e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home కామారెడ్డి ‘సాగర్‌' ఆయకట్టులో సాగు సంబురం

‘సాగర్‌’ ఆయకట్టులో సాగు సంబురం

  • వానకాలం సాగుకు అన్నదాత సన్నద్ధం
  • ఆయకట్టు రైతులకు భరోసా నింపిన ‘నిజాంసాగర్‌’
  • కాళేశ్వరం జలాలతో ఏడున్నర టీఎంసీలకు చేరుకున్న ప్రాజెక్టు
‘సాగర్‌' ఆయకట్టులో సాగు సంబురం

నిజాంసాగర్‌, జూన్‌ 15: వానకాలం పంటల సాగుకు అన్నదాత సన్నద్ధమవుతున్నాడు. ప్రతి సంవత్సరం నిజాంసాగర్‌ ఆయకట్టు కింద ఉన్న బోరుబావులు లేని రైతులు కేవలం ప్రాజెక్టుపై ఆధారపడుతూ వర్షాల కోసం ఎదురు చూసేవారు. వర్షాలు కురిసి నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి నీటి నిల్వలు వస్తేనే వానకాలం సాగుకు సిద్ధపడేవారు. ఆయకట్టు కింద బోరుబావులు ఉన్న రైతులు మే, జూన్‌లోనే పంటలను సాగు చేస్తుండగా నిజాంసాగర్‌ ప్రాజెక్టుపై ఆధారపడిన రైతులు మాత్రం జూలై మొదటి వారం నుంచి చివరి వారం వరకు పంటల సాగుకు శ్రీకారం చుట్టేవారు. అలాంటిది ఈసారి సీఎం కేసీఆర్‌ చొరవతో కాళేశ్వరం నీరు నిజాంసాగర్‌కు రావడంతో బోరుబావులు లేని రైతులు సైతం వానకాలం సాగుకు సిద్ధమవుతున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టు కింద అలీసాగర్‌ వరకు 1.10 లక్షల ఎకరాలు ఉండగా ఇప్పటికే నస్రుల్లాబాద్‌, బీర్కుర్‌, వర్ని, బోధన్‌, ఎడపల్లి, కోటగిరి మండలాల్లోని ఆయకట్టు రైతులు గత నెలలోనే సాగుకు శ్రీకారం చుట్టారు. నిజాంసాగర్‌, బాన్సువాడ మండలాల ఆయకట్టు రైతులు ఈ నెల మొదటి వారంలో సాగు పనులు ప్రారంభించారు. నిజాంసాగర్‌, బాన్సువాడ ఆయకట్టు రైతులకు అంతగా బోరుబావులు లేకపోవడంతో కేవలం నిజాంసాగర్‌ ప్రాజెక్టుపైనే ఆధారపడి ఉండడంతో వర్షాలు కురిసి నిజాంసాగర్‌లోకి ఇన్‌ఫ్లో వస్తేనే తుకాలు వేసేందుకు ఆసక్తి చూపేవారు. ప్రస్తుతం నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి కాళేశ్వరం నీరు రావడం, ప్రాజెక్టులో సుమారు 7.50 టీఎంసీల నీరు ఉండడంతో వారం పది రోజుల నుంచి రైతులు జోరుగా తుకాలు వేసే పనిలో నిమగ్నమయ్యారు. మొదటి ఆయకట్టు రైతులు తుకాలు వేస్తుండగా మిగిలిన ఆయకట్టు రైతులు గత నెలలోనే నాట్లు కూడా వేశారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టులో నీటి నిల్వలు అనుకూలంగా ఉండడంతోపాటు రెండు మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో ఆయకట్టు రైతులు సంతోషంగా ఉన్నారు.

ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు
నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి కాళేశ్వరం నీరు రావడంతో నీటి పారుదల శాఖ అధికారులు సైతం ప్రాజెక్టులో ఉన్న నీటిని ఆయకట్టుకు ఎన్ని తడులు, ఏ విధంగా విడుదల చేయాలి తదితర అంశాలతో ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. జూన్‌, జూలైలో వర్షాలు కురిస్తే ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో పెరగుతుందని అప్పటి వరకు ఉన్న నీటిని ఏ విధంగా వినియోగించుకోవాలి అనే అంశాలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. త్వరలో జరగనున్న డీఐబీ సమావేశంలో నీటి విడుదలకు సంబంధించిన నివేదికను విడుదల చేయనున్నారు.

- Advertisement -

ఏడేండ్లకు.. ఏడున్నర టీఎంసీలు
నిజాంసాగర్‌ ప్రాజెక్టులో జూన్‌ నెలలో ఎప్పుడు నీటి నిల్వలు అంతగా ఉండేవి కాదు. 2014 జూన్‌ రెండో వారంలో ఆరు టీఎంసీలు ఉండగా ఏడేండ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే అంతేస్థాయిలో నీళ్లు ఉండడం విశేషం. బోరుబావులు లేకున్నా ఈ యేడు జూన్‌ మొదటి వారంలోనే పంటల సాగుకు శ్రీకారం చుట్టినందుకు ఆయకట్టు రైతులు సంబురపడుతున్నారు. ప్రతి ఏటా వర్షాలు కురిసి నిజాంసాగర్‌లోకి ఇన్‌ఫ్లో వస్తేనే వానకాలం పంటలకు శ్రీకారం చుట్టేవారమని అలాంటిది ఈ యేడు సాగర్‌లోకి ఇన్‌ఫ్లో వైపు చూడకుండా పంటల సాగుకు శ్రీకారం చుడుతున్నామని రైతులు చెబుతున్నారు.

సాగుకు శ్రీకారం చుట్టాం
నిజాంసాగర్‌ ఆయకట్టు కింద నాకు మూడెకరాలు ఉన్నది. బోరుబావులు లేవు. కేవలం నిజాంసాగర్‌ ప్రాజెక్టుపైనే ఆధారపడి సాగు చేస్తున్నాం. కొన్నిసార్లు నిజాంసాగర్‌లో నీరు లేక పంట చేతికి అందకుండా పోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రతిఏటా వానకాలంలో నిజాంసాగర్‌లోకి నీరు వస్తేనే సాగుకు శ్రీకారం చుట్టేవాళ్లం. అలాంటిది ఈ యేడు కాళేశ్వరం పుణ్యమా ఇప్పుడు సాగుకు శ్రీకారం చుట్టేందుకు ముందుకు సాగుతున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారు చొరవతో నిజాంసాగర్‌ కళకళ లాడుతుంది.
-పోచయ్య, కొమలంచ, రైతు, నిజాంసాగర్‌

ఆయకట్టుకు ఎలాంటి ఢోకా లేదు
నిజాంసాగర్‌ ఆయకట్టు కింద పంట సాగు చేస్తే చేతికి అందే వరకు అనుమానంగానే ఉండేది. వర్షాలు కురిసి రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండి పొంగిపొర్లుతుంటే నిజాంసాగర్‌లోకి మాత్రం చుక్క నీరు వచ్చేది కాదు. కేసీఆర్‌ సారు చొరవతో కాళేశ్వరం నీరు నిజాంసాగర్‌కు రావడంతో మాలాంటి రైతులకు ఊపిరి పోసినట్లయింది.
సొన్నయిల రాములు, రైతు, తున్కిపల్లి, నిజాంసాగర్‌

ఆయకట్టు రైతులకు కాళేశ్వరం ఓ భరోసా
నిజాంసాగర్‌ ఆయకట్టు రైతులకు కాళేశ్వరం నీటి రాక భరోసాగా మారింది. ఎన్నడూ లేని విధంగా ఈ యేడు నిజాంసాగర్‌ ప్రాజెక్టులో నీటి నిల్వలు ఉండడంతో నిజాంసాగర్‌ నుంచి అలీసాగర్‌ వరకు 1.10 లక్షల ఎకరాల సాగుకు రైతన్నలు శ్రీకారం చుట్టారు. మొదటి ఆయకట్టు రైతులు సైతం ముందుగానే సాగు పనులు ప్రారంభించారు. మేము కూడా నీటి విడుదల, ఆయకట్టు కింద సాగు వివరాలు అనే అంశాలతో నివేదిక తయారు చేస్తున్నాం.
-శివప్రసాద్‌, ఏఈ, నిజాంసాగర్‌ ప్రాజెక్టు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘సాగర్‌' ఆయకట్టులో సాగు సంబురం
‘సాగర్‌' ఆయకట్టులో సాగు సంబురం
‘సాగర్‌' ఆయకట్టులో సాగు సంబురం

ట్రెండింగ్‌

Advertisement