బాన్సువాడ రూరల్, జూన్ 19 : నాన్న అనే రెండక్షరాల్లో ప్రతి వ్యక్తి జీవితం మొత్తం దాగిఉంటుంది. పిల్లలకు మొదటి స్నేహితుడు తండ్రే. చిన్ననాటి నుంచి పిల్లలు వేసే ప్రతిఅడుగు వెనుక తండ్రి ఉంటాడు. తప్పటడుగులు వేసే వయస్సు నుంచి తప్పుడు దిశగా వెళ్తున్న పిల్లలకు మంచి మార్గాన్ని చూపిస్తాడు. తల్లికి భూదేవంత ఓపిక ఉంటే, పిల్లలపై తండ్రికి ఆకాశమంత క్షమాగుణం ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. తండ్రి ఎంత బిజీగా ఉన్నా పిల్లల కోసం మనస్సు పరితపిస్తుంది. తాను ఎన్ని విజయాలు సాధించినా.. పిల్లల గెలుపే తండ్రికి నింగిని గెలిచినంత ఆనందంగా ఉంటుంది. కుటుంబపెద్ద పాత్రతోపాటు బిడ్డలకు ఒక స్నేహితుడిగా, మార్గదర్శకుడిగా నిలిచే తండ్రిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి బిడ్డపై ఉంది. నేడు ఫాదర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం..
1972 నుంచి..
మాతృదినోత్సవం సందర్భంగా తల్లిని ఏ విధంగా గౌరవిస్తామో, బాధ్యతకు మారుపేరుగా నిలిచే నాన్నల కోసం కూడా ఒక రోజును కేటాయించాలని అమెరికాకు చెందిన స్మార్ట్ డాడ్ అనే మహిళ ఆలోచించి ప్రచారం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో 1910లో మొదటిసారి ఫాదర్స్ డేను జరుపుకొన్నారు. ఆ తర్వాత నాన్నల వందన దినోత్సవానికి ఆదరణ పెరుగుతూ వచ్చింది. ప్రపంచ దేశాలు 1972 నుంచి ఏటా జూన్ మూడో ఆదివారాన్ని ఫాదర్స్ డేగా ప్రకటించాయి. అప్పటినుంచి బిడ్డలు బహుమతులు అందించి తండ్రిపై ప్రేమను వ్యక్తపరుస్తున్నారు.
తండ్రిని గౌరవించినప్పుడే..
కష్టాలకోర్చి, తమ జీవితాన్నంతా ధారపోసి ఉన్నతులుగా తీర్చిదిద్దిన అమ్మానాన్నలపై వృద్ధాప్యంలో పిల్లలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న ఘటనలు తరచూ చూస్తున్నాం. తల్లిదండ్రులను గౌరవించినప్పుడే ప్రతిబిడ్డకూ సమాజంలో గుర్తింపు వస్తుంది. చేతగాని సమయంలో తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటేనే మన పిల్లలు కూడా మనల్ని ఆదర్శంగా తీసుకుంటారనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం.