలే.. సోషల్‌ మీడియా ద్వారా విష ప్రచారాలు చేయించుకుని హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో గెలువాలని చూస్తున్నడు. బీజేపీ అనే గుంతలో దిగి ఒల్లంతా బురద రుద్దుకుని అసత్యాలు ప్రచారం చేస్తున్నడు. మహిళల ఖాతాల్లో రూ.25.89 కోట్లు పడ్డయ్‌.. ఆయనకు కండ్లు కనిపించడం లేదా?. గ్యాస్‌ ధరలపై నా సవాల్‌ను ఎందుకు స్వీకరించడం లేదు. ఏడేండ్లలో కేంద్రంలో ఉన్న బీజేపీ ఏం చేసింది, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ ఏం చేసిందో విశ్లేషించుకోవాలి. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్న టీఆర్‌ఎస్‌కు అండగా నిలవాలి. గెల్లు శ్రీనివాస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి.”

బీజేపీ నాయకుడు అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉప ఎన్నికలో గెలవాలని చూస్తున్నాడని, టీఆర్‌ఎస్‌ వాళ్లు డబ్బులు, మద్యం, మాంసం పంచుతున్నారని ప్రచారం చేస్తూ హుజూరాబాద్‌ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. శనివారం హుజూరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు అమ్ముడు పోతున్నారని మరో పక్క వాళ్ల ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీశారని అన్నారు. హుజూరాబాద్‌ ప్రజలు, నాయకులు డబ్బుకు, మద్యానికి లొంగే వాళ్లు కాదని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్‌ ఇచ్చిన గడియారాలను నేలకేసి కొట్టి నిరసన తెలిపిన విజ్ఞులని స్పష్టం చేశారు.

- Advertisement -

ఈటల గెలిస్తే బీజేపీకి లాభం..
టీఆర్‌ఎస్‌ గెలిస్తే ప్రజలకు న్యాయం
ఈటల రాజేందర్‌ గెలిస్తే బీజేపీకి లాభమని, అదే టీఆర్‌ఎస్‌ గెలిస్తే హుజూరాబాద్‌ ప్రజలకు న్యాయం జరుగుతుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. బీజేపీ ఢిల్లీకి గులాము లాంటి పార్టీ అని, అదే టీఆర్‌ఎస్‌ ప్రజలకు గులాము లాంటిదని చెప్పారు. అసలు ఈటలను బీజేపీ, బీజేపీని ఈటల ఓన్‌ చేసుకోవడం లేదని తెలిపారు. తనను చూసి ఓట్లు వేయాలని రాజేందర్‌ ప్రచారం చేసుకుంటున్న తీరు ఆ పార్టీలోని సీనియర్‌ కార్యకర్తలు, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులకు మింగుడు పడడం లేదని అన్నారు. ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరి ఒల్లంతా బురద అంటించుకున్నారని, అందుకే ప్రచారంలో బీజేపీ పేరు చెప్పి ఓట్లు అడగడానికి వెనకాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ వేరు, తాను వేరు అన్నట్లు ఈటల ఫీలవుతున్నారని, ముస్లింల వద్దకు వెళ్లి తనను చూసి ఓట్లు వేయాలని కోరుతున్నారని అన్నారు.

బొగ్గు లాక్కునేందుకు బీజేపీ కుట్రలు
ఇక్కడ ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ రాష్ట్ర అవసరాలకు సరిపోగా 6 నుంచి 10 మిలియన్‌ యూనిట్లు ఇతర రాష్ర్టాలకు విక్రయిస్తున్నామని తెలిపారు. ఏ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలోనైనా 20 రోజులకు సరిపడా బొగ్గు నిలువలు ఉండాలనేది రూలని, తెలంగాణలోని థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల్లో 15 రోజులకు సరిపడా ఉందని, ఇంకా కొన్ని రాష్ర్టాల్లో ఆ మాత్రం లేదని, ఇక్కడి నుంచి బలవంతంగా బొగ్గు లాక్కునేందుకు కేంద్రంలోని బీజేపీ కుట్రలు చేస్తోందని మంత్రి తెలిపారు. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తున్న హుజూరాబాద్‌ ప్రజలు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రాజ్యసభ సభ్యులు బండ ప్రకాశ్‌, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, జమ్మికుంట మున్సిపల్‌ చైర్మన్‌ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌ రావు, టీఆర్‌ఎస్‌ నాయకులు కౌశిక్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దళితబంధుపై తప్పుడు ప్రచారం
తనను చూసే దళిత బంధు అమలు చేస్తున్నారని రాజేందర్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. మరీ రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్లు, కాళేశ్వరం ప్రాజెక్టు, ఉచిత విద్యుత్‌, రైతు రుణమాఫీ ఇవన్నీ ఎవరిని చూసి అమలు చేస్తున్నామో రాజేందర్‌ చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌కు మానవత్వం లేదని, అతనికి గోరీ కడతామని ఈటల ప్రగల్బాలు పలుకుతున్నారని, ప్రభుత్వ పథకాలు పొందుతున్న ఏ లబ్ధిదారుడిని అడిగినా కేసీఆర్‌ అంటే ఏమిటో చెబుతారని హితవుపలికారు. మూడు పంచ్‌ డైలాగులు, ఆరు అబద్దాలు చెప్పినంత మాత్రాన హుజూరాబాద్‌ ప్రజలు నమ్మరని స్పష్టంచేశారు.

న్యాయంగా ఆలోచించి ఓటేయండి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాలు రైతులకు ఉరితాళ్లవంటివని ఈటల రాజేందర్‌ వ్యతిరేకించారని, ఇపుడు తన స్వార్థం కోసం అదే పార్టీలో చేరి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచింది నిజం కాదా? అని, పండగ పూట ప్రజలు కడుపునిండా తినకుండా చేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం రైతులను కారెక్కించాలని చూస్తోందని, బీజేపీ ప్రభుత్వం మాత్రం రైతులపై కారెక్కించి చంపాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ఏ పాలన సరైనదో, ఏ పార్టీ గెలిస్తే హుజూరాబాద్‌ ప్రజలకు న్యాయం జరుగుతుందో ఆలోచించుకోవాలని సూచించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలు తెచ్చి రైతులను, ధరలు పెంచి సామాన్యులను ఆగం చేస్తోందని, ఈ పార్టీకి ఓట్లు ఎందుకు వేయాలో ఆలోచించాలని కోరారు. ధర్మబద్దంగా, న్యాయబద్దంగా ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement