e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home కామారెడ్డి ‘లక్కీ’ ఛాన్స్‌ !

‘లక్కీ’ ఛాన్స్‌ !

  • మద్యం దుకాణాల్లో 30శాతం రిజర్వేషన్లు
  • గౌడ కులస్తులకు 15శాతం ప్రకటించిన ప్రభుత్వం
  • దళితులకు 10శాతం, గిరిజనులకు 5శాతం కేటాయింపు
  • ఉమ్మడి జిల్లాలో 130 వైన్‌ షాపులు
  • త్వరలోనే ముగియనున్న 2019-21 మద్యం పాలసీ
  • వచ్చే ఏడాది లైసెన్సుల జారీలో రిజర్వేషన్‌కు కసరత్తు

ఇప్పటికే మద్యం పాలసీలో పారదర్శకతకు పెద్దపీట వేసిన రాష్ట్రప్రభుత్వం మరో కీలక అడుగుకు శ్రీకారం చుట్టడంతో ఉమ్మడిజిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వైన్‌షాపుల నిర్వహణలోనూ రిజర్వేషన్లు కేటాయిస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు.. గౌడ, దళిత, గిరిజనులకు మద్యం దుకాణాల కేటాయింపుల్లో ప్రాధాన్యం కల్పిస్తూ ఇటీవల మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 130 వైన్‌ షాపులు ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయం మేరకు.. 15శాతం రిజర్వేషన్‌తో దాదాపు 20 దుకాణాలు గౌడ కులస్తులకు, 10శాతం కేటాయింపుతో సుమారు 13 దుకాణాలు దళితులకు, 5శాతం రిజర్వేషన్‌తో 6 నుంచి 7 షాపులు గిరిజనులకు దక్కే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలోని మొత్తం 130 మద్యం దుకాణాల్లో 38 నుంచి 40 ఆయా సామాజికవర్గాలకు దక్కనున్నాయి. కొత్త లైసెన్సుల జారీలో ఈ రిజర్వేషన్లు అమలు కానుండగా.. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనున్నది.

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నది. వైన్‌ షాపుల నిర్వహణలో రిజర్వేషన్లు ప్రకటించింది. ఇప్పటి వరకు వైన్‌ షాపులను లక్కీ డ్రా పద్ధతిలో కేటాయిస్తున్నా రు. ఇందులో ఎలాంటి రిజర్వేషన్లు లే వు. కల్లు గీత కార్మికులకు(గౌడ కులస్తులకు) వృత్తిపరమైన సంబంధం కలిగి ఉండడంతో వారికి ఇందులో రిజర్వేషన్లు కేటాయిస్తామని సీఎం గతంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సెప్టెంబర్‌ 16వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో రిజర్వేషన్లకు ఆమోదం తెలపడంతో గీత కార్మికుల్లో ఆనందం వ్యక్తం అవుతున్నది. వీరితో పాటు సామాజికంగా వెనుకబాటుకు గురైన దళిత, గిరిజనులకు సైతం వైన్‌ షాపుల కేటాయింపుల్లో ప్రాధాన్యత కల్పించాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5శాతం చొప్పున రిజర్వేషన్లు అమలు చేసేందుకు క్యాబినెట్‌ నిర్ణయించడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మొత్తం 130 వైన్‌ షాపులున్నాయి. ఇందులో 30శాతం రిజర్వేషన్లు ప్రకటించడంతో ఇకపై సుమారు 38 నుంచి 40 దుకాణాలకు నిర్ధేశించిన సామాజిక వర్గాలకు చెందిన వారే పోటీ పడనున్నారు.

- Advertisement -

సామాజిక న్యాయం…

మద్యం వ్యాపారంలో లాభాలు ఆశించిన స్థాయిలో దక్కుతా యి. స్వల్ప కాలంలోనే భారీ రాబడులు, మద్యం కంపెనీల నుంచి బొనాంజాలు దక్కించుకోవడం సులువు. తక్కువ కాలం లో ఎక్కువ వ్యాపారం చేయాలనే ఆకాంక్షతో అనేక మంది వైన్‌ షాపుల నిర్వహణపై ఆసక్తి చూపుతున్నారు. ఇందులో అన్ని వర్గాల వారు ప్రత్యక్షంగా పాత్రధారులు అవుతుండడంతో రెండేండ్ల కోసారి నిర్వహిస్తున్న లైసెన్సుల కేటాయింపు క్లిష్టంగా మారింది. నిజామాబాద్‌ జిల్లాలో 90 వైన్‌ షాపులు, కామారెడ్డి జిల్లాలో 40 వైన్‌ షాపులున్నాయి. మొత్తం 130 దుకాణాల్లో 30శాతం రిజర్వేషన్‌ కేటాయింపులతో ఆయా వర్గాలకు సామాజిక న్యాయం చేకూరినట్లు అయ్యింది. కల్లు గీతనే వృత్తిగా మలుచుకుని జీవిస్తున్న కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంతో చాలా మేలు జరుగనుంది. 15శాతం రిజర్వేషన్‌తో ఉమ్మడి జిల్లాలో దాదాపు 20 దుకాణాలు గౌడ కులస్తులకే దక్కబోతున్నాయి. దళితులకు 10శాతం కేటాయింపుతో సుమారు 13, గిరిజనులకు 5శాతం రిజర్వేషన్‌తో 6నుంచి 7 దుకాణాలు కేటాయించే అవకాశాలున్నాయి. వైన్‌షాపుల్లో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. రిజర్వేషన్‌ ప్రకటనతో స్పష్టమైన మార్గదర్శకాలను సర్కారు త్వరలోనే వెల్లడించే ఆస్కారం ఉంది.

భారీ పోటీ..

నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో వైన్‌ షాపుల నిర్వహణకు భారీ పోటీ నెలకొంటుంది. రెండేండ్లకోసారి నిర్వహించే మద్యం పాలసీకి గతంలో టెండర్‌ విధానంలో దుకాణాలను కేటాయించే వారు. కాంగ్రెస్‌ పరిపాలనలో పారదర్శకత లేకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడేది. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమాలకు చరమగీతం పాడారు. అవినీతికి ఆస్కారం లేకుండా నిర్ధిష్ట ప్రమాణాల మేరకు వైన్‌ షాపులను కేటాయించారు. 18 ఏండ్లు నిండిన వారు ఎవరైనా నిర్ణీత ఫీజుతో దరఖాస్తు సమర్పిస్తే లక్కీ డ్రా ద్వారా దుకాణాలు కేటాయించే పద్ధతిని తెలంగాణ సర్కారు తీసుకు వచ్చింది. నాటి నుంచి అక్రమార్కుల ఆగడాలకు చెక్‌ పడి సామాన్యుల చేతికి సైతం వైన్‌ షాపులు లభించడం మొదలైంది. 2017-19 మద్యం పాలసీలో దరఖాస్తు ఫీజు రూ.లక్షగా ప్రభుత్వం నిర్ధేశించింది. అయినప్పటికీ భారీగా దరఖాస్తుదారులు పోటెత్తారు. 2019-2021 పాలసీలో రూ.2లక్షలకు దరఖాస్తు ఫీజు పెంచినప్పటికీ ఔత్సాహికులు వెనుకడుగు వేయలేదు. భారీగా అప్లికేషన్లు సమర్పించడం ద్వారా దరఖాస్తుల రూపంలోనే సర్కారుకు భారీగా ఆదాయం సమకూరింది. 2021-2023 మద్యం పాలసీ సైతం లక్కీ డ్రా పద్ధతిలోనే నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఉమ్మడి రాష్ట్రంలో సిండికేట్‌ దందా…

ఉమ్మడి రాష్ట్రంలో మద్యం దుకాణాలకు బహిరంగ వేలం ఉండడంతో రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు తీవ్రంగా పోటీపడి వేలం పాడేవారు. ఇతరులెవ్వరూ పోటీకి రాకుండా బెదిరింపులకు దిగేవారు. సిండికేట్‌ వ్యవహారాలకు సైతం మద్యం వ్యాపారులు దిగేవారు. దీంతో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లైసెన్సుల ఎంపిక జరుగుతున్నందున ప్రభుత్వం భిన్నమైన చర్యలకు ఉపక్రమించింది. సర్కారు లక్కీ డ్రా పద్ధతి అమలులోకి తెచ్చాక దుకాణాలు ఎవరికి వస్తాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. దీంతో మద్యం వ్యాపారులు తమ అనుచరులు, కుటుంబ సభ్యుల పేర్లతో వేర్వేరుగా పదుల సంఖ్యలో దరఖాస్తులు వేయించినా దుకాణాలు దక్కని పరిస్థితి ఏర్పడింది. లక్కీ డ్రా విధానంలో అదృష్టం వరించి లక్కీడిప్‌లో సామాన్యులకు సైతం దుకాణాలు దక్కుతున్నాయి. 2019-2021 మద్యం పాలసీలో చాలా మంది వ్యాపారులు నిబంధనలు తుంగలో తొక్కి ఇతరుల లైసెన్సులను లీజుకు తీసుకుని నడుపుతున్నారు. ఈ విష సంస్కృతి నిజామాబాద్‌ జిల్లాలో విచ్చలవిడిగా సాగుతున్నది. ఎక్సైజ్‌ శాఖ అధికారుల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతున్నా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెల్తుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం

శక్కర్‌నగర్‌, సెప్టెంబర్‌ 18 : మద్యం షాపుల టెండర్లలో గిరిజనులకు రిజర్వేషన్లు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయం. అన్ని రంగాల్లో గిరిజనులకు ప్రాధాన్యం కల్పించే దిశగా సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. వ్యాపార రంగంలో రాణించేందుకు కల్పించిన ఈ అవకాశం గిరిజనుల ఆర్థికాభ్యున్నతికి దోహదపడుతుంది.
-చందర్‌ నాయక్‌, ఒడ్డాపల్లి

ఇతర రాష్ర్టాలకు ఆదర్శం

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలు బాగున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా పలు పథకాలు అమలు చేయడంతో పాటు, వ్యాపార రంగంలో దళితులకు కూడా భాగస్వామ్యం కల్పించే దిశగా వైన్స్‌ టెండర్లలో 10 శాతం రిజర్వేషన్లు ప్రకటించడం సీఎం కేసీఆర్‌ ఔదార్యానికి నిదర్శనం. ఈ రిజర్వేషన్లతో మాకు కూడా మరో వ్యాపారం చేసేందుకు ప్రోత్సాహకంగా మారుతుంది. ప్రభుత్వ నిర్ణయం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా మారుతుంది. సీఎం కేసీఆర్‌ సార్‌కు కృతజ్ఞతలు..
కె. గంగాధర్‌, దళిత నాయకుడు, ఎడపల్లి.

సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం

వైన్స్‌ టెండర్లలో గౌడ కులస్తులకు 15శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం ఎంతో ప్రోత్సాహకంగా మారనుంది. ఎప్పటి నుంచో మా వంటి సీనియర్ల ఆలోచనలకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం సంతోషాన్ని కలిగించింది. సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం హర్షణీయం. ఆయనకు రుణపడి ఉంటాం.
-లింగాల లక్ష్మణ్‌ గౌడ్‌, బోధన్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement