విద్యానగర్, జూలై 3: కామారెడ్డి ఏరియా దవాఖాన రెండోసారి కాయకల్ప అవార్డుకు ఎంపికైంది. పేదలకు కార్పొరేట్ దవాఖానల స్థాయిలో సేవలను అందించడంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నందుకు ఈ పురస్కారం దక్కింది. కేంద్ర ప్రభుత్వం శనివారం అవార్డులను ప్రకటించగా.. కామారెడ్డి ఏరియా దవాఖానకు ప్రథమ స్థానం లభించింది. గతంలో 2018-19వ సంవత్సరంలో మొదటిసారి కామారెడ్డి ఏరియా దవాఖానకు కాయకల్ప అవార్డు లభించింది. ఆరు సంవత్సరాలుగా ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. ఈ పురస్కారానికి ఎంపికైన దవాఖానకు రూ.50లక్షల నగదుతో పాటు ప్రోత్సాహక బహుమతిని అందజేస్తున్నారు. కామారెడ్డి ఏరియా దవాఖానలో చెక్‌లిస్టు, రికార్డుల నిర్వహణ, మెరుగైన వైద్యసేవలతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ, వ్యర్థాల ఏరివేత, వైరస్ తదితర రోగాల నివారణలో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు ఈ అవార్డు లభించింది.
అవార్డు ఎంపిక ఇలా..
కాయకల్ప అవార్డుకు పాయింట్ల ఆధారంగా సర్వే నిర్వహించి దవాఖానలను ఎంపికచేస్తారు. కామారెడ్డి ఏరియా దవాఖానకు 80.92 పాయింట్లు రావడంతో అవార్డును సొంతం చేసుకున్నది. దవాఖానను ఇటీవల సందర్శించిన కేంద్రం బృందం.. వైద్యశాలలో అందుతున్న సేవలపై సంతృప్తిని వ్యక్తం చేసింది. మెరుగైన వైద్య సేవలను అందించడంతో పాటు పరిశుభ్రత పాటించడం, దవాఖానలో హెర్బల్ గార్డెన్‌ను ఏర్పాటు చేయడం, రోగులకు పౌష్టికాహారం అందించడం, ఉచిత భోజన సదుపాయం, రోగులపై ప్రత్యేక శ్రద్ధ చూపడం తదితర అంశాలను కేంద్ర బృందం పరిశీలించింది.
అవార్డు అందజేయనున్న కేంద్ర మంత్రి..
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కాయకల్ప అవార్డును త్వరలో అందజేయనున్నారు. అవార్డును దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్‌కుమార్ అందుకోనున్నారు. దవాఖానకు అవార్డు రావడంపై వైద్యసిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దవాఖానల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు సిబ్బంది సమష్టి కృషితోనే అవార్డును సొంతం చేసుకున్నామని దవాఖాన వర్గాలు పేర్కొ న్నాయి. అవార్డులో లభించిన రూ.50లక్షల్లో రూ.12.50 లక్షలను స్టాఫ్‌కు ఇన్సెంటివ్‌గా అందజేస్తారు. మిగిలిన రూ.37.50 లక్షలను దవాఖాన అభివృద్ధికి వినియోగిస్తారు.
చాలా సంతోషంగా ఉంది..
కామారెడ్డి జిల్లా ఏరియా దవాఖానకు రెండోసారి కాయకల్ప అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. దవాఖాన సిబ్బంది కృషితోనే అవార్డు లభించింది. అవార్డుతో వచ్చే నిధులతో దవాఖానలో మరిన్ని సదుపాయాలను కల్పించే వీలు ఏర్పడుతుంది. దవాఖాన వసతులను అన్ని విధాలుగా చక్కదిద్దుతాం.
-డాక్టర్ అజయ్‌కుమార్,సూపరింటెండెంట్, జిల్లా ఏరియా దవాఖాన, కామారెడ్డి